-మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు
ఆత్కూరు(ఉంగుటూరు), నేటి పత్రిక ప్రజావార్త :
మంచి జీవన శైలి, ఆహారపు అలవాట్లను అలవర్చుకోవడం ద్వారా మంచి ఆరోగ్యం పొందవచ్చని మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఆదివారం ఆయన ఉంగుటూరు మండలం ఆత్కూర్ లోని స్వర్ణభారత్ ట్రస్ట్, విజయవాడ చాప్టర్ లో ఈవిఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, గుడివాడ వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత వైద్యశిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాజీ ఉప రాష్ట్రపతి మాట్లాడుతూ ఆత్కూరుతో పాటు హైదరాబాద్, నెల్లూరులోని స్వర్ణ భారత్ ట్రస్ట్ లు గ్రామీణ పేద విద్యార్థులకు ఉచిత వసతి, భోజనం సదుపాయం కల్పించి 17 రకాలైన ట్రేడులలో ఉచిత శిక్షణ తరగతులను నిర్వహించి వారి జీవనోపాధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వాలు ప్రజలను సోమరులుగా తయారు చేసే ఉచితాలను అందించడం మానుకోవాలని, వాటి స్థానంలో విద్య వైద్యం ఉచితంగా అందించి పేదవారి అభ్యున్నతికి కృషి చేయాలని సూచించారు. నేటి తరం పిల్లలు భారతీయ సంస్కృతిని వంటబట్టించుకునే విధంగా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందని, పాశ్చాత్య సంస్కృతిని విడనాడాలని హితవు పలికారు. సెల్ ఫోన్లు, టెక్నాలజీ ప్రభావంతో ప్రజలు సొంతగా ఆలోచించటం మానేసారని, అవసరం మేరకే సోషల్ మీడియా ఉపయోగించుకోవాలని, దాని వ్యసనంలో పడి సమయాన్ని వృధా చేసుకోవద్దని విద్యార్థులకు సూచించారు. ఉదయాన్నే నిద్ర లేవటం అలవాటు చేసుకోవాలన్నారు. యోగా వంటి శారీరక వ్యాయామాలు చేస్తూ, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చెబుతూ, ప్రాసెస్ చేసిన ఆహారానికి దూరంగా ఉంటూ ఇంటి వద్ద వండిన ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఆత్కూరు స్వర్ణభారత్ ట్రస్ట్, విజయవాడలో పేద ప్రజలకు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు ఆయన ఈవిఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, గుడివాడ వారికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో ప్రజలకు గుండె జబ్బులు, మెదడు, నరాలు, గ్యాస్ట్రిక్ సమస్యలు, ఉదరం, ఎముకలు కీళ్లు, క్యాన్సర్, కంటి, దంత పరీక్షలు, స్త్రీ ప్రసూతి సమస్యలు తదితర వైద్య సేవలు అందించి ఉచిత మందుల పంపిణీ చేశారు.
అల్లూరి రామరాజు అవయవదానం:
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం, అంబాపురం గ్రామానికి చెందిన అల్లూరి రామరాజు(75 సం .రాలు) అవయవదానం చేయడానికి ముందుకు వచ్చారు. మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు 75 వసంతాలను పూర్తి చేసుకున్న నేపథ్యంలో అభిమానంతో ఆయనకు గుర్తుగా ఎన్టీఆర్ ట్రస్ట్ క్యాన్సర్ ఆసుపత్రికి అవయవ దానం చేయాలని నిర్ణయించుకున్నట్లుగా అల్లూరి రామరాజు తెలిపారు. ఈ విషయంలో ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచిన రామరాజును మాజీ ఉపరాష్ట్రపతి ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో స్వర్ణభారత్ ట్రస్ట్ సీఈఓ శరత్ బాబు, వైద్యులు రాజేంద్ర, సతీష్ చంద్ర, రాజ్యలక్ష్మి, రేవంత్ కుమార్, అమృత, రఘువరన్, సుమన్ కుమార్, జయశ్రీ, ప్రశాంతి, గౌతమి, అనూష, నీలిమ, శ్రీనివాస్ పారామెడికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.