– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
-24 వ డివిజన్ 36 వ సచివాలయ పరిధిలో రెండో రోజు గడప గడపకు మన ప్రభుత్వం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న అత్యుత్తమ విధానాలు, విప్లవాత్మకమైన సంస్కరణలు ఆంధ్రప్రదేశ్ ను దేశంలో అగ్రపథాన నిలిపాయని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 24 వ డివిజన్ 36 వ వార్డు సచివాలయ పరిధిలో శుక్రవారం జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కుక్కల అనితతో కలిసి ఆయన పాల్గొన్నారు. ప్రజాశక్తి నగర్లో విస్తృతంగా పర్యటించి 175 గడపలను సందర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పారదర్శక పాలన, ఇంటి వద్దకే ప్రభుత్వ సేవలను అందించడం వంటి నిర్ణయాలతో ప్రజలలో సంతృప్తి స్థాయి విపరీతంగా పెరిగిందని మల్లాది విష్ణు అన్నారు. అన్ని వర్గాల ప్రజల నుంచి ఈ ప్రభుత్వానికి ఆదరణ మెండుగా లభిస్తోందని వెల్లడించారు. పర్యటనలో 90 శాతానికి పైగా ప్రజలు సానుకూల స్పందన వ్యక్తం చేయడం సంతోషాన్ని కలిగించిందన్నారు. అనంతరం స్థానిక సమస్యలపై ఆరా తీసి.. సత్వర పరిష్కారానికి అధికారులకు పలు సూచనలు చేశారు.
సచివాలయ పరిధిలో రూ. 2.05 కోట్ల సంక్షేమం
నవరత్నాల కార్యక్రమాల ద్వారా సచివాలయ పరిధిలో అక్షరాలా 2 కోట్ల 5 లక్షల 43 వేల 722 రూపాయల సంక్షేమాన్ని నాలుగేళ్లలో అందజేసినట్లు మల్లాది విష్ణు వెల్లడించారు. వైఎస్సార్ పింఛన్ కానుక ద్వారా ప్రతినెలా 95 మందికి క్రమం తప్పకుండా ఇంటి వద్దకే పింఛన్ అందిస్తున్నట్లు తెలిపారు. అమ్మఒడి ద్వారా 69 మందికి రూ. 30.81 లక్షలు., ఆసరా ద్వారా 89 మందికి రూ. 44.47 లక్షలు., సున్నావడ్డీ ద్వారా 91 మందికి రూ. 3.01 లక్షలు., చేయూత ద్వారా 34 మందికి రూ. 16.12 లక్షలు., విద్యాదీవెన-వసతీదీవెన ద్వారా 66 మందికి రూ.31.01 లక్షలు., వాహనమిత్ర ద్వారా ఆరుగురికి రూ. 1.50 లక్షల ఆర్థిక సాయాన్ని ఇప్పటివరకు అందజేసినట్లు వివరించారు. అలాగే పేదల సొంతింటి కలను సాకారం చేస్తూ 72 మందికి సచివాలయ పరిధిలో ఇళ్ల పట్టాలు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.
చంద్రబాబుకి ఓటమి భయం పట్టుకుంది
రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారైందని మల్లాది విష్ణు విమర్శించారు. అటువంటిది ప్రజల భవిష్యత్తుకు భరోసా కల్పిస్తామని చంద్రబాబు అనడం హాస్యాస్పదమన్నారు. అధికారంలో ఉండగా ఆంధ్రప్రదేశ్ ను అప్పుల ప్రదేశ్ గా మార్చి.. ఇప్పుడు రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. చివరికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలోని పథకాలను దొంగలించిన బాబు.. తిరిగి మాపై ఏడవడం విడ్డూరంగా ఉందన్నారు. తెలుగుదేశం నేతల ఓటమి భయం వారి మాటలలో స్పష్టంగా కనిపిస్తోందని మల్లాది విష్ణు అన్నారు. విశ్వసనీయత లేని టీడీపీ అధినేత చంద్రబాబును రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ నమ్మరని పేర్కొన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన పేదలను కనీసం పట్టించుకోకుండా కార్పొరేట్ వ్యవస్థకు కొమ్ముకాశారని ఆరోపించారు. పేద ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా మనసులో మాట పేరుతో ఏకంగా ఒక పుస్తకమే ముద్రించిన చంద్రబాబుకి.. ఈ ప్రభుత్వం గురించి మాట్లాడే నైతిక అర్హత ఎక్కడిదని ప్రశ్నించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిపాలనలో స్వచ్ఛమయిన మార్పులకు శ్రీకారం చుట్టారని మల్లాది విష్ణు అన్నారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక సంస్కరణల ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో అగ్రగామిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలిపారన్నారు. 99 శాతం హామీల అమలుతో ప్రజల జీవన స్థితిగతులలో కనీవినీ ఎరుగని రీతిలో మార్పు తీసుకొచ్చారని పేర్కొన్నారు. హామీల అమలుపై ఎక్కడైనా చర్చకు తాము సిద్ధమని సవాలు విసిరారు. వచ్చే ఎన్నికల్లో ఎన్ని పార్టీలు కలిసి పోటీచేసినా ప్రజాబలంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఏఎంఓహెచ్ రామకోటేశ్వరరావు, సీడీఓ జగదీశ్వరి, నాయకులు కుక్కల రమేష్, కొమ్ము చంటి, బెల్లపు సత్యనారాయణ, కంభంపాటి మోజస్, నాగభూషణం, చింతకాయల చిట్టిబాబు, క్రాంతి, అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Tags vijayawda
Check Also
ప్రజలు గడ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేతలు
-మనోభావాలు దెబ్బతినే విధంగా పండుగలపైనా ప్రేలాపనలు -రూ.850 కోట్లతో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …