పంచాయతీలు, సర్పంచుల వ్యవస్థ బలోపేతానికి కూటమి ప్రభుత్వం కట్టుబడిఉంది

-కీలకమైన గ్రామీణ వ్యవస్థకు జీవం పోయాలన్నదే నా తపన
-పలుమార్లు అధికారులతో సమీక్షల తర్వాత కీలకంగా మూడు నిర్ణయాలు
-గ్రామ సభల నిర్వహణ, జల్ జీవన్ మిషన్ నిధుల వ్యయంపై పల్స్ సర్వే, స్వాత్రంత్ర్య, గణతంత్ర వేడుకల నిర్వహణకు పంచాయతీలకు నిధుల పెంపు
ఆర్థికంగా పంచాయతీలను పరిపుష్టం చేసేలా అడుగులు వేస్తాం

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
‘గ్రామాలే దేశానికి పట్టుగొమ్మలు, గ్రామ స్వరాజ్యమే దేశ ప్రగతికి మార్గం’ అన్న మహాత్మా గాంధీజీ మాటలే మార్గదర్శకంగా- కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని పంచాయతీలను, ప్రజలతో ప్రత్యక్షంగా ఎన్నుకునే సర్పంచుల వ్యవస్థను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. గ్రామాలకు జీవం పోసేలా పంచాయతీలను ఆర్థికంగా బలోపేతం చేయడం, గ్రామాల్లో సౌకర్యాల కల్పనకు ముందడుగు వేయాలని భావిస్తున్నాం. మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత నేను అనేక పర్యాయాలు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, రక్షిత మంచినీటి సరఫరా, అటవీశాఖ అధికారులతో సమీక్షలు చేశాను. రాష్ట్రంలో ఉన్న గ్రామాల్లో వాస్తవ పరిస్థితులు తెలుసుకునే ప్రయత్నం చేశాను. గ్రామీణ ప్రాంతాల్లో చాలా కాలంగా అపరిష్కృతంగా ఉండిపోతున్న సమస్యల వెనుకున్న అసలు కారణాలను అన్వేషించే ప్రయత్నం చేశాను. అనేకసార్లు దీనిపై చర్చించిన తర్వాత మూడు కీలకమైన నిర్ణయాలను తీసుకున్నాం. వీటిని వెంటనే అమలు చేయాలని నిర్ణయించాం. దీనివల్ల పంచాయతీలు, సర్పంచుల వ్యవస్థ కు కొత్త జీవం పోయడానికి ఈ ముందడుగు ఉపయోగపడుతుందని విశ్వసిస్తున్నాను.

13,326 పంచాయతీల్లో ఒకేసారి గ్రామ సభలు
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు కోసం గ్రామ సభలను రాష్ట్రంలోని 13,326 గ్రామ పంచాయతీల్లో ఒకేసారి నిర్వహించాలని నిర్ణయించాం. కేంద్ర పథకం అయిన మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో గ్రామాల్లో ఏ పనులు చేయాలి..? దేనికి ప్రాధాన్యం ఇవ్వాలి..? ఎలాంటి పనులకు ఆమోదం తెలపాలి అన్న విషయాలను గ్రామ సభలో చర్చించి, నిర్ణయం తీసుకుంటారు. వేటికి ప్రాధాన్యం ఇవ్వాలి… ఉపాధి నిధులతో గ్రామాలకు కొత్త కళ తీసుకురావడం, ఆయా గ్రామాల్లో ఉన్న సౌకర్యాల కల్పన, మౌలిక వసతుల పెంపు వంటి విషయాలను గ్రామ సభల్లో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటారు. నియోజకవర్గ ఎంపీ, ఎమ్మెల్యే, సర్పంచి, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులతో కలిసి సభ జరుగుతుంది. ఏ పనులు చేయాలనే దానిపై ప్రజల మధ్యలోనే చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటారు. ఆయా గ్రామాలకు ఏ పనులు అవసరమో గుర్తించి వాటిని వెంటనే ఉపాధి పథకంలో చేపట్టేలా చొరవ తీసుకుంటాం. రాష్ట్రం మొత్తం మీద ఒకే రోజు ఈ సభలు నిర్వహిస్తాం.

పైపు లైన్లు వేసి వదిలేశారు
జల్ జీవన్ మిషన్ పథకం అనేది కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకం. ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు ఇవ్వాలనేది ఈ మిషన్ లక్ష్యం. గత అయిదేళ్లలో జల్ జీవన్ మిషన్ పథకంలో రూ.4 వేల కోట్లు ఖర్చు పెట్టినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే వాటి ప్రతిఫలాలు మాత్రం క్షేత్రస్థాయిలో అందినట్లు దాఖలాలు లేవు. జల్ జీవన్ మిషన్ నిధులను ఖర్చు చేసేందుకు కేవలం క్షేత్రస్థాయిలో కొన్ని పైపు లైన్లు వేసి వదిలేసినట్లు నా దృష్టికి వచ్చింది. నిధులను ఖర్చు చేసినట్లు చూపి జేబులో వేసుకునేందుకు చేశారు తప్ప, వాటి వల్ల ప్రయోజనం ఎక్కడా దక్కలేదు. కేంద్ర ప్రభుత్వ ఆశయానికి అనుగుణంగా గత ప్రభుత్వంలో పనులెక్కడా జరగలేదు. జల్ జీవన్ మిషన్ పనులపై వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకు జరిగిన పనులు, ఖర్చు చేసిన నిధులపై వివరాలు తెలుసుకునేందుకు, అలాగే జరగాల్సిన పనులను ఎలా ముందుకు తీసుకెళ్లాలనే విషయాలతో 12 అంశాలను ప్రతిపాదికగా తీసుకునేందుకు పల్స్ సర్వే పేరుతో ఓ సర్వే నిర్వహించాలని అధికారులను ఆదేశించాను. రాష్ట్రమంతటా జరిగే ఈ సర్వేలో వెలుగుచూసే అంశాలను ప్రజల ముందు పెడతాం. జల్ జీవన్ మిషన్ నిధులను, పథకాన్ని సమర్థంగా ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై నిర్ణయం తీసుకుంటాం.

ఆగస్టు 15న జెండా వందనం పండగలా చేయాలి
34 సంవత్సరాల క్రితం స్వాతంత్ర్య దినోత్సవాన్ని గ్రామాల్లో జరిపేందుకు నిధులు కేటాయించిన జీవో స్థానంలో కొత్తగా గ్రామాలకు స్వాతంత్ర్య దినోత్సవాన్ని సంబరంలా, సగర్వంగా జరుపుకొనేందుకు భారీగా నిధులను పెంచుతున్నాం. రాష్ట్రమంతటా పంద్రాగస్టు వేడుకలు సంబరంలా జరగాలనే ఆకాంక్షతో జెండా పండుగ నిధులను పంచాయతీలకు భారీగా పెంచాం. ఆగస్టు 15న జెండా వందనం గ్రామగ్రామానా పండగలా చేయాలి. గతంలో 5 వేల జనాభా కంటే తక్కువగా ఉండే మైనర్ పంచాయతీలకు ఆగస్టు 15న పతాకావిష్కరణకు నిధులు కేవలం రూ.100లు ఉంటే దాన్ని ఒకేసారి రూ.10 వేలకు పెంచాం. 5 వేల జనాభా దాటిన మేజర్ పంచాయతీలకు రూ.250లు ఉంటే దాన్ని రూ.25 వేలకు పెంచాం. ప్రతి గ్రామ పంచాయతీకి ఈ నిధులు ఆగస్టు 15 వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు తోడ్పడతాయి. ఇదే విధంగా ప్రతి గ్రామానికి జనవరి 26న గణతంత్ర దినోత్సవ వేడుకలకు నిధులు అందుతాయి. సర్పంచులు సగర్వంగా గ్రామంలోని అందరినీ పిలిచి మరీ జెండా పండుగను నిర్వహించుకునేలా వారికి కూటమి ప్రభుత్వం నిధులను ఇస్తోంది. 34 సంవత్సరాలుగా ఎప్పుడూ ఈ స్థాయిలో నిధులను పెంచలేదు. స్వాతంత్ర్య దినోత్సవానికి నిధులు ఇచ్చినట్లుగానే గణతంత్ర దినోత్సవానికి కూడా నిధులు ఇస్తాం.

సర్పంచుల ఆత్మ గౌరవం తగ్గకూడదు
ఏ దశలోనూ- ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకున్న సర్పంచుల ఆత్మగౌరవం తగ్గకుండా చూస్తాం. అలాగే గ్రామాల్లో ఆగష్టు 15 వేడుకలు ఘనంగా నిర్వహించేలా స్వాతంత్ర్య సమరయోధులు, దేశం కోసం పనిచేసిన సైనికులు, పారిశుద్ధ్య కార్మికులను సత్కరించుకునేలా కార్యక్రమాలను నిర్వహించాలని సర్పంచులను కోరుతున్నాను. గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు పారిశుద్ధ్య కార్మికులకు ఎంతటి గౌరవం ఇచ్చేవారో తెలిసిన విషయమే. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ఎన్డీయే ప్రభుత్వం కూడా వారికి సముచిత గౌరవం ఇస్తుంది. ప్రతి పాఠశాలలను పిల్లలకు జెండా పండుగ విశిష్టత తెలిసేలా వ్యాసరచన, క్విజ్, చిత్రలేఖనం, డిబేట్, క్రీడా పోటీలను నిర్వహించి వారికి బహుమతులు అందజేయాలని సూచిస్తున్నాను. ఈ విషయంలో ఉపాధ్యాయులు భాగస్వామ్యం తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశాం. గ్రామాల్లో జరిగే పంద్రాగస్టు కార్యక్రమాలన్నీ పర్యావరణ హితంగా జరగాలన్నదే నా ఆలోచన. ఎలాంటి ప్లాస్టిక్ జెండాలు, ఇతర పర్యావరణ వినాశక అంశాలు జెండా పండుగ వేడుకల్లో లేకుండా చూడాలి. చేనేత కళాకారులు తయారు చేసిన జెండాలు వాడితే మేలు. స్థానికంగా లభ్యమయ్యే పర్యావరణ హితమైన జెండాలను వాడాలని సూచిస్తున్నాను.

పంచాయతీలకు జీవం పోస్తున్నాము
పంచాయతీరాజ్ వ్యవస్థ, సర్పంచి వ్యవస్థలను బలోపేతం చేయడానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుంది. గత ప్రభుత్వంలో పంచాయతీలకు వచ్చిన నిధులు డిస్కంలకు అంటూ తీసుకున్నారు. పంచాయతీలు ఆర్థిక పరిపుష్టి కోల్పోయాయి. కనీసం బ్లీచింగ్ పౌడర్ కొనడానికి కూడా డబ్బులు లేవని సర్పంచులు నా దగ్గర గతంలో ఆవేదన వ్యక్తం చేసిన సందర్భాలున్నాయి. పంచాయతీలకు తిరిగి జీవం పోయాలనే తపనతో వేగంగా అడుగులు వేస్తున్నాం. స్థానిక సంస్థలకు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచి, గ్రామీణ ప్రాంతాలు సర్వతోముఖాభివృద్ధి దిశగా అడుగులు వేయాలని కూటమి ప్రభుత్వం బలంగా భావిస్తోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటనలో తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు

-మ‌నోభావాలు దెబ్బ‌తినే విధంగా పండుగ‌ల‌పైనా ప్రేలాప‌న‌లు -రూ.850 కోట్ల‌తో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *