-మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పనుల షెల్ఫ్ ఆఫ్ వర్క్స్ ద్వారా చెరువుల అభివృద్ధి ద్వారా భూగర్భ జలాలు పెరుగుతాయి: జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్
వెంకటగిరి, తిరుపతి జిల్లా, నేటి పత్రిక ప్రజావార్త :
అమృత్ సరోవర్ పథకం చెరువుల అభివృద్ధికి ఒక వరమని, ఉపాధి హామీ పథకం లక్ష్యాల సాధనకు అధికారులు ప్రణాళికా బద్ధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
గురువారం ఉదయం వెంకటగిరి మండలం కలవలపూడి గ్రామ పంచాయితీ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఒక ఎకరాలో నూతన మినీ అమృత్ సరోవర్ 25 లక్షల లీటర్ల సామర్థ్యం గల చెరువు నిర్మాణం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం షెల్ఫ్ ఆఫ్ వర్క్స్ కింద చేపట్టిన పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అధికారులు వివరిస్తూ ఈ ప్రాంతంలో అమృత్ సరోవర్ చెరువు ఏర్పాటు వలన చుట్టుపక్కల పొలాలకు వాటర్ రీఛార్జ్ అయ్యి భూగర్భ జలాలు పెరుగుతాయి అని,పశువులకు నీరు, జంతువులకు నీరు అందుబాటులోకి వస్తుందని తెలిపారు. అనంతరం వెంకటగిరి మండలం పాపమాంబాపురం గ్రామ పంచాయితీ పరిధిలోని మైనర్ ఇరిగేషన్ ట్యాంక్ చెరువు కట్ట బలోపేతం చేసే, పూడికతీత కార్యక్రమ పనులను కలెక్టర్ పరిశీలించారు.రూ. 9.80 లక్షల అంచనాతో ఈ పనులను మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేపట్టడం జరిగిందనీ, ఈ చెరువులో పూడిక తీత ద్వారా లోతు పెంచడం జరుగుతుందని, నీటి నిల్వ సామర్థ్యం పెంపుదల కొరకు నాలుగు దఫాలల్లో ఈ చెరువు పూడిక తీత, కట్ట బలోపేతానికి ప్రణాళిక బద్ధంగా చర్యలు చేపడుతున్నామని, రోజుకు వంద మంది కూలీలు హాజరు అవుతున్నారని అధికారులు తెలపగా నిబంధనల మేరకు చర్యలు ఉండాలని అధికారులకు సూచించి, ఉపాధి హామీ కూలీలతో మాట్లాడి పలు వివరాలు తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో డ్వామా పథక సంచాలకులు శ్రీనివాస ప్రసాద్, అసిస్టెంట్ పిడి ప్రేమ్ కుమార్, అసిస్టెంట్ ప్రోగ్రాం అధికారి దీప, క్షేత్ర సహాయకులు, టెక్నికల్ అసిస్టెంట్ తదితరులు పాల్గొన్నారు.