-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముస్లిం మైనార్టీలను అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి విశేషంగా కృషి చేస్తున్నారని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని అజిత్ సింగ్ నగర్ షాదీఖానా ఈద్గా నందు ముస్లిం సోదరులతో కలిసి శనివారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మైనార్టీలకు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దఎత్తున సంక్షేమాన్ని అందిస్తోందని.. అది చూసి ఓర్వలేక టీడీపీ ఒక ఏడుపు పార్టీగా తయారైందని మల్లాది విష్ణు అన్నారు. ముస్లింలపై తెలుగుదేశం నేతలది కపట ప్రేమ అని.. తన పరిపాలనలో మైనార్టీలను చంద్రబాబు అణచివేయాలని చూశారన్నారు. కనీసం మంత్రివర్గంలోనూ స్థానం కల్పించకుండా నాలుగున్నరేళ్లు ముస్లింలను దూరం పెట్టి అవమానించిన వ్యక్తి చంద్రబాబు అని ఆరోపించారు. గుంటూరులో అక్రమ కేసులతో మైనార్టీ సోదరులను వేధింపులకు గురిచేసిన సైతాన్ అని దుయ్యబట్టారు. ఈ ప్రభుత్వం వచ్చాక ఆ కేసులన్నింటినీ ఎత్తివేయడం జరిగిందనని మల్లాది విష్ణు తెలిపారు.
మైనార్టీలకు చంద్రబాబు చేసిందేమీ లేదు
మైనార్టీలకు చంద్రబాబు చేసిందేమీ లేదని మల్లాది విష్ణు విమర్శించారు. ఆనాడు దివంగత మహానేత వైఎస్సార్ మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్ తీసుకువస్తుంటే.. కోర్టులకు వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. గత టీడీపీ పాలనలో మైనార్టీ సంక్షేమం కోసం కేవలం ఖర్చుచేసింది రూ. 2,665 కోట్లు మాత్రమేనని.. ఈ ప్రభుత్వం నాలుగేళ్లలో 60,54,839 మైనార్టీలకు వివిధ పథకాల ద్వారా రూ. 20 వేల కోట్లకు పైగా లబ్ది చేకూర్చినట్లు వివరించారు. ఇమామ్‌లు, మౌజమ్‌లకు ఇచ్చే గౌరవ భృతిని గత ప్రభుత్వం పక్కనపెడితే ఈ ప్రభుత్వం ఆ బకాయిలు చెల్లించడమేకాక పెంచిన గౌరవ భృతిని అందిస్తోందన్నారు. ఉర్దూ భాషకు రాష్ట్ర రెండో అధికార భాష హోదా కల్పించడంతో పాటు.. ముస్లిం మైనార్టీలకు సంబంధించిన సబ్‌ప్లాన్‌కు చట్టబద్దత కల్పించడం జరిగిందన్నారు. ఐదుగురు ఉపముఖ్యమంత్రులలో ఒకరిని మైనార్టీ వర్గాల నుంచి ఎంపిక చేసి.. రాజకీయంగా ముస్లింలకు పెద్దపీట వేస్తున్నట్లు చెప్పారు.
ఈద్గాతో ప్రత్యేక అనుబంధం
ముస్లిం మైనార్టీలు ఎక్కువ మంది నివసించే అజిత్ సింగ్ నగర్ పరిసర ప్రాంతంలో గతంలో తాను ఎమ్మెల్యేగా ఉండగానే ఈద్గాకు స్థలం కేటాయించడం జరిగిందని మల్లాది విష్ణు తెలిపారు. దీంతో ఏటా రంజాన్, బక్రీద్ వేళల్లో ముస్లిం సోదరులు ఈ ప్రాంతంలో ప్రార్థనలు నిర్వహించుకునేందుకు మార్గం సుగుమం అయిందన్నారు. అలాగే ఈద్గా పరిరక్షణతో పాటు ప్రార్థనలకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడంలో భాగంగా రూ. 19.95 లక్షల వ్యయంతో ప్రహరీని నిర్మించి గేటు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే మత పెద్దలు తమ దృష్టికి తీసుకురావాలని.. పరిష్కరించేందుకు ఎల్లవేళలా తాము సిద్ధంగా ఉన్నట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా మైనార్టీ సోదరులకు మరోసారి హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో నాయకులు అవుతు శ్రీనివాసరెడ్డి, అఫ్రోజ్, ఎండి యాకూబ్, షేక్ జానీ, షేక్ అలీ, ఖాన్, ఈద్గా కమిటీ అధ్యక్షులు షేక్ నాగూర్, కమిటీ సభ్యులు రసూల్, జలీల్, రహీం, షేక్ హామద్, షేక్ వలి, ముస్లిం సోదరులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.