-దోషిని ఖఠినాతి కఠినంగా శిక్షిస్తాం…
-ఇటువంటి దాడులను సమాజంలో ప్రతిఒక్కరు ఖండించాలి.
-సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కె. పార్థ సారధి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అభంశుభం తెలియని చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడటం అమానవీయం, అమానుషమని సభ్యసమాజం తలదించుకునే సంఘటనకు పాల్పడిన దోషిని ఖఠినాతి కఠినంగా శిక్షిస్తామని చిన్నారి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని ఇటువంటి దాడులను ప్రతిఒక్కరు ఖండించాలని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మాత్యులు కొలుసు పార్థ సారధి తెలిపారు.
ఏలూరు జిల్లా నూజివీడు రూరల్ మండలం పల్లెర్లమూడి గ్రామంలో హత్యాచారానికి గురై విజయవాడ పాత పాతప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను, కుటుంబ సభ్యులను మంగళవారం మంత్రి కె. పార్ధ సారధి పరామర్శించి చిన్నారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడుతూ మానవత్వాన్ని మరచి తాగుబోతు అత్యంత అమానుషమైన చర్యలకు పాల్పడటం దురదృష్టకర సంఘటన అన్నారు. ఇటువంటి ఘటనలను ప్రతి ఒక్కరు ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. సంఘటన గురించి తెలిసిన వెంటనే ఘటనకు పాల్పడిన దోషిని గుర్తించాలని జిల్లా యంత్రాంగాన్ని, పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,హోమ్ మంత్రి వంగలపూడి అనిత తక్షణమే స్పందించి దోషులను గుర్తించాలని పోలీస్ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీచేశారన్నారు. పోలీస్ అధికారులు రంగంలోకి దిగి సంఘటన జరిగిన తీరును ఆధారంగా అనుమానితున్ని గుర్తించి రెంటచింతల సమీపంలో అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి భవిష్యత్తులో ఇటువంటి సంఘటనకు పాల్పడాలన్న ఆలోచన రావడానికే భయపడే విధంగా ఖఠినాతి కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకుంటామన్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడి బాధిత కుటుంబానికి అవసరమైన తక్షణ సహాయం అందించడం జరిగిందని ప్రభుత్వ పరంగా అన్ని విధాల ఆదుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. బాలిక ఆరోగ్యం నిలకడగా ఉందని ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు తెలియజేశారన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పార్థ సారధి వివరించారు. అనంతరం పాత ప్రభుత్వాసుపత్రిలో పారిశుధ్య పనులను పరిశీలించి రోగులకు, వెంట వచ్చే సహాయకులకు మెరుగైన సౌకర్యాలను కల్పించి నిరంతరం పారిశుధ్య పనులు నిర్వహించి ప్రభుత్వాసుపత్రులపై ప్రజలకు నమ్మకం కలిగించేలా చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ ను, అధికారులను మంత్రి పార్థసారధి ఆదేశించారు.
ఆసుపత్రి పర్యటనలో మంత్రి వెంట పాతప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డా. వెంకటేశ్వరరావు, డిప్యూటీ సూపరింటెండెంట్ డా. వినయ్, ఆర్ఎంవో డా. శోభ, డా. హిమబిందు, వైద్యులు పాల్గొన్నారు.