మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఎక్కడ కూడా అక్రమంగా ఇసుక రవాణా జరక్కుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం నగరంలోని కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇసుక అక్రమంగా రవాణా కాకుండా నిరోధించాలన్నారు. ఇసుక రీచ్ లలో గట్టిగా నిఘా ఉంచి ఇసుక అక్రమంగా రవాణా కాకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టాలన్నారు. ఇందులో భాగంగా గుర్తించిన 26 ప్రదేశాల్లో సీసీటీవీ లను అమర్చేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేసి అందజేయాలన్నారు మద్దూరులో సీజ్ చేసిన 1500 టన్నుల ఇసుక బయటకు తరలిపోకుండా ఎస్ ఈ బి అధికారులు అక్కడ సీసీటీవీలను అమర్చి అందుకు సంబంధించిన బిల్లును చెల్లింపు కోసం అందజేయాలన్నారు. అనుమతి లభించిన 8 ఇసుక రీచులలో రానున్న వర్షాకాలం లో చేతులతో (మాన్యువల్ గా) ఇసుక తీసుకోవడానికి గానీ లేదా కన్వేయర్ బెల్ట్ ద్వారా టిప్పర్లోకి లోడింగ్ చేయడానికి క్షేత్రస్థాయిలో సాధ్యాసాధ్యాలను పరిశీలించి నివేదిక అందజేయాలన్నారు.
కొత్తగా గుర్తించిన 5 రీచ్ లలో 14 లక్షల టన్నుల వరకు ఇసుక ఉండే అవకాశం ఉందని, అక్కడ సెమీ మెకనైజ్డ్ (కొంతవరకు యంత్రాలతో) ఇసుక తవ్వడానికి గనులు, జలవనరులు, రెవెన్యూ, ఆర్డబ్ల్యూఎస్, ఎస్ ఇ బి, భూగర్భజల శాఖల అధికారులు ఉమ్మడిగా తనిఖీ చేసి ప్రజల అభిప్రాయం తెలుసుకొని పూర్తి సిఫారసులతో వచ్చే సమావేశానికి నివేదిక తీసుకుని రావాలన్నారు. ఈనెల 9వ తేదీన మరల సమీక్ష సమావేశం నిర్వహిస్తామని ఆ తేదీన కోరిన నివేదికలు పూర్తిస్థాయిలో అందజేయాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు.
ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ, జిల్లా గనులు భూగర్భ శాఖ అధికారి కొండారెడ్డి, ఎస్ ఈ బి సూపరింటెండెంట్లు జి గంగాధర్ రావు, పాండురంగారావు, ఇన్స్పెక్టర్లు వెంకటలక్ష్మి, శివరామరాజు, హేమ సుస్మిత, డిపిఓ నాగేశ్వర్ నాయక్,కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ ఇంజనీర్ పి శ్రీనివాసరావు, భూగర్భ జల శాఖ అధికారి విజయవర్ధన్ రావు, జల వనరుల శాఖ ఈ కృష్ణారావు, ఎంవిఐ స్వర్ణ శ్రీనివాసు, ఎస్ వి ఎన్విరో ల్యాబ్స్ కన్సల్టెంట్లు సునీల్, కృష్ణ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.