Breaking News

పెద్దవాగు ముంపు ప్రాంతాలు, గోదావరి వరద బాధిత ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టి, ఆదుకోవాలి

-సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
పెద్దవాగు గండిపడి మునిగిపోయిన ప్రాంతాలు, గోదావరి వరద ముంపు ప్రాంతాలలో రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టి, ప్రజానీకాన్ని ఆదుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈరోజు రామకృష్ణ నేతృత్వంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు అక్కినేని వనజ, డేగ ప్రభాకర్, సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి ఎం కృష్ణ చైతన్య తదితరులతో కూడిన సిపిఐ ప్రతినిధి బృందం పశ్చిమగోదావరి జిల్లా వేలేరుపాడు కుక్కునూరు మండలాల్లోని పెద్దవాగు ముంపు ప్రాంతాలలో పర్యటించింది.

ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయన్నారు. కుంభవృష్టి కారణంగా చాలాచోట్ల గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. పోలవరం ముంపు ప్రాంతాలైన వేలేరుపాడు కుక్కునూరు మండలాల్లో పెద్ద వాగు ప్రాజెక్టు తెగిపోవటం వల్ల చాలా నష్టం జరిగి వేలాది కుటుంబాలవారు నిరాశ్రయులయ్యారని తెలిపారు. వేలాది ఎకరాల్లో ఇసుక మేటలేసి పంట నష్టం జరిగిందని, ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఈ పరిస్థితులపై వెంటనే స్పందించాలాన్నారు. నిన్న ఏపీ మంత్రి పార్థసారథి, ఈరోజు తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ ప్రాంతాల్లో పర్యటించారన్నారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యమే పెద్దబాబు గంటకి కారణమని తెలిపారు.

ఎడతెగని వర్షాల వల్ల, తుఫాను వల్ల ప్రజలు చాలా ఇబ్బందుల్లో, నష్టాల్లో, కష్టాల్లో ఉన్నారని. తక్షణమే ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన ప్రజల్ని ఆదుకునే చర్యలు చేపట్టాలని కోరారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టులకు సక్రమంగా నిధులు కేటాయించకపోవడం వల్ల మరమ్మతులకు నోచుకోక అస్తవ్యస్తంగా మారాయని, గతంలో జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలోని అన్నమయ్య, పింఛ ప్రాజెక్టులు కొట్టుకు పోయినా పట్టించుకోలేదన్నారు. పెద్ద వాగు ప్రాజెక్టుకు కూడా నిధులు ఇవ్వకపోవడం వల్ల ఇప్పుడు ఈ ప్రమాదం సంభవించిందని తెలుస్తోందన్నారు. పెద్దవాగు ప్రాజెక్టు తెలంగాణ ప్రాంతంలో ఉండగా, ఆయకట్టు ప్రాంతమంతా ఆంధ్ర ప్రాంతంలోనే ఉందని; గతంలో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో పెద్దబాబుకు గండి పడటానికి ఆస్కారం అయ్యిందన్నారు. గోదావరి పరివాహక ప్రాంతంలో ముఖ్యంగా పోలవరం నిర్వాసితులు ఉండే ప్రాంతంలో అధిక వర్షాలు వరదల కారణంగా పలు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని; పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో గత పాలక ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పలు సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. జాతీయ ప్రాజెక్టును పూర్తి చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిందని విమర్శించారు. పోలవరం నిర్మాణం వల్ల భూములు కోల్పోతున్న వారు, గ్రామాలకు గ్రామాలు ఖాళీ చేయాల్సిన పోలవరం నిర్వాసితులు వానలు వచ్చిన సందర్భంలో పదేపదే నష్టపోతున్నారన్నారు. పునరావాసం కోసం పరుగులు పెడుతున్నారని; దళితులు, గిరిజనులు ఎక్కువగా ఉన్న పోలవరం ముంపు ప్రాంతాలపై ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. నిర్వాసితులకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. పెద్దవాగు ప్రాజెక్టు విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తక్షణమే స్పందించి బాధిత 15 గ్రామాల ప్రజలను తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. పెద్ద వాగు ప్రాజెక్టు పునః నిర్మాణానికి తగు నిధులు కేటాయించాలని కోరుతామని, వరద బాధిత ప్రాంతాల పరిస్థితులను ముఖ్యమంత్రి, రెవిన్యూ మంత్రిల దృష్టికి తీసుకువస్తామని తెలిపారు.

పెద్దబాబు ముంపునకు తోడు భారీ వర్షాల వల్ల గోదావరి నదికి వరద పోటేత్తుతోందన్నారు. గోదావరి వరద భయంతో స్థానిక ప్రజలు గ్రామాలకు గ్రామాలకు ఖాళీ చేసి తరలిపోతున్నారని, గోదావరి ముంపు ప్రాంతాల ప్రజలకు తక్షణమే పునరావాసం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు.

అక్కినేని వనజ, డేగ ప్రభాకర్, కృష్ణ చైతన్యలు మాట్లాడుతూ వరద ముంపు ప్రాంతాల ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వాలు తక్షణమే పూనుకోవాలన్నారు. వంట నష్టపోయిన రైతాంగానికి, ఇల్లు కోల్పోయి నిర్వాసితులైన బాధితులకు పరిహారం అందించాలన్నారు.

ఈ పర్యటనలో వేలేరుపాడు కుక్కునూరు మండలాల సిపిఐ నాయకులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *