-ఆర్టీసీ బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తున్నది
-మంత్రి కొల్లు రవీంద్ర
మచిలీపట్నం , నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో మహిళలకు త్వరలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించనున్నట్లు రాష్ట్ర గనులు, భూగర్భవనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నం ఆర్టీసీ డిపోలో శుక్రవారం మంత్రి 5 నూతన బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో తమ ప్రభుత్వం ఆర్టీసీ బలోపేతానికి ఆర్టిసి కార్మికుల సంక్షేమానికి కృషిచేసిందన్నారు. అయితే గత ప్రభుత్వం ఆర్టీసీ విలీనం పేరుతో అప్పుల పాలు చేసిందన్నారు. మళ్లీ కూటమి ప్రభుత్వం రాగానే ఆర్టీసీని బలోపేతం చేయడానికి ముఖ్యమంత్రి అనేక చర్యలు చేపట్టారని అన్నారు. ఇచ్చిన హామీ మేరకు త్వరలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించనున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 1500 కొత్త బస్సులు ఆర్టీసీకి ఇవ్వాలని లక్ష్యంతో మొదట విడతలో 200 బస్సులు వచ్చాయని, వీటిల్లో 5 బస్సులు మచిలీపట్నం డిపోకు వచ్చినట్లు తెలిపారు. మచిలీపట్నంలో మురుగు నీటి సమస్య శాశ్వత పరిష్కారానికి ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. స్థానిక ఆర్టీసీ డిపోలో ప్రయాణికుల సౌకర్యాలు మెరుగుపరచుటకు, ప్రజల డిమాండ్ ఉన్న ప్రాంతాలకు సర్వీసులు ఏర్పాటు చేయుటకు కృషి చేస్తామన్నారు. ఈరోజు ప్రారంభించిన బస్సుల్లో 2 బస్సులు స్టార్ లైనర్లు BHEL సర్వీసులు కాగా, 3 బస్సులు విజయవాడకు నాన్- స్టాప్ సర్వీసులుగా నడపనున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి వాణిశ్రీ, మచిలీపట్నం ఆర్టీసీ డిపో మేనేజర్ పెద్దిరాజులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్, మాజీ మున్సిపల్ చైర్మన్ బాబా ప్రసాద్, స్థానిక నాయకులు బండి రామకృష్ణ , కుంచే నాని, మాజీ జెడ్పిటిసి లంకె నారాయణ ప్రసాద్, మాజీ ఏఎంసీ చైర్మన్ గోపు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.