మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా ముఖ్యపట్టణం మచిలీపట్నం నగరపాలక సంస్థ పరిధిలో నగర సుందరీ కరణ పనులు చేపట్టి నగరం ప్రతిష్ట పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ను ఆదేశించారు.గురువారం జిల్లా కలెక్టర్ కలెక్టరేట్లో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, నగరపాలక సంస్థ సిబ్బందితో సమావేశం నిర్వహించి పట్టణ సుందరీకరణకు తీసుకోవలసిన చర్యలపై చర్చించారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుటకు అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు.నగర ప్రవేశ ద్వారాలు ఏర్పాటు తో పాటు, వివిధ ప్రాంతాల్లో సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ప్రధాన రహదారులలో సెంట్రల్ లైటింగ్ సజావుగా వెలిగేలా చూడాలన్నారు. కూడళ్లను అభివృద్ధి చేసి పూల మొక్కలతో అందంగా తీర్చిద్దాలన్నారు.శనివారం నగరంలో పర్యటిస్తామని కలెక్టర్ అన్నారు. పట్టణ పరిధిలో చూడదగిన ప్రదేశాలు టూరిజం అభివృద్ధికి అవకాశం గల ప్రదేశాలు గుర్తించాలన్నారు.ముఖ్యంగా నగరంలో సాయంత్రానికి రోడ్లపై పశువుల సంచారం ఎక్కువగా ఉంటున్నదని, అట్టి పశువుల యజమానులకు నోటీసులు జారీ చేయాలని, కొంత సమయం ఇచ్చి వారి పశువులను రోడ్లపై వదలకుండా నియంత్రణలో ఉంచుకునే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. అతిక్రమించిన పశువుల యజమానులకు నిబంధనల మేరకు పెనాల్టీలు విధించడం అట్టి పశువులను బందుల దొడ్డిలో ఉంచడం వంటి చర్యలు చేపట్టాలన్నారు.కృష్ణ విశ్వవిద్యాలయం రహదారి పరిశుభ్రంగా ఉంచాలన్నారు. రాష్ట్ర గవర్నర్ ఇటీవల కృష్ణా విశ్వవిద్యాలయం సందర్శించినప్పుడు నగరం లో నుండి ప్రయాణిస్తూ పరిశీలించారని, నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలని సూచించారని, మూడు నెలల్లో నగరానికి వస్తామన్నారని కలెక్టర్ తెలిపారు.ఇంటింటి చెత్త సేకరణ, సేకరించిన చెత్తను వేరుపరచి తరలించడం వంటి కార్యక్రమాల గురించి కమిషనర్ను అడిగి తెలుసుకున్నారు.నగరపాలక సంస్థ పరిధిలో ఆస్తి పన్ను , వృత్తి పన్ను, స్టాంప్ డ్యూటీ , వినోద పన్ను వంటి వివిధ రకాలైన పన్నుల వసూలు గురించి కలెక్టర్ ఆరా తీశారు.నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు మున్సిపల్ కార్పొరేషన్, ముడ, టూరిజం, పోలీస్ సంబంధిత శాఖల అధికారులతో త్వరలో సమావేశం నిర్వహిస్తామన్నారు.ఈ సమావేశంలోనగరపాలక సంస్థ కమిషనర్ చంద్రయ్య సహాయ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు
Prajavartha Online Telugu News