-ఇతర దేశాల ఎన్నికల నిర్వహణ సంస్థలకు భారత ఎన్నికల సంఘం ఆహ్వానం
-23 దేశాలకు చెందిన ఎన్నికల నిర్వహణ సంస్థల నుండి వచ్చిన 75 మంది ప్రతినిథులు
నిర్వచన్ సదన్, న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
భారత ఎన్నికల సంఘం ఎన్నికల సమగ్రత మరియు పారదర్శకతకు దీపస్తంభంగా సార్వత్రిక ఎన్నికలను నిర్వహించడంలో తన నిబద్ధతను చాటుకుంటూ.. అత్యున్నత ప్రమాణాలతో ప్రజాస్వామ్య ఔన్నత్యాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు ప్రపంచ ఎన్నికల నిర్వహణ సంస్థలకు (EMBలు) బంగారు వారధిని అందిస్తోంది. 2024 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఎన్నికల సందర్శకుల కార్యక్రమాన్ని (IEVP) నిర్వహించడం ద్వారా భారత ఎన్నికల సంఘం అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించడం అనే పరంపరను కొనసాగిస్తోంది.
భారత ఎన్నికల సంఘం ఆహ్వానం మేరకు గతంలో ఎన్నడూ లేనంత భారీ స్థాయిలో ఈసారి దేశంలో ఎన్నికల ప్రక్రియను పరిశీలించేందుకు ప్రతినిథులు రావడం జరిగింది. భూటాన్, మంగోలియా, ఆస్ట్రేలియా, మడగాస్కర్, ఫిజీ, కిర్గిజ్ రిపబ్లిక్, రష్యా, మోల్డోవా, ట్యునీషియా, సీషెల్స్, కంబోడియా, నేపాల్, ఫిలిప్పీన్స్, శ్రీలంక, జింబాబ్వే, బంగ్లాదేశ్, కజకిస్తాన్, జార్జియా, చిలీ, ఉజ్బెకిస్థాన్, మాల్దీవులు, పపువా న్యూ గినియా, నమీబియా వంటి 23 దేశాల నుండి వివిధ EMBలు మరియు సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 75 మంది ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అదే విధంగా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఫర్ ఎలక్టోరల్ సిస్టమ్స్ (IFES) సభ్యులు మరియు భూటాన్, ఇజ్రాయెల్ దేశాల మీడియా బృందాలు కూడా పాల్గొననున్నాయి.
మే 4వ తేదీ నుండి, ఈ కార్యక్రమం భారతదేశ ఎన్నికల వ్యవస్థ యొక్క సూక్ష్మ నైపుణ్యాలతో పాటు ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యం ఉపయోగించే ఉత్తమ విధానాలను విదేశీ ఎన్నికల నిర్వహణ సంస్థలకు (EMBs) పరిచయం చేయడానికి ప్రయత్నిస్తుంది. ప్రధాన ఎన్నికల కమీషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ మరియు డాక్టర్ సుఖ్బీర్ సింగ్ సంధు మే 5, 2024న ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత ప్రతినిధులు ఆరు రాష్ట్రాలైన మహారాష్ట్ర, గోవా, గుజరాత్, కర్ణాటక, మధ్య ప్రదేశ్, మరియు ఉత్తరప్రదేశ్ లలోని వివిధ నియోజకవర్గాలలో ఎన్నికలను మరియు ఎన్నికల సంసిద్ధతను పరిశీలించేందుకు పర్యటిస్తారు. 9 మే 9, 2024 వరకూ ఈ కార్యక్రమం కొనసాగుతుంది.