Breaking News

కృష్ణానదీ యాజమాన్య బోర్డు (కె.ఆర్.ఎం.బి.) కార్యాలయాన్ని కృష్ణా బేసిన్ విజయవాడలోనే ఏర్పాటు చేయాలి

-ఆంధ్రా రైతుల నీటి హక్కులను కాపాడాలి
-తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావుకు విజ్ఞప్తి చేసిన సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాలకృష్ణారావు

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణానదీ యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని గత వై.సి.పి. ప్రభుత్వం విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలన్న అసంబద్ధ నిర్ణయాన్ని పునఃసమీక్షించి కృష్ణా బేసిన్ విజయవాడలోనే ఏర్పాటు చేయాలని రాష్ట్ర జలవనరుల శాఖ ఎపెక్స్ కమిటీ మాజీ సభ్యులు సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాలకృష్ణారావు, నాగార్జునసాగర్ ఎడమ కాలువ ప్రాజెక్టు కమిటీ మాజీ ఛైర్మన్ యనమద్ది పుల్లయ్య చౌదరి, సమాఖ్య రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కవులూరి రాజా చంద్రమౌళి, చెన్నుపాటి శ్రీధర్ తదితరులు ఈరోజు ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు వ్రాసిన వినతిపత్రాన్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావుకు ఆయన కార్యాలయంలో కలిసి పూర్తి వివరాలతో వినతిపత్రం సమర్పించారు. ఇదే విషయమై ఈ రోజు  విజయవాడలోని రాష్ట్ర సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య కార్యాలయం నుండి రాష్ట్ర జలవనరుల శాఖ మాజీ ఎపెక్స్ కమిటీ సభ్యులు, సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాలకృష్ణారావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలో అన్ని రకాల మానిటరింగ్ చేయటానికి కృష్ణానదీ యాజమాన్య బోర్డు ఏర్పడిందని ఈ విషయం మీద దీని ప్రధాన కార్యాలయాన్ని విజయవాడలోనే ఏర్పాటు చేయటానికి 2018 జనవరిలో ఇబ్రహీంపట్నం ప్రాంతంలో భవనాలను కూడా పరిశీలించటం జరిగిందని అట్లాగే వై.సి.పి. ప్రభుత్వం ఏర్పడినాక జూన్ 2020లో అప్పటి ప్రభుత్వ ప్రధానకార్యదర్శి విజయవాడలోనే కె.ఆర్.ఎం.బి. కార్యాలయం ఏర్పాటు చేయటానికి కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శికి లేఖ రాస్తూ దాని ప్రతిని కె.ఆర్.ఎం.బి. సభ్యకార్యదర్శి, హైదరాబాదకు పంపడం జరిగిందని, అలాగే 2019 నవంబరులోను, 2020 ఆగస్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జలవనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ విజయవాడలోనే కె.ఆర్.ఎం.బి. కార్యాలయం ఏర్పాటు చేయాలని కేంద్ర జలశక్తి శాఖకు లేఖ రాయటం జరిగిందని తెలిపారు. 2020 అక్టోబరులో కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో జరిగిన 2వ ఎపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కె.ఆర్.ఎం.బి. కార్యాలయం, ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఏర్పాటు చేయుటగురించి రెండు తెలుగు రాష్ట్రాల అధికారులు చర్చించటం జరిగింది. ఇదిలా ఉండగా గత వై.సి.పి. రాష్ట్ర ప్రభుత్వం వీటికి విరుద్ధంగా 2020 డిసెంబరులో కె.ఆర్.ఎం.బి. కార్యాలయాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని కె.ఆర్.ఎం.బి.కి సూచించటం చాలా దారుణమన్నారు. కృష్ణానది పరీవాహక ప్రాంతంలో శ్రీశైలం, నాగార్జునసాగర్, ప్రకాశం బ్యారేజి క్రింద ఉమ్మడి కర్నూలు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో 30 లక్షల ఎకరాల ఆయకట్టు వుందని విజయవాడ పట్టణం కృష్ణానది ఒడ్డున రైల్, రోడ్డు, విమాన సౌకర్యం కలిగి ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వ అధికారులు, తెలంగాణ ప్రభుత్వ అధికారులు, ఆయకట్టుదారులు, నీటి సంఘాల ప్రతినిధులు తమ సమస్యలను కె.ఆర్.ఎం.బి. దృష్టికి తీసుకురావటానికి అనుకూలంగా ఉంటుందన్నారు. ఇన్ని సానుకూల అంశాలు వున్న విజయవాడలో కాకుండా కృష్ణా డెల్టాకు 400 కి.మీ., ఎన్.ఎస్.పి.కి 700 కి.మీ., శ్రీశైలంకు 800 కి.మీ.లకు దూరంగా గోదావరి బేసిన్ అవతల వున్న విశాఖపట్నంలో మూడు రాజధానుల్లో భాగంగా కార్యనిర్వాహక రాజధాని నెపంతో కె.ఆర్.ఎం.బి. కార్యాలయాన్ని ఎలా ఏర్పాటు చేస్తారని గత వై.సి.పి. ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గతంలో కేంద్ర జలశక్తి శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2014 – 2019, 2019-2024 మధ్య జరిగిన నిర్ణయాలను పరిగణనలోనికి తీసుకుని విజయవాడలోనే కార్యాలయాన్ని ఏర్పాటు చేయించటానికి అన్ని రకాల చర్యలు తీసుకోవాలని పల్లా శ్రీనివాసరావుకు విజ్ఞప్తి చేశారు. అట్లాగే ప్రస్తుతం నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తిగా నిండినందున ఆంధ్రప్రదేశ్ ఎన్.డి.ఎ. ప్రభుత్వం కోరిన విధంగా నాగార్జునసాగర్ 2, 3 జోన్ కు 32 టి.ఎం.సి.లు నీరు విడుదల చేయాలని కోరినందున నాగార్జునసాగర్ ఎడమకాలువ 3వ జోన్ పరిధిలోని 2.36 లక్షల ఎకరాల ఆయకట్టులోని చెరువులకు త్రాగునీరు, పంటలకు సాగునీరు విడుదల చేయించటానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో నూతన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటానికి ముందురోజు అప్పటి వై.సి.పి. ప్రభుత్వం అసమర్ధత వలన నాగార్జునసాగర్ కుడికాలువ ఆంధ్రా భూభాగంలో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సి.ఆర్.పి.ఎఫ్.దళాలను పహారాకు నియమించారని వీటిని తొలగించి కుడికాలువ యాజమాన్యాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అప్పగించటానికి చర్యలు తీసుకోవాలని పల్లా శ్రీనివాసరావుకు విజ్ఞప్తి చేశారు. దీని మీద తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు స్పందిస్తూ ఈ విషయాలను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకువెళ్ళి కె.ఆర్.ఎం.బి. కార్యాలయాన్ని విజయవాడ తరలించటానికి, ఆంధ్ర రైతుల నీటి హక్కులు కాపాడటానికి చర్యలు తీసుకుంటామని నీటి సంఘాల ప్రతినిధులకు హామీ ఇచ్చారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నారావారిపల్లె గ్రామపంచాయతీ అభివృద్ధికి దిశా నిర్దేశం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : చంద్రగిరి మండలం నారావారిపల్లి గ్రామపంచాయతీ స్వర్ణ నారావారిపల్లె విజన్ లో భాగంగా ఆదర్శవంతంగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *