-ప్రతి ఒక్క పశువుకు టీకాలు వెయ్యాలి
-కలెక్టర్ మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ ఉచిత సామూహిక గాలి కుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమము జిల్లాలో విజయవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. శనివారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో “గాలి కుంటు వ్యాధి నివారణ టీకా” ల ప్రచార కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా కె. మాధవీలత మాట్లాడుతూ, జిల్లాకు సంబంధించిన గాలి కుంటు వ్యాధి నివారణ టీకాలు కార్యక్రమాన్ని సకాలములో పూర్తిచేయాలని ఆదేశించారు. 2024 జనవరి 2 వ తేదీ మంగళవారం నుంచి నెల రోజులు పాటు ” జాతీయ గాలి కుంటు వ్యాధి నివారణ “కార్యక్రమము నిర్వహించనున్నట్లు తెలిపారు. , ఈ కార్యక్రమము లో పశు సవర్ధక శాఖ సిబ్బంది యావన్మంది పాల్గొని, క్షేత్ర స్థాయి విస్తృత ప్రచారము నిర్వహించాలన్నారు. జిల్లా లో ఉన్న 2 లక్షల 36 వేల 7 వందలు ఆవులు మరియు గేదెలకు నిబంధనల ప్రకారం టీకాలు వేయాలని తెలియజేశారు.
సామూహిక టీకాల కార్యక్రమము ప్రతీ ఆర్భికే స్థాయిలో నిర్వహించాల్సి ఉందన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ తయారు చేసి తదనుగుణంగా కార్యక్రమము నిర్వహించాలని ఆదేశించారు. జాతీయ గాలి కుంట వ్యాధి నివారణ కోసం జిల్లాలో పశువులకు వేసిన నిర్వహించిన టీకాల వివరాలు రైతువారిగా “భారత్ పశు ధన్” యాప్ లో ఎప్పటికప్పుడు అప్ లోడ్ చేయాలని స్పష్టం చేశారు.
ప్రతీ రోజు ఉదయం గం. 6.30 ల నుండి టీకాల కార్యక్రమము ప్రారంబించాలని, కోల్డ్ చైన్ విధానం పాటించాలని సూచించారు. క్షేత్ర స్థాయి లో చేపట్టే టీకా కార్యక్రమం లో జిల్లా లో ఉన్న ప్రజా ప్రతినిధులను ఆహ్వానించి ఈ కార్యక్రమము లో భాగస్వాములను చేయాలని అన్నారు. ఎప్పటికప్పుడు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షణ చేయుటకు జిల్లా స్థాయిలో జిల్లా మానిటరింగ్ యూనిట్ ను ఏర్పాటు చేశామన్నారు. ఈ కమిటీ కి జిల్లా కలెక్టర్ ఛైర్మన్ గాను, జిల్లా పశు సంవర్ధక శాఖాధికారి కన్వీనర్ గాను, డివిజినల్ స్థాయి ఉప సంచాలకులు మరియు రీజినల్ పశు వ్యాధి నిర్ధారణాలయం ఉప సంచాలకులు సభ్యులు గా వ్యవహరిస్తూ నిర్దేశించిన సమయం అనగా ది. 02.01.2024 నుండి 30 రోజుల్లో నాలుగు నెలల వయసు దాటిన ప్రతీ పశువుకు టీకాలు తప్పకుండా వేసేలాగా ఈ కమిటీ పర్యవేక్షించడం జరుగుతుందని తెలిపారు.
ఈ జాతీయ గాలికుంటు వ్యాధి నివారణ కార్యక్రమము రైతులకు ఆర్ధికంగా నష్టం కలుగకుండా మరియు జాతీయ ఆదాయం లో వృద్ధి సాదించడం కొరకు నిర్దేశించబడినదని జిల్లా పశు సంవర్ధక అధికారి డా ఎస్ జి టి సత్య గోవింద్ తెలియజేసినారు. కావున రైతులకు పూర్తిగా అవగాహన కల్పించి సామూహిక టీకాల నిర్వహణ నిర్దేశించిన సమయములో పూర్తి చేయాలని క్షేత్ర స్థాయి లో కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసి అందచేశా మని పేర్కొన్నారు . ఈ కార్యక్రమము లో జిల్లా పశు సంవర్ధక శాఖాధికారి ఎస్ జి టి సత్య గోవింద్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News