– మాస్టర్ ప్లాన్‌ల ప్రకారం అభివృద్ధి పనులు చేపట్టాలి
– పేదరిక నిర్మూలన, సుస్థిర జీవనోపాధి కల్పన, నైపుణ్యాల పెంపుపై దృష్టిపెట్టాలి
– సామాజిక ఆస్తుల సృష్టి; ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణా కీలకం
– జిల్లా కలెక్టర్ డా. జి.సృజన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర సమగ్రాభివృద్ధికి సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దార్శనికతకు అనుగుణంగా జిల్లాలో అన్ని శాఖల అధికారుల కార్యాచరణ ఉండాలని కలెక్టర్ డా. జి.సృజన స్పష్టం చేశారు. మంగళవారం కలెక్టర్ సృజన.. జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా, డీఆర్‌వో వి.శ్రీనివాసరావుతో కలిసి కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. సోమవారం ముఖ్యమంత్రి నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో చర్చించిన కీలక అంశాలతో పాటు గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ ఉప ముఖ్యమంత్రి చేసిన సూచనలను కలెక్టర్ వివరించారు. వ్యవసాయం, అనుబంధ రంగాలు; పరిశ్రమలు, గ్రామీణాభివృద్ధి, విద్య, వైద్య ఆరోగ్యం, సహజ వనరులు, సంక్షేమం, గృహ నిర్మాణం.. ఇలా శాఖల వారీగా పవర్ పాయింట్ ప్రజంటేషన్‌తో భవిష్యత్తు ప్రణాళికను వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సృజన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతలపై స్పష్టమైన అవగాహన పెంపొందించుకొని అధికారులు సమన్వయంతో, క్షేత్రస్థాయి అధికారులకు సరైన మార్గనిర్దేశనం చేస్తూ లక్ష్యాలను చేరుకునేందుకు కృషిచేయాలని సూచించారు. ఎప్పటికప్పుడు సమీక్షలు, తనిఖీలు నిర్వహిస్తూ చేపట్టిన పనిలో పురోగతి ఉండేలా చూడాలన్నారు. కార్యాలయ సేవలు, క్షేత్రస్థాయి సందర్శనలకు సమప్రాధాన్యమివ్వాలని సూచించారు. జీరో పావర్టీ; సాంఘిక, భౌతిక మౌలిక వసతుల అభివృద్ధి; జనాభాలో యువశక్తి, జీవన సౌలభ్యం సంక్షేమ, అభివృద్ధి అంశాలతో రాష్ట్ర ప్రభుత్వం విజన్ ఆంధ్రా@2047 దార్శనిక ప్రణాళికను రూపొందిస్తోందని.. ఇందుకు జిల్లాపరంగా అవసరమైన నివేదికలతో సిద్ధంగా ఉండాలన్నారు. పేదల జీవన ప్రమాణాలను పెంచి, వారిని పేదరికం నుంచి దూరంచేసేలా ప్రభుత్వం పేదల సేవలో కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఒక్క పారిశ్రామిక రంగంలోనే కాకుండా వివిధ రంగాల్లో ఉద్యోగాల కల్పన, జీవనోపాధి సృష్టిపై దృష్టిసారించాలన్నారు. ప్రజా సంక్షేమం లక్ష్యంగా ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు, కార్యక్రమాలు నూరుశాతం ఫలితాలిచ్చేలా చూడాలన్నారు. గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో రహదారులు, డ్రెయిన్లు, తాగునీటి సరఫరా.. ఇలా ఏ పని చేపట్టినా మాస్టర్ ప్లాన్ ప్రకారం ఉండాలన్నారు. సామాజిక ఆస్తుల సృష్టిపై ప్రత్యేకంగా దృష్టిసారించాలన్నారు. గ్రామాల్లో అవసరాలకు అనుగుణంగా ఆధారంగా గ్రామ అభివృద్ధి ప్రణాళికల (వీడీపీ)ను వివిధ శాఖల అధికారులు సమన్వయంతో రూపొందించాలని.. అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. మంచినీటి కుళాయిల కనెక్షన్లు, మరుగుదొడ్లు, వీధి దీపాలు, ఘన-ద్రవ వ్యర్థాల నిర్వహణ తదితరాలపై దృష్టిసారించాలన్నారు. శాఖల వారీగా సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు కృషిచేయాలని.. ఆయా సూచీల్లో ప్రగతి కనబరచాలని సూచించారు. ఉపాధి హామీ పథకం అనుసంధానంతో ఉద్యాన పంటలు చేపట్టేలా, ఫామ్ పాండ్‌లను అభివృద్ధి చేసేలా చూడాలని కలెక్టర్ సృజన సూచించారు.
ఈ-పంట బుకింగ్‌పై దృష్టిపెట్టాలి:
లక్ష్యాలకు అనుగుణంగా ఖరీఫ్-2024లో వివిధ పంటల సాగు విస్తీర్ణం ఉండేలా చూడాలని.. అదే విధంగా ఈ ఏడాది సెప్టెంబర్ 15 నాటికి ఈ-పంట బుకింగ్‌ను పూర్తిచేయాల్సి ఉన్నందున అందుకు తగిన కార్యాచరణతో ముందుకెళ్లాలని సూచించారు. 100 శాతం సీసీఆర్‌సీ కార్డులు పంపిణీని పూర్తిచేయాలని, రుణాలు అందేలా చూడాలన్నారు. భూసార పరీక్షలను పెంచాలని.. సాగు ఖర్చును తగ్గించుకొని దిగుబడులు పెరిగేందుకు రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు చేయాలన్నారు. పాఠశాలల్లో స్థూల నమోదు నిష్పత్తి (జీఈఆర్) పెంపునకు కృషిచేయాలన్నారు. వైద్య, ఆరోగ్య శాఖ సాధించాల్సిన లక్ష్యాలతో పాటు ప్రకృతి వ్యవసాయం, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతలో నైపుణ్యాల పెంపు, ధరల నియంత్రణ, గృహ నిర్మాణ లక్ష్యాలు తదితరాలపై కలెక్టర్ సృజన గౌరవ ముఖ్యమంత్రి సూచనలకు అనుగుణంగా మార్గనిర్దేశనం చేశారు.
సమావేశంలో పౌర సరఫరాల డీఎం జి.వెంకటేశ్వర్లు, కేఆర్‌సీసీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఇ.కిరణ్మయి, సీపీవో వై.శ్రీలత, డ్వామా పీడీ జె.సునీత, డీపీవో ఎన్‌వీ శివప్రసాద్‌యాదవ్, డీఈవో యూవీ సుబ్బారావు, డీఎస్‌వో జి.మోహన్‌బాబు, డీఎంహెచ్‌వో డా. ఎం.సుహాసిని, పరిశ్రమల అధికారి ఎ.సుధాకర్, హౌసింగ్ పీడీ రజనీ కుమారి, జిల్లా వ్యవసాయ అధికారి సాకా నాగమణెమ్మ, ఉద్యాన అధికారి పి.బాలాజీ కుమార్, ఏపీ ఎంఐపీ పీడీ పి.ఎం.సుభానీ, ఐసీడీఎస్ పీడీ జి.ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.