విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల 15వ తేదీన విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్రస్థాయిలో నిర్వహించనున్న 78వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై గురువారం రాష్ట్ర సచివాలయంలో ఆయన సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశానికి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్ డాక్టర్ జి.సృజన, జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా, విజయవాడ మున్సిపల్ కమిషనర్ హెచ్.ఎం.ధ్యానచంద్ర, విజయవాడ ఆర్డీవో బీహెచ్ భవానీ శంకర్ తదితరులు వర్చువల్ గా హాజరయ్యారు. ఈ వేడుకల నిర్వహణకు సంబంధించి ఆయా శాఖల పరంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మార్గనిర్దేశం చేశారు. అదే విధంగా అదేరోజు సాయంత్రం రాజ్ భవన్ లో జరగనున్న ఎట్ హోం కార్యక్రమానికి సంబంధించి కూడా తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వివిధ అభివృద్ధి సంక్షేమ పధకాలపై శాఖల వారీగా ప్రత్యేక శకటాల ప్రదర్శన, ముఖ్యమైన భవనాలను విద్యుత్ దీపాలతో అలంకరణ, వర్షాకాలం నేపథ్యంలో ప్రత్యేకంగా తీసుకోవాల్సిన చర్యలు, పోలీస్ బందోబస్తు తదితరాలపై సిఎస్ సూచనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అత్యంత వైభవంగా భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ సృజన ఈ సందర్భంగా తెలిపారు. వివిధ శాఖలను సమన్వయం చేసుకుంటూ ఏర్పాట్లు చేయనున్నట్లు వివరించారు.
Tags vijayawada
Check Also
నారావారిపల్లె గ్రామపంచాయతీ అభివృద్ధికి దిశా నిర్దేశం
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : చంద్రగిరి మండలం నారావారిపల్లి గ్రామపంచాయతీ స్వర్ణ నారావారిపల్లె విజన్ లో భాగంగా ఆదర్శవంతంగా …