-ఈ ప్రభుత్వ హయాంలో చేనేత కార్మికులకు స్వర్ణయుగమే.
-నేతన్నల సంక్షేమంపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి
-చేనేత కార్మికుల కుటుంబ సభ్యులందరికీ
-జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు
-రాష్ట్ర చేనేత, జౌళి; బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో చేనేతకు పూర్వ వైభవం తెచ్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం కృషిచేస్తోందని రాష్ట్ర చేనేత, జౌళి; బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత అన్నారు.
బుధవారం జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యంలో నగరంలోని మేరీస్ స్టెల్లా కాలేజీ వద్ద ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర చేనేత, జౌళి; బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత.. విజయవాడ తూర్పు శాసనసభ్యులు గద్దె రామమోహన్, రాష్ట్ర చేనేత, జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి కె.సునీత, కమిషనర్ జి.రేఖారాణి, ఆర్కియాలజీ, మ్యూజియమ్స్ కమిషనర్ జి.వాణీ మోహన్ తదితరులు చేనేత వాకథాన్‌ను ప్రారంభించారు. చేనేత వస్త్రాలు ధరిద్దాం.. చేనేత కళను ప్రోత్సహిద్దామంటూ పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా మంత్రి ఎస్.సవిత మాట్లాడుతూ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికుల కుటుంబ సభ్యులందరికీ జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. పోగును వస్త్రంగా తయారుచేసి మనిషి మానాన్ని కాపాడుతున్న చేనేత కార్మికులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ హయాం చేనేతకు స్వర్ణయుగమని.. నేత కార్మికులకు రాజయోగమేనన్నారు. చేనేత కార్మికుల కష్టాలపై గౌరవ ముఖ్యమంత్రికి పూర్తి అవగాహన ఉందని.. వారిని అన్ని విధాలా ఆదుకునేందుకు ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఆయన నేతన్నలకు పూర్తి ఆసరాగా నిలిచారన్నారు. వారికి సుస్థిర జీవనోపాధికి వివిధ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు అమలుచేశారన్నారు. అయితే గత కొన్నేళ్లలో నేతన్నలకు సరైన ఆదాయం లేక, వారి ఉత్పత్తులు కొనేవారు లేక వలసపోయే పరిస్థితి వచ్చిందని.. ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు కూడా చోటుచేసుకున్నాయన్నారు. నిర్వీర్యమైన చేనేతకు మళ్లీ పూర్వవైభవం తెస్తామని.. నేతన్నలను ప్రోత్సహించే క్రమంలో ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలు ధరించాలని ఈ సందర్భంగా మంత్రి సవిత పిలుపునిచ్చారు.
చేనేత కళపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు కృషి: శాసనసభ్యులు గద్దె రామమోహన్
విశిష్టమైన చేనేత కళపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు చేస్తున్న కృషిలో భాగంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు విజయవాడ తూర్పు శాసనసభ్యులు గద్దె రామమోహన్ అన్నారు. చేనేత ఔన్నత్యాన్ని గుర్తించి ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను ఆదరించాలని కోరారు. విదేశీ వస్త్రాలను బహిష్కరించాలన్న లక్ష్యంతో స్వదేశీ ఉద్యమం వచ్చిందని.. 1905, ఆగస్టు 7న విదేశీ వస్త్రాలను బహిష్కరించడంతోపాటూ దేశీయోత్పత్తుల పునరుద్ధరణకు పిలుపునిచ్చిన చారిత్రక ఘటనకు గుర్తింపుగా గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ 2015లో ఆగస్టు 7ను జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించారని వివరించారు. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో చేనేత కీలకభూమిక పోషించిందన్నారు. అగ్గిపెట్టలో సైతం ఇమిడిపోయే చీరను తయారు చేసిన అద్భుత నైపుణ్యం మన నేతన్నల సొంతమని శాసనసభ్యులు రామమోహన్ అన్నారు.
చేనేత వాకథాన్‌లో స్థానిక కార్పొరేటర్ దేవినేని అపర్ణ, ఆప్కో ఎండీ ఆర్.పవనమూర్తి, జాయింట్ డైరెక్టర్లు కన్నబాబు, ఎం.నాగేశ్వరరావు, ఎన్‌టీఆర్ జిల్లా చేనేత, జౌళి అధికారి ఎస్.రఘునందన్, ఎస్ఆర్ఆర్-సీవీఆర్ కళాశాల ప్రిన్సిపల్ కె.భాగ్యలక్ష్మి, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.