వెంకటగిరి, ఏర్పేడు తిరుపతి జిల్లా, నేటి పత్రిక ప్రజావార్త :
సోమశిల స్వర్ణముఖి లింకు కెనాల్ లో అంతర్భాగమైన ఆల్తూరుపాడు రిజర్వాయర్ పూర్తి అయితే శ్రీకాళహస్తి, వెంకటగిరి నియోజక వర్గాలలో సుమారు 90 వేల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు పరిసర ప్రాంతాలలో సుమారు 2.50 లక్షల మందికి త్రాగు నీరు అందుతుందని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు.
గురువారం మధ్యాహ్నం డక్కిలి మండల పరిధిలోని ఆళ్తూరుపాడు రిజర్వాయర్ మరియు సంబంధిత కాలువ పనులను కలెక్టర్ సంబంధిత నీటి పారుదల శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సోమశిల స్వర్ణముఖి లింకు కెనాల్ లో అంతర్భాగమైన ఆల్తూరుపాడు రిజర్వాయర్ పూర్తి అయితే శ్రీకాళహస్తి, వెంకటగిరి నియోజక వర్గాలలో సుమారు 90 వేల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు పరిసర ప్రాంతాలలో మధ్య మధ్యలోని చెరువులు 230 నుండి సుమారు 2.50 లక్షల మందికి త్రాగు నీరు అందుతుందని, సదరు ప్రాజెక్ట్ పెండింగ్ భూ సేకరణ అంశంపై సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు. అధికారులు వివరిస్తూ 34 కి.మీ వద్ద తెలుగు గంగ కెనాల్ నీటిని ఆళ్తూరు పాడు రిజర్వాయర్ కు లిఫ్ట్ చేసి రిజర్వాయర్ నింపడం జరుగుతుందని తెలిపారు. ఆళ్తూరుపాడు రిజర్వాయర్ సామర్థ్యం 1 టి ఎం సి లు అని, 70 శాతం పూర్తి అయిన సోమశిల స్వర్ణముఖి లింక్ కాలువల ద్వారా మేర్లపాక చివరి ట్యాంక్ కు నీరు గ్రావిటీ పై ఇవ్వడం జరుగుతుందని, మేర్లపాక లిఫ్ట్ నుండి నీటిని లిఫ్ట్ చేసి మల్లెమడుగు బాలాజీ రిజర్వాయర్ కు పంప్ చేయడం ద్వారా తిరుపతి తిరుమల త్రాగునీటి సమస్య శాశ్వత పరిష్కారం అవుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలుగు గంగ సూపర్ ఇంటెండెంట్ ఇంజనీర్ మదన గోపాల్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, వెంకటగిరి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.