-చేనేత జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి కె.సునీత
-చీరాలలో ముఖ్యమంత్రి సమక్షంలో కార్యక్రమం
-విజయవాడలో నేత వస్త్రాలలో చేనేత నడక
-అయా జిల్లాలలో సైతం స్ధానికంగా కార్యక్రమాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ చేనేత దినోత్సవ వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించనున్నట్లు చేనేత జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి కె.సునీత తెలిపారు. చీరాలలో నిర్వహించే రాష్ట్ర స్దాయి కార్యక్రమానికి స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయిడు హాజరుకానున్నారన్నారు. రాష్ట్ర రాజధాని విజయవాడలో నిర్వహించే చేనేత దినోత్సవ వేడుకలను చేనేత నడకతో ప్రారంభించనున్నామన్నారు. బుధవారం ఉదయం ఏడు గంటలకు మేరీస్ స్టెల్లా కళాశాల ప్రధాన ద్వారం నుండి ప్రారంభమయ్యే నడక జాతీయ రహదారి స్వరీసు రోడ్డు, నిర్మలా కాన్వెంట్ రోడ్డు, పంట కాలువ రోడ్డు మీదుగా మేరీస్ స్టెల్లా ఇండోర్ స్టేడియంకు చేరుతుందన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనితను ఆహ్వానించామని, చేనేత జౌళి, వెనుకబడిన తరగతుల శాఖ మంత్రి సవిత, చేనేత జౌళి శాఖ కమీషనర్ రేఖారాణి, ఎస్ఆర్ఆర్ సివిఆర్ కళాశాల విద్యార్ధులు, చేనేత జౌళి శాఖ సిబ్బంది పాల్గొననున్నారని సునీత వివరించారు. చేనేత ప్రేమికులు నేత వస్త్రాలతో ఈ నడకలో పాల్గొని నేత కార్మికులకు తమ సంఘీభావం ప్రకటించాలన్నారు. మరోవైపు ఇండోర్ స్టేడియంలో మధ్యాహ్నం 12 గంటలకు జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన ప్రారంభం అవుతుందన్నారు. ముఖ్యమంత్రి కార్యక్రమంలో పాల్గొనవలసి ఉన్నందున ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం నేతృత్వం వహిస్తుందన్నారు.