-జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
పులికాట్ సరస్సు ముఖ ద్వారం వద్ద పూడిక తీత ద్వారా మత్స్యకార కుటుంబాలకు ఉపాధి, పర్యాటక రంగ అభివృద్ధి జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు. శనివారం స్థానిక కలెక్టర్ ఛాంబర్ నందు జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించి మాట్లాడుతూ పులికాట్ సరస్సు ముఖ ద్వారం పూడిరాయ దరువు వద్ద పూడికతీత ద్వారా పులికాట్ మత్స్యకార కుటుంబాలకు ఉపాధి, పర్యాటక అవకాశాలు మెరుగు పడతాయని, పరిసర ప్రాంతాల్లోని గ్రామాల ప్రజల రహదారి, మౌలిక సదుపాయాల కల్పన సమస్యలపై జెసి శుభం బన్సల్ తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్షించి తగు చర్యల కొరకు సూచనలు చేశారు. పులికాట్ సరస్సు ముఖ ద్వారం వద్ద పూడిక తీత ద్వారా సముద్రం నుండి నీరు సరస్సులోనికి రావడానికి మార్గం సుగమం అవుతుందని, తద్వారా మత్స్యకారులకు చేపల వేట ద్వారా ఉపాధి దొరుకుతుందని, సరస్సులో ఎప్పుడూ నీరు ఉండడం వలన ఎకో సెన్సిటివ్ జోన్ లో ఉన్న పులికాట్ & నేలపట్టు పక్షుల అభయారణ్యం మెరుగుదల ద్వారా పలు రకాల పక్షులు వస్తాయని, సందర్శకులను ఎంతగానో అలరించేలా పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందని, సమగ్ర అభివృద్ధి ద్వారా మేలు కలుగుతుందని అన్నారు.
మత్స్య, అటవీ శాఖ అధికారులు వివరిస్తూ పులికాట్ సరస్సు ముఖద్వారం పూడికతీత కు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం సమానంగా నిధులు సమకూర్చే విధంగా రూ. 97.09 కోట్లకు సాగర మాల పథకం కింద అనుమతులు వచ్చాయని, నిధులు విడుదల కావాల్సి ఉందని తెలిపారు. పులికాట్ సరస్సుకు మూడు ముఖ ద్వారాల్లో ఒకటి పూడి రాయదరువు, రెండవది కొండూరు పాలెం (తూపిలి పాలెం దగ్గర) మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో, మూడవ ముఖ ద్వారం పెజావర్ గాడ్ తమిళనాడు రాష్ట్రంలో ఉందని తెలిపారు. ఆం.ప్ర లోని సదరు రెండు ప్రాంతాల్లో ఇసుక మేటలు పేరుకుపోయి సముద్రపు నీరు పులికాట్ సరస్సు లోకి రాకుండా అడ్డుగా ఏర్పడ్డాయని , పులికాట్ సరస్సు ఉత్తరం నుండి దక్షిణానికి ఏటవాలుగా ఉండడం వలన జూన్ నుండి ఫిబ్రవరి వరకు మాత్రమే మనకు పులికాట్ లో నీరు ఉంటుందని, అదే తమిళనాడు వైపు సంవత్సరం పొడుగునా పులికాట్ నందు నీరు ఉంటుందని, మార్చి నుండి జూన్ కాలంలో మన ఏపీ మత్స్యకారులను అటు వైపు అనుమతించడం లేదని సమస్య ఎప్పుడూ ఉంటోందని తెలిపారు. పులికాట్ సరస్సు 461 కిమీ లలో విస్తరించి ఉందని, ఏపీ లో 400 కిమీ విస్తరించి ఉందని, పూడిక తీత ద్వారా సముద్రం నీరు పులికాట్ లో చేరి చేపల వేట ద్వారా మత్స్యకారులకు జీవనోపాధి దొరుకుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్, సూల్లూరు పేట ఆర్డీఓ చంద్రముని, వైల్డ్ లైఫ్ డిఎఫ్ఓ శామ్యూల్, జిల్లా మత్స్య శాఖ అధికారి ఎ.నాగరాజు, జిల్లా పర్యాటక శాఖ అధికారి రూపేంద్రనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.