స్ఫూర్తిప్రదాతల పేర్లతో ప్రభుత్వ పథకాలఅమలు హర్షణీయం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
భావి తరాలకు స్ఫూర్తిని అందించే సమాజ సేవకులు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తల పేర్లతో ప్రభుత్వ పథకాలను అమలు చేయడం హర్షణీయం అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖలో పథకాలను డా.సర్వేపల్లి రాధాకృష్ణన్, డొక్కా సీతమ్మ, అబ్దుల్ కలాం పేర్లతో అమలు చేయాలని నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కి అభినందనలు. గత ప్రభుత్వ పాలనలో అన్ని పథకాలకు ముఖ్యమంత్రి తన పేరే పెట్టుకొన్నారు. ఆ దుస్సంప్రదాయానికి మంగళంపాడి–విద్యార్థులలో స్ఫూర్తిని కలిగించే వారి పేర్లతో పథకాలు అమలు మంచి పరిణామన్నారు.

పాఠశాల విద్యార్థులకు ఇచ్చే విద్యా కానుక ద్వారా యూనిఫాం, పుస్తకాలు, స్కూల్ బ్యాగ్, బూట్లు, సాక్స్ లాంటివి ఇస్తున్నారు. ఈ పథకాన్ని డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతో అమలు చేయడం సముచితం. ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చి, ఆంధ్రా విశ్వవిద్యాలయానికి ఉప కులపతిగా, భారత తొలి ఉపరాష్ట్రపతిగా, 2వ రాష్ట్రపతిగా సమర్థంగా బాధ్యతలు నిర్వర్తించిన సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితం రేపటి పౌరులకు మార్గ నిర్దేశనం చేస్తుంది. మధ్యాహ్న భోజన పథకానికి సైతం గత ముఖ్యమంత్రి తన పేరే పెట్టుకున్నారు. ఇందుకు భిన్నంగా- ‘అపర అన్నపూర్ణ’ డొక్కా సీతమ్మ పేరును ఈ పథకానికి పెట్టడాన్ని ప్రతి ఒక్కరం స్వాగతించాలి. ఏ వేళలో అయినా కడుపు నిండా అన్నంపెట్టి ఆకలి తీర్చిన దానశీలి డొక్కా సీతమ్మ. వారి దయాగుణం, సేవాభావం విద్యార్థులకు తెలియచేయడం ద్వారా ఆ సద్గుణాలు అలవడుతాయి. మన దేశపు మిస్సైల్ మ్యాన్ డా.అబ్దుల్ కలాం పేరుతో విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందించడం ద్వారా యువతలో నూతనోత్తేజాన్ని కలిగిస్తుంది. పేద కుటుంబంలో పుట్టిన కలాం గారు ఎన్నో ఆటుపోట్ల నడుమ విద్యాభ్యాసం సాగించి శాస్త్రవేత్తగా ఎన్నో విజయాలు అందుకొన్నారు. తదనంతరం రాష్ట్రపతిగా బాధ్యతలను ఆదర్శవంతంగానిర్వర్తించారు. కలాం జీవన ప్రస్థానం నవతరంలో స్ఫూర్తిని కలిగిస్తుందన్నారు.

మహనీయుల పేర్లతో పథకాలు అమలు చేయడం ద్వారా వారి సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకొంటారు. ఆ మహనీయుల దివ్యాశ్సీసులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి ఎల్లవేళలా ఉంటాయని పవన్ కళ్యాణ్ ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు

-మ‌నోభావాలు దెబ్బ‌తినే విధంగా పండుగ‌ల‌పైనా ప్రేలాప‌న‌లు -రూ.850 కోట్ల‌తో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *