Breaking News

పదేపదే ఎపీకి ద్రోహం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం… : కె.రామకృష్ణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎపీకి ప్రత్యేక హోదా లేనేలేదని, పోలవరం నిర్మాణం ఇప్పట్లో జరగనట్టేనని రాజ్యసభలో కేంద్ర మంత్రులు స్పష్టం చేయడం దుర్మార్గమని, 30 మంది ఎంపీలున్నా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నోరువిప్పడం లేదనీ, ఇలాగే ఉంటే జగన్మోహనరెడ్డి చరిత్ర హీనుడిగా మిగిలిపోతారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఘాటుగా వ్యాఖ్యానించారు. ఎపీ పట్ల కేంద్రం అనుసరిస్తున్న దుర్మార్గపూరిత వైఖరిపై ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు కె.రామకృష్ణ నేడొక ప్రకటన విడుదల చేశారు. ఎపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్ర మంత్రి రావు ఇంద్రజిత్‌సింగ్‌ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. అలాగే పోలవరం ఇప్పట్లో పూర్తి కాదని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఇంకనూ చెల్లించాల్సిన బ్యాలెన్స్‌ నిధులు రూ.2,441.86 కోట్లు మాత్రమేనని కేంద్ర జలశక్తిశాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్‌ టుడు సమాధానం ఇచ్చారు. ఎపీ పట్ల కేంద్రం చిన్నచూపు ప్రదర్శిస్తోందనడానికి ఇవి నిదర్శనాలు. 2017-18 అంచనాల ప్రకారం పోలవరం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయి మొత్తం రూ.15,668 కోట్లుకాగా, అందులో అప్పటికే రూ.13,226 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించేసామని చెబుతున్నారు. ఎపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పోలవరానికి జరిగిన నిధుల విడుదలపై వాస్తవాలను వెల్లడిరచాలని డిమాండ్‌ చేస్తున్నాం. గత 8 సంవత్సరాలుగా కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం పదేపదే ఆంధ్రప్రదేశ్‌కు ద్రోహం చేస్తోంది. విభజన చట్ట హామీలేవీ అమలు చేయలేదు. ప్రత్యేక హోదాపై మాట మార్చారు. ఎపీ నుండి 30 మంది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలున్నందున ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వ వైఖరిని జగన్మోహన్‌రెడ్డి ఎండగట్టాలి. కేంద్ర ప్రభుత్వ ద్రోహంపై తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి. రాష్ట్రానికి దక్కాల్సిన వాటిపై కేంద్రంతో పోరుకు సమయత్తం కావాలి. కేంద్రానికి లొంగిపోవడం ఇకనైనా మానకపోతే వైసిపి ప్రభుత్వాన్ని చరిత్ర క్షమించదు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్

-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *