-జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను తనిఖీ చేసి డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం ను పాఠశాల విద్యార్థినిలతో కలిసి సహపంక్తి భోజనం చేసిన జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్
-పేదలకు ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్ పనులు వెంకటగిరి నందు ఆగస్ట్ 5 నాటికి పూర్తి చేయాలి:జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
పేదలకు నామ మాత్రపు ధరతో ఆకలి తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతమైన ఆశయానికి అనుగుణంగా అన్నా క్యాంటీన్ లను జిల్లాలోని అన్ని నియోజక వర్గాలలోని మునిసిపల్ పరిధిలో ఆగస్ట్ 15 నుండి తప్పక ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు.
మంగళవారం మధ్యాహ్నం వెంకటగిరి పట్టణంలో ఎంపిడిఓ కార్యాలయంలో సమీపంలో ఏర్పాటు చేస్తున్న అన్నా క్యాంటీన్ పునరుద్ధరణ పనులను స్థానిక ఎమ్మెల్యే కొరుగొండ్ల రామకృష్ణ తో కలిసి పరిశీలించారు. అన్నా క్యాంటీన్ మరమ్మత్తు పనులను త్వరిత గతిన నాణ్యతగా ఆగస్ట్ 5 నాటికి పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని మునిసిపల్ కమిషనర్ ను ఆదేశించారు. అలాగే క్యాంటీన్ పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ చుట్టూ గోడ కట్టించి తీగలు ప్రజలకు తగలకుండా ప్రమాదాలు జరగకుండా చూడాలని అన్నారు.
అలాగే ఎమ్మెల్యే తో కలిసి ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లను లబ్ధిదారులకు పంపిణీ చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లను సచివాలయం సిబ్బంది ద్వారా లబ్ధిదారుల ఇంటి వద్దకే వచ్చి పంపిణీ చేయడం పట్ల అన్ని చోట్ల పెన్షన్ లబ్ధిదారులు ప్రభుత్వం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. పట్టణంలో వివిధ గ్రామాల నుండి, ప్రాంతాల నుండి పట్టణానికి వచ్చే పేదలకు, పట్టణంలోని పేద ప్రజలకు నామ మాత్రపు ధరలకు నాణ్యమైన ఆహారం అందించేలా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బృహత్తర కార్యక్రమం ఈ అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, ఏర్పాటు అని అన్నారు. జిల్లాలోని ఏడు మున్సిపాలిటీల పరిధిలో ఆగస్ట్ 15 నాటికి 11 అన్నా క్యాంటీన్లు ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆగస్ట్ 15న రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ప్రారంభం కానున్నాయని తెలిపారు.
అనంతరం వెంకటగిరి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసి విద్యార్థినులతో కలిసి డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం సంబంధించిన భోజనం చేశారు. గుడ్డు, సాంబార్ అన్నం తదితరాలు మెనూ ప్రకారం నాణ్యతగా పెడుతున్నారని విద్యార్థులు తెలిపారు. కలెక్టర్ పదవ తరగతి విద్యార్థినులతో మాట్లాడి బోధన ఎలా ఉంది అని తెలుసుకుని విద్య పట్ల మక్కువతో చదువుకుని మంచి భవిషత్తుకు బాటలు వేసుకోవాలని వారికి సూచించారు. ప్రిన్సిపల్ సూచిస్తూ పదవ తరగతి పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించేలా ప్రణాళికా బద్ధంగా బోధన చేయాలని సూచించారు. పాఠశాల ప్రాంగణంలో కలెక్టర్ మొక్కను నాటి సంరక్షించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ తనూజా రెడ్డి, వెంకటగిరి మునిసిపల్ కమిషనర్ అబ్దుల్ రషీద్, ఇంఛార్జి తాసిల్డార్ రాంబాబు తదితర అధికారులు, ప్రజా ప్రతినిదులు పాల్గొన్నారు.