మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర గనులు, భూగర్భవనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర గురువారం మచిలీపట్నంలో 49వ డివిజన్ నారాయణపురం యానాదుల కాలనీలో, బందరు మండలం చిన్నాపురం గ్రామంలో లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి స్థానిక నారాయణపురంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్ని ఆర్థిక కష్టాలున్నా పేదలకు ఒకటో తేదీనే పెన్షన్ అందిస్తున్నట్లు తెలిపారు. పేదల పెన్నిది, ఆత్మ బంధువు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాత్రమేనని మంత్రి అన్నారు.
చిన్నాపురంలో 100% అంగవైకల్యంతో బాధపడుతున్న బోదాల సునీతకు రూ.15వేలు, రోడ్డు ప్రమాదంలో గాయపడి పూర్తి వైకల్యంతో మంచానికే పరిమితమైన లబ్దిదారుడు కొండేటి నాంచారయ్యను అక్కున చేర్చుకుని రూ.15 వేల పెన్షన్ అందించారు. కష్టబడి చదువుకున్నప్పటికీ రోడ్డు ప్రమాదం మంచాన పడేసిందని ఆవేదన వ్యక్తం చేయగా ఓదార్చి దైర్యం చెప్పారు. చేనేత కార్మికుల ఇళ్లకు వెళ్లి వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. చేనేత కార్మికులకు 50 సంవత్సరాలకే పెన్షన్ ప్రారంభించిందే తమ ప్రభుత్వం అని వివరించి.. గొర్రె సుబ్బారావు అనే లబ్ధిదారునికి రూ.4వేల చేనేత పెన్షన్ అందించారు. సొసైటీలు మూతబడడంతో ఇబ్బందులు ఎదుర్కుంటున్నామని తెలుపగా, సమస్యల పరిష్కరించేలా అధికారులతో మాట్లాడుతానని హామీ ఇచ్చారు.
తమ ప్రభుత్వంతోనే పెన్షన్లు ప్రారంభమయ్యాయని మంత్రి తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ రూ.30తో పెన్షన్ ప్రారంభించగా, చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక రూ.75 చేశారని, ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ పదేళ్లలో రూ.200 మాత్రమే చేస్తే.. చంద్రబాబు ఐదేళ్లలో ఏకంగా రూ.2000కు పెంచిన విషయం గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఒకేసారి రూ.4000 కు పెన్షన్ పెంపు చేశారని, గత నెలలో 3 నెలల బకాయి సొమ్ముతో కలిపి రూ.7000 ఇచ్చామన్నారు. ముఖ్యమంత్రి పేదల కష్టాలు, వారి ఇబ్బందులు తెలిసిన వారు కాబట్టే వారికి మేలు చేయడం గురించి ఆలోచిస్తున్నారని తెలిపారు. సచివాలయ సిబ్బందితో తొలి రోజునే 90శాతం పైగా పెన్షన్ల పంపిణీ పూర్తి చేశామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.
ఈ కార్యక్రమాల్లో మాజీ పార్లమెంటు సభ్యులు కొనకళ్ల నారాయణరావు, మాజీ ఉప సభాపతి బురగడ్డ వేదవ్యాస్, బండి రామకృష్ణ, గొర్రెపాటి గోపీచంద్, ఇలియాస్ పాషా, మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, మాజీ జెడ్పిటిసి లంకె నారాయణ ప్రసాద్, కుంచె నాని, రోండి కృష్ణ, నగరపాలక సంస్థ కమిషనర్ బాపిరాజు, చిన్నాపురం సర్పంచ్ కాగిత గోపాలరావు, గనిపిశెట్టి గోపాల్ తదితరులు పాల్గొన్నారు.