-బందరు పోర్టు పనులు వేగవంతం చేస్తాం
-మంత్రి కొల్లు రవీంద్ర
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
బందరు పోర్టు పనులు మరింత వేగవంతం చేస్తామని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఆదివారం స్థానిక నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో మంత్రి ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడుతూ మచిలీపట్నంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రతి శని లేదా ఆదివారాల్లో ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజా సమస్యలపై అర్జీలు స్వీకరిస్తున్నామన్నారు ఇప్పటివరకు నిర్వహించిన 4 ప్రజా దర్బార్ కార్యక్రమాల్లో 1159 అర్జీలు అందగా, వాటిల్లో 850 పరిష్కరించినట్లు తెలిపారు. ప్రధానంగా రోడ్లు డ్రైన్ ల అభివృద్ధి చేయాలని అర్జీలు అందాయని, ఉద్యోగాలు కోసం 159 అర్జీలు అందాయని అన్నారు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించుటకు త్వరలో మచిలీపట్నంలో పెద్ద ఎత్తున జాబ్ మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. త్వరలో స్కిల్ గణన కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు, వారి వారి వృత్తి నైపుణ్యాల సర్వే నిర్వహించ నున్నట్లు తెలిపారు. మచిలీపట్నంలో స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాన్ని త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు. ఈనెల 25న కొరియన్ బృందం మచిలీపట్నం సందర్శించన్నన్నదని, ఈ బృందం బీచ్ అభివృద్ధికి, విద్యాపరమైన అంశాల్లో పరిశీలన జరుపుతుందన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి కూడా అనేక చర్యలు చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. తద్వారా ఉపాధి అవకాశాలు మెండుగా లభించి నిరుద్యోగులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు.
మేధావులతో త్వరలో సమావేశం ఏర్పాటు చేసి బందరు భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించడం జరుగుతుందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రెండో దఫా పింఛన్లు పంపిణీ సంబంధించి, రాష్ట్రంలో 55 లక్షల మందికి మొదటి రోజునే 99% పైగా పింఛన్ల పంపిణీ చేసిన విషయం మంత్రి గుర్తు చేశారు. పంచాయతీ రాజ్ సంబంధించి చేపట్టనున్న ప్రాజెక్టుల వివరాలు మంత్రి తెలియజేస్తూ గిలకలదిండి, బందరు కోట, పోలాటి తిప్ప, గరాల దిబ్బ రహదారులు, రెండు వంతెనల నిర్మాణం దాదాపు 8 కోట్లతో చేపట్టనున్నట్లు, తాళ్లపాలెం లో మోడీ గ్రామంలో 20 కోట్లతో బ్రిడ్జి నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు, దీనికి టెండర్లు కూడా పిలిచామన్నారు మచిలీపట్నం మున్సిపాలిటీ ప్రాంతంలో 1.60 కోట్లతో డ్రైన్లలో పూడిక తీత పనులు ఇప్పటికే చేపట్టామన్నారు. అమృత్ రెండో దశ కింద 55 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు జలజీవన్ మిషన్ కింద రూరల్ లో ఇంటింటికి కుళాయిలు అందించడమే కాకుండా, తరకటూరు ఎస్ఎస్ ట్యాంక్ పై భారం తగ్గించేందుకు చిన్నాపురం గుండుపాలెం ప్రాంతంలో రు.105 కోట్లతో 70 ఎకరాల్లో 5 ఎం ఎల్ డి వాటర్ శుద్ధి ప్లాంటు, చెరువు ఏర్పాటు పనులు రెండేళ్లలో పూర్తయ్యేలా చేపడతామన్నారు. ఇరిగేషన్ సంబంధించి డ్రైనేజీలలో 18 కోట్లతో తూడు తొలగింపు పనులు ఇప్పటికే చేపట్టినట్లు తెలిపారు. ఉపాధి హామీ కింద 160 కోట్లతో తక్షణమే నిర్మించాల్సిన రోడ్లు, గుంతలు పూడ్చి పనులు, రోడ్ల మరమ్మత్తులు చేపట్టనున్నట్లు తెలిపారు.