Breaking News

గిరిజన వర్గాలకు అన్ని విధాలుగా ఆసరాగా ఉంటాం .. జిల్లా కలెక్టర్

-కలెక్టరేట్లో ఘనంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలోని గిరిజన వర్గాలకు అన్ని విధాలుగా ఆసరాగా నిలబడి వారి సంక్షేమాభివృద్ధికి కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. శుక్రవారం ప్రపంచ ఆదివాసి దినోత్సవమును పురస్కరించుకుని కలెక్టరేట్లోని మీకోసం సమావేశపు మందిరంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ రావు ముఖ్య అతిథులుగా పాల్గొని గిరిజనుల సంక్షేమ అభివృద్ధికి కృషిచేసిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, అల్లూరి సీతారామరాజు, ఏకలవ్యుడు, సేవాలాల్ మహారాజ్, చెంచులక్ష్మి, వెన్నెలగంటి రాఘవయ్య చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గతంలో పాడేరు సబ్ కలెక్టర్ గా పని చేస్తున్న కాలంలో గిరిజనుల సమస్యలపై తనకు అవగాహన ఉందని, వారి కోసం అరకు కాఫీ సంబంధిత ఉత్పత్తుల విక్రయాల నిమిత్తం ఒక కోపరేటివ్ సొసైటీని ఏర్పాటు చేయడంతో వారే స్వయంగా తమ ఉత్పత్తులను అమ్ముకుంటున్నట్లు నాటి సంగతులను  గుర్తు చేశారు. ప్రభుత్వం గిరిజనుల సంక్షేమ అభివృద్ధికి ఎంతో కట్టుబడి ఉందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి ప్రభుత్వ పథకం పొందాలన్నా ఆధార కార్డు కలిగి ఉండటం ఎంతో కీలకమైన నేపథ్యంలో జిల్లాలో యానాది కమ్యూనిటీకి ఆధార్ కార్డులు జారీ చేసేందుకు గతంలో ప్రత్యేక క్యాంపులు నిర్వహించామన్నారు. అయితే సాంకేతిక సమస్యలు తలెత్తడంతో కొంతమందికి మాత్రమే జారీ చేయగలిగామని, సమస్య పరిష్కారం కోసం త్వరలో రాష్ట్రస్థాయి అధికారులతో మాట్లాడి ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డులు జారీ చేస్తామన్నారు. చదువు ఒకటే మనిషి స్థితిగతులను మార్చగలవని, గిరిజన రెసిడెన్షియల్ పాఠశాలలను సద్వినియోగం చేసుకొని విద్యార్థులు వృద్ధిలోనికి రావాలని కోరారు. గిరిజన సామాజిక వర్గానికి చెందిన రుడావత్ శివకుమార్ నాయక్ వీరపనేనిగూడెం ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఇప్పటికే వ్యాపారం నడుపుతూ, మరల మరొక యూనిట్ స్థాపన కోసం దరఖాస్తు చేసుకొని అందరికీ ఆదర్శంగా నిలిచారని ఈ సందర్భంగా కలెక్టర్ అభినందించారు. జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ రావు మాట్లాడుతూ గిరిజనులపై ఎలాంటి నేరాలు జరిగిన కఠిన చర్యలు తీసుకుంటామని, వారికున్న సమస్యలను ఎలాంటి సంకోచం లేకుండా తన దృష్టికి తీసుకొస్తే తక్షణమే పరిష్కరించి వారికి పూర్తి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం కలెక్టర్ 10 మంది గిరిజన లబ్ధిదారులకు హౌసింగ్ స్కీమ్ కోసం రూ.6.3 లక్షల చెక్కును అందించారు. అదేవిధంగా ప్రభుత్వ గిరిజన పాఠశాలల్లో చదువుకుంటూ ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సత్కరించి అభినందించారు. ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డుల జారీ, భూ పంపిణీ, యానాది కమ్యూనిటీకి ప్రత్యేక కాలనీలు, పంచాయతీలు ఏర్పాటు చేయాలని పలు గిరిజన సంఘాల నాయకులు ఈ సందర్భంగా కలెక్టర్కు విన్నవించారు. ఈ కార్యక్రమంలో మోపిదేవి పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు ప్రదర్శించిన నృత్య, డప్పు ప్రదర్శనలు, యానాది సామాజిక వర్గానికి చెందిన కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ డిఆర్ఓ శ్రీదేవి, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి బి ప్రకాశరావు, గిరిజన కళాశాల ప్రిన్సిపాల్ కె కృష్ణమోహన్, పర్యాటక శాఖ అధికారి జి.రామ లక్ష్మణరావు, నూజివీడు ట్రిపుల్ ఐటి అసిస్టెంట్ ప్రొఫెసర్ జ్యోతి లాల్ నాయక్, గిరిజన సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నారావారిపల్లె గ్రామపంచాయతీ అభివృద్ధికి దిశా నిర్దేశం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : చంద్రగిరి మండలం నారావారిపల్లి గ్రామపంచాయతీ స్వర్ణ నారావారిపల్లె విజన్ లో భాగంగా ఆదర్శవంతంగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *