మచిలీపట్నం , నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కుల అభివృద్ధి పరచుటకు అవసరమైన స్థలాలను గుర్తించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మధ్యాహ్నం నగరంలోని కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించి భూముల లభ్యతను సమీక్షించారు. రేఖ చిత్రపటాల ద్వారా భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమరావతి నుండి చేపట్టిన ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) సమీపంలో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులు అభివృద్ధి కోసం 120 నుంచి 150 ఎకరాల ప్రభుత్వ భూములు అవసరం ఉందని అందుకోసం భూములను గుర్తించి కేటాయించాలని ఆదేశించిందన్నారు. ఈ ప్రాజెక్టు రాష్ట్ర ముఖ్యమంత్రి నేరుగా చూస్తున్న అత్యంత ప్రాధాన్యత కార్యక్రమన్నారు. వినియోగదారులకు అవసరమైన వస్తువులు సేవలు అందించేందుకు ఈ పార్కులు ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు. తద్వారా పెట్టుబడులు విశేషంగా ఆకర్షించి రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి, ఆర్థిక పురోభివృద్ధి సాధించవచ్చన్నారు. తాత్కాలిక అలైన్మెంట్ ప్రకారం అమరావతి నుండి ఔటర్ రింగ్ రోడ్డు గన్నవరం మండలంలోని బల్లిపర్రు, సగ్గురుమని, కంకిపాడులో మండలంలోని దావులూరు, కోలవెన్ను, మారేడుమాక, నెప్పల్లి, తోట్లవల్లూరు మండలంలోని బొడ్డపాడు, చిన్న పులిపాక, నార్త్,సౌత్ వల్లూరు గ్రామాల్లో రాబోతుందన్నారు. ఆ గ్రామాల్లో పార్కులను ఏర్పాటు చేసేందుకు భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని అనుకూలమైన భూములను గుర్తించాలన్నారు. ఈ సమావేశంలో ఇన్చార్జి డిఆర్ఓ శ్రీదేవి, గుడివాడ ఉయ్యూరు ఆర్డీవోలు పి పద్మావతి , డి రాజు తహసీల్దారులు శివయ్య భావనారాయణ, డీటీలు వీఆర్వోలు పాల్గొన్నారు.
Tags machilipatnam
Check Also
నారావారిపల్లె గ్రామపంచాయతీ అభివృద్ధికి దిశా నిర్దేశం
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : చంద్రగిరి మండలం నారావారిపల్లి గ్రామపంచాయతీ స్వర్ణ నారావారిపల్లె విజన్ లో భాగంగా ఆదర్శవంతంగా …