-ఈ నెల 12 నుండి 2 నెలల పాటు అవగాహన సదస్సులు
-18లైన్ డిపార్ట్ మెంట్ ల సహకారంతో రాష్ట్రంలో హెచ్ఐవీ వ్యాప్తి శాతం జీరో లక్ష్యంగా పనిచేద్దాం.
-దేశంలో వ్యాధి విస్తరణను సమర్థవంతంగా అడ్డుకోవడంలో మన రాష్ట్రం 2వ స్థానంలో ఉంది
-హెచ్ఐవీ సోకినా మందులు వాడతూ సాధారణ జీవనం సాగించవచ్చు.
-వ్యాధిగ్రస్థులపై వివక్ష చూపడం మంచి పద్దతి కాదు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
హెచ్ఐవీ/ఎయిడ్స్ వ్యాధి వ్యాప్తిపై సమాజంలో అవగాహన పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సోసైటీ(ఏపీశాక్స్) ఏపీడీ డాక్టర్ సరస్వతి అన్నారు. మన రాష్ట్రం నుండి పూర్తిగా వ్యాధిని తరిమివేసేవరకు మనం విశ్రమించకూడదని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సోసైటీ వారి ఆధ్వర్యంలో వివిధ ప్రభుత్వ శాఖలతో రాష్ట్ర స్థాయి జాయింట్ వర్కింగ్ గ్రూప్ కమిటీ సమావేశం విజయవాడలోని ఓ ప్రైవేట్ హోటల్ లో మంగళవారం నిర్వహించారు. సమావేశానికి ఐఈసీ జేడీ డాక్టర్ మంజుల అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సరస్వతి మాట్లాడుతూ హెచ్ఐవీ/ఎయిడ్స్ పై ప్రజలకు అవగాహన కల్పించడానికి వివిధ ప్రభుత్వ శాఖల యొక్క బాధ్యతను మరియు వారి సహకారం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.
వంద మంది కన్నా ఎక్కువ సంఖ్యలో పనిచేస్తున్న సంస్థల్లో ఒక కంప్లైంట్ అధికారిని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. హెచ్ఐవీ పరీక్షలు ప్రతి ఒక్కరూ చేయించుకోవాలని, అందరూ ముందుకు రావాలని డాక్టర్ సరస్వతి కోరారు.
ఈ నెల 12 నుండి 2 నెలల పాటు దేశవ్యాప్త పిలుపులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా హెచ్ఐవీ/ఎయిడ్స్ పై అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. అవగాహన సదస్సుల నిర్వహణలో 18లైన్ డిపార్ట్ మెంట్ లు సహకారం అందించడానికి ముందుక రావడం హర్షనీయమన్నారు. అందరి సహకారంతో 2030 నాటికి వ్యాధి వ్యాప్తి జీరో పర్సంటేజ్ సాధించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుదామన్నారు. ప్రతి ఒక్కరూ వ్యాధిపై అవగాహన పెంచుకోవడటంతో కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య అతి తక్కువగా నమోదవుతున్నాయని, ఇక అత్యుత్తమ మందులు ఉచితంగా పంపిణీ చేయడంతో పాటు వాటిని క్రమం తప్పకుండ వాడే విధంగా వారిలో చైతన్యం కలిగించడంలో విజయం సాధించడంతో రాష్ట్రంలో వ్యాధి తీవ్రతతో మృతి చెందే వారి సంఖ్య తగ్గిపోయిందని, ఇది అభినందించదగ్గ విషయమని డాక్టర్ సరస్వతి అన్నారు.
ఐఈసీ, జేడీ డాక్టర్ మంజుల మాట్లాడుతూ ప్రతి జిల్లాలో ఒక అంబుడ్స్ మెన్ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అందులో డిఎం అండ్ హెచ్ వో అంబుడ్స్ మెన్ గా ఉంటారని తెలిపారు. రాష్ట్ర స్థాయి ఇన్ టెన్సిఫైడ్ క్యాంపెయిన్ ప్రోగ్రాంను ఈ నెల 12న వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు ప్రారంభించనున్నట్లు చెప్పారు. దీంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు. ఇలా 2 నెలల పాటు అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు. మొదటి వారం హెచ్ఐవీ సంక్రమించే మార్గాలు, నివారణ చర్యలు, 2వ వారం హెచ్ఐవీపై అనుమానాలు, అపోహలు, 3వ వారం హెచ్ఐవీ సంక్రమించే రిస్క్ అవగాహన మరియు సేవల ప్రచారం, 4వ వారం జాతీయ టోల్ ఫ్రీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ -1097పై అవగాహన, 5వ వారం కండోమ్ మరియు సురక్షిత లైంగిక అలవాట్లపై ప్రచారం, 6వ వారం ఎస్టీఐ నివారణ మరియు చికిత్స, 7వ వారం మద్యపానం మరియు మాదకద్రవ్యాల దుర్వినియోగం, 8వ వారం స్టిగ్మా మరియు వివక్షపై రాష్ట్రవాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తామని వివరించరు. వ్యాధి సంక్రమించిన తరువాత పూర్తిగా నయం చేయడం సాధ్యం కాదు కాని ట్రీట్ మెంట్ తో సాధారణ జీవనం మాత్రం సాధ్యమేమన్నారు. రాష్ట్రంలో 96 ఎన్జీవో సంస్థలు ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహించి వారిని ఛైతన్య పరుస్తున్నాయని చెప్పారు. వ్యాధి ఉన్న గర్భిణీ నుండి బిడ్డకు ఈ వైరస్ సంక్రమించకుండ వైద్యుల సూచనలు, సలహాలతో ఆరోగ్యవంతమైన బిడ్డ కు జన్మనివ్వవచ్చన్నారు.
కార్యక్రమంలో భాగంగా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా రాష్ట్రంలో వ్యాధి ప్రభలకుండ తీసుకుంటున్న చర్యలపై అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో జేడీ డాక్టర్ భాగ్యలక్ష్మీ, డాక్టర్ కామేశ్శర ప్రసాద్, డాక్టర్ చక్రవర్తి, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, జె. ఎస్తేర్ తంబురాజ్, ఎం. శ్రీనివాసరావు, రాజేష్ కుమార్, ఎ.ఎస్. రేణుక, బి. వినయ్ కుమార్, జి. మంగమ్మ, ఎస్ కె రహనా బేగం, పి. వెంకట్, డాక్టర్ జయకృష్ణ, డాక్టర్ నిర్మలా గ్లోరీ తదితరులు పాల్గొన్నారు.