మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్నో యేళ్ళుగా ఎదురుచూస్తున్న ఎంతోమంది పేద ప్రజల సొంతింటి కల సాకారం కానుంది. సరైన గృహ వసతి లేక ఇబ్బంది పడుతున్న పేద ప్రజలు గౌరవప్రదంగా జీవించే అవకాశం రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది.
రాష్ట్రంలో పీఎంఏవై- నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకం ద్వారా జి ప్లస్ 3 విధానంలో షేర్ వాల్ టెక్నాలజీతో 2,62,216 ఇళ్లను నిర్మిస్తున్నారు. అందులో భాగంగా కృష్ణాజిల్లాలో నిర్మిస్తున్న మొత్తం ఇల్లు 13,712 కాగా అందులో ఒక్క గుడివాడ మల్లాయపాలెం లోని వైయస్సార్ జగనన్న నగర్ ఒకే చోట 8,912 ఇళ్లతో రాష్ట్రంలోనే అతిపెద్ద టిడ్కో లేఅవుట్ గా రూపుదిద్దుకుంది.
ఈ నెల 16వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈ టిడ్కో గృహాలను లాంచనంగా ప్రారంభించి లబ్ధిదారులకు అందజేయనున్నారు. జిల్లా కలెక్టర్ రాజాబాబు నేతృత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు అన్ని ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేస్తోంది.
లబ్ధిదారులందరూ గృహప్రవేశం చేసేందుకు ఉవ్విల్లూరుతున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా ఒక పండుగ వాతావరణం నెలకొంది.
గుడివాడ శాసనసభ్యులు కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు ( నాని) ప్రత్యేక చొరవతో ఒక పెద్ద కాలనీగా ఏర్పడుతున్న ఈ గుడివాడ వైయస్సార్ జగనన్న నగర్ 77.46 ఎకరాలలో 720.28 కోట్ల రూపాయల వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది.
ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా 133.68 కోట్ల రూపాయలు కాగా రాష్ట్ర ప్రభుత్వ వాటా 289.94 కోట్ల రూపాయలు, లబ్ధిదారుని వాటా బ్యాంకు రుణంతో కలిపి మరో 296.66 కోట్ల రూపాయలు ఉన్నాయి.
అందులో తొలి విడతలో 3,296 గృహాలు నిర్మాణం కాగా రెండవ విడతలో 5,616 గృహాలు నిర్మించారు.
అందులో 300 చదరపు అడుగులవి 1584 గృహాలు, 365 చదరపు అడుగులవి 992 గృహాలు, 430 చదరపు అడుగులవి 6336 గృహాలు ఉన్నాయి.
ఈ టిడ్కో గృహాలలో 300 చదరపు అడుగుల ప్లాట్ విలువ 6.50 లక్షల రూపాయలకు గాను కేంద్ర ప్రభుత్వం 1.50 లక్షల రూపాయలు సమకూరుస్తుండగా మిగిలిన మొత్తం 5.05 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వమే సబ్సిడీ ఇస్తోంది. లబ్ధిదారుడు ముందుగా చెల్లించవలసిన వాటాను 500 రూపాయల నుండి కేవలం ఒక రూపాయికే ఇవ్వటం జరుగుతున్నది
అలాగే 365 చదరపు అడుగుల ప్లాట్ విలువ 7.55 లక్షల రూపాయలకు గాను కేంద్ర ప్రభుత్వం 1.50 లక్షల రూపాయలు సమకూరుస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం 2.65 లక్షల రూపాయలను సబ్సిడీగా అందజేస్తుంది . మిగిలిన 3.15 లక్షల రూపాయలను వాయిదాల రూపంలో బ్యాంకు రుణం ద్వారా తీర్చుటకు అవకాశం కల్పించింది. ముందుగా చెల్లించవలసిన వాటాను 50 వేల రూపాయల నుంచి 25 వేల రూపాయలకు ప్రభుత్వం తగ్గించింది.
అదేవిధంగా 430 చదరపు అడుగుల ఫ్లాట్ విలువ 8.55 లక్షల రూపాయలకు గాను కేంద్ర ప్రభుత్వం 1.50 లక్షల రూపాయలు సమకూరుస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం 2.90 లక్షల రూపాయలను సబ్సిడీ రూపంలో ఇస్తుంది. మిగిలిన 3.65 లక్షల రూపాయలను వాయిదాల రూపంలో బ్యాంకు రుణం ద్వారా చెల్లించే అవకాశం ప్రభుత్వం కల్పించింది. లబ్ధిదారుడు ముందుగా చెల్లించవలసిన వాటాను ఒక లక్ష రూపాయల నుంచి 50 వేల రూపాయలకు ప్రభుత్వం తగ్గించింది.
రాష్ట్ర ప్రభుత్వం అన్ని చదరపు అడుగుల ప్లాట్లకు ఎటువంటి రిజిస్ట్రేషన్ చార్జీలు లేకుండా ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయించింది.
ఈ టిడ్కో గృహాల ప్రాంగణంలో రాకపోకలకు వీలుగా అప్రోచ్ రహదారులు, సిమెంట్ కాంక్రీట్ రహదారులు, కాలువలు వరద కాలువలు, కల్వర్టులు, నీటి సరఫరా జలాశయాలు, పైప్లైన్లు, అంతర్గత నీటి సరఫరా విభాగం, మురుగునీటి శుద్ధి కర్మాగారం, విద్యుత్తు వంటి సామాజిక మౌలిక సదుపాయాలు 48.52 కోట్ల విలువతో ఉచితంగా లబ్ధిదారులకు ప్రభుత్వం కల్పించింది.