-సీఎంకు సీనియర్ జర్నలిస్టు నిమ్మరాజు వినతి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అక్షర శిఖరం, అక్షర యోధుడు దివంగత చెరుకూరి రామోజీరావు పేరిట వివిధ రంగాలకు చెందిన మీడియా జర్నలిస్టులకు అవార్డులు ప్రకటించాలని సీనియర్ జర్నలిస్ట్, ప్రెస్ అకాడమీ ఉమ్మడి రాష్ట్ర గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు, ఏపీయూడబ్ల్యూజె ఉమ్మడి రాష్ట్ర మాజీ కార్యదర్శి నిమ్మరాజు చలపతిరావు ఓ ప్రకటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేశారు. సరిగ్గా 50ఏళ్ల క్రితం విప్లవాత్మక భావాలతో ఈనాడు పత్రిక ప్రారంభించిన రామోజీరావు వేలాదిమంది యువకులకు శిక్షణ ఇచ్చి జర్నలిస్టులుగా తీర్చిదిద్దారని గుర్తు చేశారు. పత్రికా రంగం ద్వారా వివిధ రంగాల్లో ప్రజలకు ఎలా సేవలందించవచ్చో నిరూపించిన మహోన్నత వ్యక్తి అంటూ నిమ్మరాజు కొనియాడారు. ఎల్లవేళలా సమాజహితం కోరుకునే వారన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రామోజీరావు సంస్మరణ సభను నిర్వహించడమే కాకుండా ఆయన పేరిట విశాఖలో చిత్రనగరి, అమరావతిలో విజ్ఞాన కేంద్రం, ఒక రహదారికి ఆయన పేరిట నామకరణం చేస్తామని ప్రకటించడం అభినందనీయమన్నారు. నేటి తరం జర్నలిస్టులు ఆయన స్ఫూర్తితో రాణించేందుకు నిష్పక్షపాత రాజకీయ, కళా, వ్యవసాయ రంగాలు, అలాగే ఈనాడు వసుంధర ప్రత్యేక పేజీ స్ఫూర్తితో మహిళా సమస్యల పట్ల పరిశోధనగాత్మక లేదా సమాజ హిత కథనాలు ప్రచురించిన, ప్రసారం చేసిన ఉత్తమ మీడియా జర్నలిస్టులకు ప్రతిఏటా రామోజీరావు పేరిట వర్ధంతి లేదా జయంతి నాడు ఆయన గౌరవార్థం రాష్ట్ర ప్రభుత్వమే అవార్డులు అందజేయాలని ఈమేరకు రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథికి చలపతిరావు లేఖ రాశారు.