– రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట కార్యాచరణ, సమన్వయంతో కృషిచేయాలి
– ఐ-రాడ్ యాప్‌లో ఆసుపత్రులన్నీ నమోదు కావాలి
– జిల్లా రహదారి భద్రత కమిటీ (డీఆర్ఎస్‌సీ) సమావేశంలో కలెక్టర్ డా. జి.సృజన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్‌టీఆర్ జిల్లాలో రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించేందుకు అవసరమైన అన్ని నివారణ చర్యలు చేపట్టాలని ఇందుకు ప్రధానంగా ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలు (బ్లాక్ స్పాట్)లపై సమన్వయ శాఖల అధికారులు దృష్టిసారించాలని జిల్లా కలెక్టర్ డా. జి.సృజన ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ సృజన అధ్యక్షతన జిల్లా రహదారి భద్రత కమిటీ (డీఆర్ఎస్‌సీ) సమావేశం జరిగింది. పోలీస్ కమిషనర్ ఎస్‌వీ రాజశేఖర బాబు, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్ఎం ధ్యానచంద్ర, డీసీపీ (లా అండ్ ఆర్డర్) గౌతమి శాలి, డీసీపీ (ట్రాఫిక్) కె.చక్రవర్తి, డిప్యూటీ రవాణా కమిషనర్ ఎం.పురేంద్ర తదితరులు హాజరైన ఈ సమావేశంలో జిల్లాలో రోడ్డు ప్రమాదాలు, బ్లాక్ స్పాట్‌లు, రహదారి భద్రత ఉల్లంఘనలపై చర్యలు, హిట్ అండ్ రన్ మోటార్ యాక్సిడెంట్ స్కీమ్-2022, ఐ-రాడ్ అమలు, వీఎంసీ సురక్షిత రవాణా ప్రణాళిక, రహదారి ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలు తదితరాలపై చర్చించారు. గత సమావేశంలో తీర్మానించిన అంశాలకు సంబంధించి తీసుకున్న చర్యలను సమీక్షించారు. ట్రాఫిక్ వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించేందుకు వీలుకల్పించే అస్త్రం-ASTram (యాక్సనబుల్ ఇంటెలిజెన్స్ ఫర్ సస్టైనబుల్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్) యాప్‌పైనా కమిటీలో చర్చించారు. ఇప్పటికే ఈ వ్యవస్థ బెంగళూరులో అమల్లో ఉంది. అదే విధంగా జిల్లాలో రహదారి ప్రమాదాల వివరాలను డిప్యూటీ రవాణా కమిషనర్ ఎం.పురేంద్ర పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. 2023లో 1,522 రోడ్డు ప్రమాదాలు జరగ్గా, 373 మరణాలు నమోదయ్యాయన్నారు. అదే విధంగా 2024 (జనవరి-జూన్)లో 694 రోడ్డు ప్రమాదాలు జరగ్గా, 209 మరణాలు నమోదయ్యాయని.. ఈ మరణాల్లో జాతీయ రహదారులపై ప్రమాదాల వల్ల 104, రాష్ట్ర హైవేలపై ప్రమాదాల వల్ల 41, ఇతర రహదారులపై ప్రమాదాల వల్ల 64 సంభవించాయని వివరించారు.
సమావేశంలో కలెక్టర్ డా. జి.సృజన మాట్లాడుతూ రవాణా, పోలీస్, ట్రాఫిక్, ఆర్ అండ్ బీ, జాతీయ రహదారులు తదితర శాఖల అధికారులతో పాటు డీఆర్‌సీసీలో భాగంగా ఉన్న శాఖల అధికారులు నిబద్ధతతో, సమన్వయంతో పనిచేసి రహదారి ప్రమాదాలకు అడ్డుకట్ట వేయాలని సూచించారు. ఎన్‌హెచ్-16, ఎన్‌హెచ్-30, ఎన్‌హెచ్-65, ఎస్‌హెచ్-192, ఎస్‌హెచ్-236, ఎస్‌హెచ్-32, ఇతర రహదారుల్లో మొత్తం 139 బ్లాక్ స్పాట్‌లు గుర్తించడం జరిగిందని.. ఈ ప్రాంతాల్లో సంయుక్త తనిఖీలు నిర్వహించి మున్ముందు ప్రమాదాలు జరక్కుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అవసరం మేరకు స్పీడ్ బ్రేకర్లు, సైన్ బోర్డులు, హెచ్చరిక బోర్డులు, స్పీడ్ లిమిట్ బోర్డులు వంటి ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు. ఐ-రాడ్ యాప్‌లో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు రిజిస్టర్ అయ్యేలా చూడాలని ఆదేశించారు. రహదారి ప్రమాదాలపై విద్యా సంస్థల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ప్రమాదాలు జరిగే సమయంలో 108 వాహనాల స్పందన సయయాన్ని మరింత మెరుగుపరిచేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. డీఆర్ఎస్‌సీ సమావేశంలో ప్రతి నిర్ణయాన్నీ పటిష్టంగా అమలుచేయాలని కలెక్టర్ సృజన సూచించారు.
సరైన డేటా విశ్లేషణతో ప్రణాళికల రూపకల్పన: సీపీ ఎస్‌వీ రాజశేఖర బాబు
జిల్లాలో ముఖ్యంగా విజయవాడలో ట్రాఫిక్ వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించేందుకు రియల్‌టైమ్ డేటా విశ్లేషణతో ప్రణాళిక రూపకల్పనకు చర్యలు తీసుకోనున్నట్లు సీపీ ఎస్‌వీ రాజశేఖరబాబు తెలిపారు. రహదారి ప్రమాదాలు, మరణాలను గణనీయంగా తగ్గించేందుకు సమష్టి కృషి అవసరమన్నారు. ఇబ్రహీంపట్నం పీఎస్ పరిధిలో 23 బ్లాక్‌స్పాట్‌లను గుర్తించడం జరిగిందని.. ఈ ప్రాంతంపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నట్లు తెలిపారు. 108 వాహనాలు ఇప్పటికే జీపీఎస్‌తో అనుసంధానమై ఉన్నాయని.. మిగిలిన అంబులెన్సులను కూడా జీపీఎస్‌తో అనుసంధానం చేయాల్సిన అవసరముందన్నారు. మనం తీసుకునే చర్యలు విలువైన ప్రాణాలను కాపాడతాయని.. అందులో ఎంతో సంతృప్తి ఉంటుందని… ఈ దిశగా సరైన కార్యాచరణతో రహదారి ప్రమాదాలు, మరణాలను నివారిద్దామని సీపీ రాజశేఖర బాబు పేర్కొన్నారు.
సమావేశంలో వీఎంసీ అడిషనల్ కమిషనర్ కేవీ సత్యవతి, డీపీవో ఎన్‌వీ శివప్రసాద్ యాదవ్, డీసీహెచ్ఎస్ డా. బీసీకే నాయక్, ఆర్ అండ్ బీ ఎస్ఈ వీకే విజయశ్రీ, పాఠశాల విద్యాశాఖ ఏడీ కేవీఎన్ కుమార్, ఎన్‌హెచ్ఏఐ మేనేజర్ కె.లత; వలంటరీ హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ ఎకనమిక్ డెవలప్‌మెంట్ యూనిట్ రహదారి భద్రత ఎన్‌జీవో ఫౌండర్-డైరెక్టర్ ఎం.వాసుతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.