-బటన్ నొక్కి ప్రారంభించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో నియోజకవర్గం విద్యుద్దీప కాంతులతో వెలిగిపోతోందని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. న్యూ రాజరాజేశ్వరిపేట వంతెనపై ఏర్పాటు చేసిన కొత్త విద్యుత్ లైట్లను డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ ఇసరపు దేవీ రాజారమేష్ తో కలిసి బటన్ నొక్కి శనివారం ఆయన ప్రారంభించారు. నిత్యం వందలాది మంది సంచరించే వంతెనపై నూతన లైటింగ్ వ్యవస్థ ద్వారా రాత్రుళ్లు ప్రమాదాలను నివారించడంతో పాటు కాలనీవాసులకు భద్రత ఏర్పడుతుందని మల్లాది విష్ణు తెలిపారు. గత ప్రభుత్వంలో నియోజకవర్గ వ్యాప్తంగా గాఢాంధకారం అలుముకుందని.. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే చివరి కాలనీ వరకు విద్యుత్ వెలుగులు ప్రసరిస్తున్నాయన్నారు. ఇప్పటికే ఉడాకాలనీ, నందమూరి నగర్, న్యూ ఆర్.ఆర్. పేట, గవర్నమెంట్ ప్రెస్ సెంటర్ సహా పలు సమస్యాత్మక కూడళ్ల వద్ద ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లతో ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గిందని వెల్లడించారు. అలాగే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా నియోజకవర్గ వ్యాప్తంగా పదుల సంఖ్యలో విద్యుత్ స్తంభాలు, వందల సంఖ్యలో విద్యుత్ దీపాలు అమర్చినట్లు చెప్పారు. ముఖ్యంగా దాబా కొట్ల సెంటర్ నుంచి కండ్రిక చౌరస్తా వరకు రూ. 24 లక్షల వ్యయంతో 2.5 కి.మీ మేర ఏర్పాటు చేసిన మల్టీ కలర్ డెకరేటివ్ రోప్ లైటింగ్ సిస్టం చూపరులను విపరీతంగా ఆకట్టుకుంటోందని తెలిపారు. ఇంకా ఎక్కడైన సమస్యలు ఉన్నట్లయితే ప్రజలు తమ దృష్టికి తీసుకురావాలని.. వాటన్నింటినీ తక్షణమే పరిష్కరించడం జరుగుతుందని తెలియజేశారు. కార్యక్రమంలో ఈఈ(ఎలక్ట్రికల్) వెంకటేశ్వరరెడ్డి, డీఈ ఫణీంద్ర కుమార్, డివిజన్ కోఆర్డినేటర్ కాళ్ల ఆదినారాయణ, వీఎంసీ విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.