గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ వైద్యుల పట్ల ప్రజల్లో గౌరవ భావం మరింత పెరిగే విధంగా కృషి చేయాలని రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమం, వైద్యవిద్యా శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ పేర్కొన్నారు.
శనివారం సాయంత్రం జీజీహెచ్ లోని సుశ్రుత సమావేశ మందిరంలో వివిధ విభాగాల ఆచార్యులతో జరిగిన సమావేశంలో కేంద్ర గ్రామీణాభివృద్ది, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ , రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమం, వైద్యవిద్యా శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ , వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం టి కృష్ణా బాబు, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, గుంటూరు తూర్పు , పశ్చిమ నియోజకవర్గ, తాడికొండ శాసనసభ్యులు మహమ్మద్ నసీర్, గల్లా మాధవి, తెనాలి శ్రావణ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమం, వైద్యవిద్యా శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యులు అంకిత భావంతో ప్రజలకు వైద్య సేవలు అందించాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం కలిగే విధంగా వైద్య సేవలు అందించాలన్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులతో డాక్టర్ నవ్వుతూ మాట్లాడాలని , అలాంటప్పుడే వైద్య సేవలు పొందేందుకు రోగులు ముందుకు వస్తారని సూచించారు. ఆసుపత్రుల్లో చిన్నపాటి ఒడిదుడుకులు వున్నప్పటికి వాటిని అధిగమించి డాక్టర్లు సేవలు అందించేందుకు కృషి చేయాలన్నారు. ఫ్యాకల్టీ వున్న ప్రాంతంలో ఆసుపత్రులకు సమస్య వుండకూడదన్నారు. ఆసుపత్రిలోని సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. అయితే వైద్యులు తమ వృత్తిలో అకౌంటబులిటీ పెంచుకోవలసి వుందని సూచించారు. నాట్కొ నేతృత్వంలో నిర్వహిస్తున్న కాన్సర్ హాస్పిటల్ చాలా చక్కగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
కేంద్ర గ్రామీణాభివృద్ది, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ వచ్చే రెండేళ్లలో ఆసుపత్రి అభివృద్ది కోసం ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు వెళ్ళతామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి కి మంచి పేరుందన్నారు. ఆ పేరును నిలబెట్టే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు. గుంటూరు మెడికల్ కళాశాల వైద్యులు ఎక్కువమంది అమెరికాలో స్థిరపడ్డారని ఆయన అన్నారు. వైద్యులు బాధ్యతాయుతంగా పని చేయాలని కోరారు.