Breaking News

రైతులకు తక్షణమే రాయితీఫై బిందు సేద్యం అందించాలి

-గత వైసీపీ ప్రభుత్వం రూ.1167 కోట్ల బకాయిలు పెట్టింది 
-బిందు సేద్యంలో దేశంలో ముందున్న రాష్ట్రాన్ని దేశంలోనే చివరి స్థానంలోకి జగన్ ప్రభుత్వం తీసుకెళ్లింది 
-ఈ ఏడాది 3 లక్షల హెక్టార్లలో బిందు సేద్యం అమలు
-రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశు సంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి మరియు మత్స్య శాఖామాత్యులు  కింజరాపు అచ్చెన్నాయుడు 

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు తక్షణమే బిందు సేద్యం పరికరాలు రాయితీపై అందించాలని, అందుకు గాను ఈరోజు నుంచే రిజిస్ట్రేషన్లు ప్రారంభించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో రాయితీపై బిందు సేద్యం అమలు పై అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో రాష్ట్రంలో బిందు సేద్యం నిర్వీర్యం అయ్యిందని, గడిచిన ఐదేళ్లలో రైతుల పట్ల వైసీపీ ప్రభుత్వం తీవ్ర కక్ష పూరిత ధోరణి అవలంభించిందని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం రూ.1167 కోట్ల బకాయిలు పెట్టిందని రైతులకు తక్షణమే బిందు సేద్యం అమలు చేయాలనే సంకల్పంతో కంపెనీలకు బకాయిలు చెల్లిస్తున్నామని మంత్రి గారు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బకాయిల్లో రూ.176 కోట్లు విడుదల చేశామని, వాయిదా పద్ధతిలో త్వరలోనే బకాయిలు కంపెనీలకు చెల్లిస్తామని వెల్లడించారు. జగన్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నాబార్డు ద్వారా అందించే బిందు సేద్యం ఫండ్ (మైక్రో ఇరిగేషన్ ఫండ్) కూడా సద్వినియోగం చేసుకోలేదని అన్నారు.

ఈ ఏడాది 3 లక్షల హెక్టార్లలో సాగుకు రాయితీపై బిందు సేద్యం అమలు చేసేందుకు లక్ష్యం నిర్దేశించినట్లు మంత్రి గారు తెలిపారు. తద్వారా రాష్ట్ర రైతాంగానికి ప్రత్యక్షంగా పరోక్షంగా 3450 కోట్ల అదనపు ఆదాయం సమకూరుతుందని అన్నారు.
2004 లో అప్పటి ప్రధాని వాజ్పేయి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో దేశ వ్యాప్తంగా బిందు సేద్యం అభివృద్ధి చేసేందుకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారని అన్నారు. చంద్రబాబు నాయకత్వంలో 2015 – 2018 మధ్య దేశంలోనే బిందు సేద్యం అమలులో ఆంధ్రప్రదేశ్ 17.6% భాగస్వామ్యంతో ప్రధమ స్థానంలో ఉంటే జగన్మోహన్ రెడ్డి 2019 – 2023 మధ్య 5.7 శాతం భాగస్వామ్యానికి తీసుకుని వచ్చి బిందు సేద్యాన్ని నిర్వీర్యం చేశారని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

ఉద్యాన సాగులో 55% మాత్రమే బిందు సేద్యం అమలౌతోందని, నూరు శాతం ఉద్యాన సాగులో బిందు సేద్యం అమలు చేసేందుకు కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎన్డీయే ప్రభుత్వం రైతులకు, రైతు శ్రేయస్సు కోసం బిందు సేద్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో బిందు సేద్యం తక్షణమే అమలుకు ఆదేశాలు జారీ చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఉద్యాన, మత్స్య శాఖల కార్యదర్శి అహ్మద్ బాబు, ఉద్యాన శాఖ డైరెక్టర్ డాక్టర్ కె.శ్రీనివాసులు, APMIDP ప్రాజెక్టు అధికారి బి.హరనాథరెడ్డి పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నారావారిపల్లె గ్రామపంచాయతీ అభివృద్ధికి దిశా నిర్దేశం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : చంద్రగిరి మండలం నారావారిపల్లి గ్రామపంచాయతీ స్వర్ణ నారావారిపల్లె విజన్ లో భాగంగా ఆదర్శవంతంగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *