Breaking News

ఇస్రో ప్రస్థానం స్ఫూర్తిదాయకం

-ఇస్రో అపూర్వ ప్రయాణం వెనుక ఎందరో శాస్త్రవేత్తల శ్రమ దాగుంది
-గ్లోబల్ స్పేస్ ఎకానమీలోనూ భారత్ ముద్ర వేసింది
-ఎన్డీయే ప్రభుత్వం అంతరిక్ష పరిశోధనలకు ప్రాధాన్యం ఇస్తుంది
-అపజయంలోనూ శాస్త్రవేత్తలకు ప్రధాని శ్రీ మోదీ గారు ఇచ్చిన ధైర్యం గొప్పది
-ఇస్రోకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగిన విధంగా సహకరిస్తుంది
-ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు, యువతలో అంతరిక్ష పరిశోధనలపై ఆసక్తిని పెంపొందించేలా ఇస్రోతో ఎంఓయూ చేసుకుంటాం
-శ్రీహరికోట షార్ లో నిర్వహించిన జాతీయ అంతరిక్ష దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 

శ్రీహరికోట, నేటి పత్రిక ప్రజావార్త :
‘సామాన్యుడు ఈ రోజు ఎంతో ఆనందంతో అనుభవిస్తున్న శాస్త్ర సాంకేతిక రంగాల ప్రతిఫలాల వెనుక… జీవితంలో సుఖాలను, సంతోషాలను, బాధలను, బంధాలను సైతం త్యాగం చేసిన ఎందరో శాస్త్రవేత్తల శ్రమ దాగుంది. అంతరిక్ష పరిశోధనలే ప్రాణంగా పని చేస్తున్న ఎందరో మహానుభావుల పరిశ్రమ దాగుంది. దేశం కోసం, జాతి కోసం తమ సొంత కుటుంబాలను, ఇష్టాలను వదులుకొని, అవమానాలు, అవహేళనలను పట్టించుకోకుండా ముందుకు సాగిన గొప్ప వ్యక్తుల సాహస ప్రయాణం దాగుంది. వారే ఈ దేశానికి నిజమైన హీరోలు. ఆ అన్ సంగ్ హీరోలే నాకు నిజ జీవిత హీరోలుగా అనిపిస్తారు. తెరపై కనిపించకుండా దేశం కోసం జీవితాన్ని ధారబోసిన శాస్త్రవేత్తలు నాకు నిజమైన స్ఫూర్తిప్రదాతల’ని ఉప ముఖ్యమంత్రివర్యులు కొణిదల పవన్ కళ్యాణ్ అన్నారు. జాతీయ అంతరిక్ష దినోత్సవ కార్యక్రమాల్లో భాగంగా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధన సంస్థ (షార్) నిర్వహించిన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన పవన్ కళ్యాణ్ చిన్నారులు, కళాశాల యువత, షార్ శాస్త్రవేత్తలు, సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్  మాట్లాడుతూ “ఒక ఫార్ములా కనుక్కోవడానికి కాని, ఓ ప్రయోగం నిర్వహించేందుకుగానీ శాస్త్రవేత్తలు చేసే మేధో మధనం చాలా విలువైనది. ఆలోచనల్లో పడి వారు నిద్ర, ఆహారానికి కూడా ఒక్కోసారి దూరం అవుతారు. దేశానికి ఏదో ఒకటి చేయాలనే తపన, ఏకాగ్రత, శ్రమ అమూల్యమైనవి. వారికి ఈ దేశం ఏమిచ్చినా రుణం తీర్చుకోలేదు. అలాంటి హీరోలు ప్రజలకు తెలియాలి. వారు యువతలో నిరంతరం స్ఫూర్తి నింపాలి. చిన్నచిన్న విషయాలకే తల్లడిల్లిపోయే నేటి తరం యువతరానికి శాస్త్రవేత్తలు స్ఫూర్తిప్రదాతలుగా మారి, దారి చూపాలి. శాస్త్రవేత్తల కష్టాన్ని జాతి గుర్తించాలి. వారికి తగిన గౌరవం ఇవ్వడం, వారి మాటలను జాగ్రత్తగా వినడం ద్వారా కచ్చితంగా అవి గొప్ప జీవితం వైపు తీసుకెళ్తాయి.

బలంగా కోరుకుంటే మంచి తప్పకుండా జరుగుతుంది
నేను నెల్లూరులో చదువుకున్నాను. నాకు చిన్నప్పటి నుంచి శాస్త్రసాంకేతిక రంగాలు, అంతరిక్ష ప్రయోగాలపై మక్కువ ఉండేది. స్కూళ్లో టీచర్ ను పదేపదే దీనిపై ప్రశ్నలు అడిగేవాడిని. టీచర్ నాలో ఉన్న తపనను గుర్తించి… నన్ను స్కూలు సైన్స్ టీంలో వేసి ఆర్యభట్ట ఉపగ్రహ ప్రయోగం మీద ఓ నమూనా తయారు చేసి తీసుకురమ్మన్నారు. నానా రకాల పాట్లు పడి… అప్పుడున్న వనరులతో సాధారణ పేపర్ నమూనా తయారు చేయడానికే నాకు చుక్కలు కనిపించాయి. మరి అంతరిక్షంలోకి ప్రయోగించే, అక్కడ పని చేసే ఉపగ్రహాల తయారీకి, వాటి ప్రయోగానికి శాస్త్రవేత్తలు ఎంత కష్టపడతారో అన్న ఆలోచన నాకు శాస్త్రవేత్తలపై అమితమైన గౌరవాన్ని పెంచింది. వారు చేసే ప్రయోగాలకు జీవితం ధారబోస్తారు. అందరికీ అవసరమయ్యే సాంకేతికను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వారు నిత్యం శ్రమిస్తారు. నెల్లూరులో ఉన్నపుడు శ్రీహరికోటలో రాకెట్ ప్రయోగిస్తారని తెలుసుకొని ఎప్పుడైనా ఇక్కడకు రావాలని అనుకునేవాడిని. అయితే చాలామంది పోలీసులు ఉంటారు. శాస్త్రవేత్తలు, అధికారులు ఉండే ఈ ప్రదేశానికి నేను అసలు వెళ్లలేను అనుకునే దగ్గరే నా ఆలోచన ఆగిపోయేది. అనుకోకుండా ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం యాదృచ్ఛికం అయినా, జీవితంలో మంచిని బలంగా కోరుకుంటే అవుతుందనడానికి ఇది నిదర్శనం.

దేశానికి సేవ చేయడం మహద్భాగ్యం
భారతదేశంలో ఉన్న ఎంతో విలువైన శాస్త్రవేత్తలు, నిపుణులు నిజమైన దేశభక్తులు. వారి మేధస్సులోని అపార జ్ఞానం దేశానికి మాత్రమే చెందాలని భావించడం వారి దేశ భక్తికి నిదర్శనం. సగటు భారతీయుడి విలువలకు తగ్గట్టుగా కడదాకా నా దేశం, నా నేల అనుకునే మనస్తత్వం మనందరినీ కలుపుతుంది. విదేశాలకు వెళ్లే వీలున్నా, అక్కడ హోదా, ధనం వచ్చే అవకాశమున్నా వారంతా దేశానికి కట్టుబడి చేసిన సేవలు, వారి ప్రతిభే దేశాన్ని ముందుకు నడిపిస్తున్నాయి. 1969 నుంచి ఇంతింతై వటుడింతై అన్నట్లు సాగిన భారతదేశ అంతరిక్ష పరిశోధన ప్రయాణం నేడు ప్రపంచంలోనే మేటిగా మారింది. భారత్ ను బలమైన శక్తిగా నిలపడంలో ఎందరో కనిపించని హీరోల కష్టం దాగుంది. వారి విజ్ఞానం ఉపయోగించుకొని నిరంతరం ముందుకు సాగుతున్న వారికి మాత్రమే విజిల్స్, చప్పట్లు దక్కాలని భావిస్తాను.

దైవం మానుష రూపేణా
చిన్నప్పుడు నేను, మా అమ్మ ప్రతిరోజు సాయంత్రం అవగానే ఇంట్లో బల్బు స్విచ్ వేసి దణ్నం పెట్టుకోవడం గమనించేవాడిని. నువ్వు ఎవరికి మొక్కుతున్నావు అని అడిగితే బల్బు కనిపెట్టిన థామస్ అల్వా ఎడిసన్ కు అని చెప్పేది. అంటే శాస్త్రవేత్తలను, వారి జ్ఞానాన్ని దేవుడిగా నమ్మే సంస్క్రతి మనది. పది మందికి మంచి చేసేవారికి దణ్నం పెట్టడమే భారతీయ ధర్మం. దైవం మానుష రూపేణా అని భావిస్తాం. అలాగే పది మందికీ మంచి చేసే వారిని దేవుడిగా భావిస్తాం. విశ్వం తాలుకా శక్తి నన్ను ఇక్కడ వరకు నడిపించింది అని నమ్ముతాను. మంచి చేయాలని, దేశానికి ఏదో ఇవ్వాలని బలంగా అనుకుంటే కచ్చితంగా అది జరిగి తీరుతుంది. అలాగే దేశం కోసం పనిచేసే ప్రతి శాస్త్రవేత్తకు జాతి రుణ పడి ఉంది.

ఎక్కడో ఒక చోట అడుగుపడితేనే…
ఎక్కడో కేరళలోని తుంబ అనే ప్రాంతంలో చిన్నస్థాయిలో మొదలైన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయాణం నాకు స్ఫూర్తిదాయకం. ఎక్కడో ఒక చోట అడుగుపడితేనే అది వేల మైళ్ల ప్రయాణానికి దారి చూపుతుంది. మన దగ్గర వనరుల్లేవు.. మనకు శక్తి లేదు.. మన వల్ల కాదు అనుకుంటే ఏదీ కాదు. భారతీయ పరిశోధన సంస్థ ఒకేసారి 104 ఉపగ్రహాలను పంపే స్థాయికి ఎదగడం ఓ గొప్ప రికార్డు. మాజీ రాష్ట్రపతి శ్రీ అబ్దుల్ కలాం గారు ఎప్పుడు ఒకటి చెబుతుండేవారు. నీ కల.. నీ ఆశయం పెద్దగా ఉండాలి అని అనేవారు. నిజంగానే ఆయన మాట ఓ స్ఫూర్తి మంత్రం. ఇస్రో పెద్దలు కూడా ఒకప్పుడు అలాగే కలలు కనేవారు. ఈ దేశానికి ఇస్రో అనేది తలమానికం కావాలి… ఇస్రో ప్రపంచంలో అగ్రగామి అంతరిక్ష పరిశోధన సంస్థ కావాలి అనుకునే వారు. అది ఇప్పుడు తీరుతోంది. ఇస్రో పని తీరు వల్ల ప్రపంచ దేశాలన్నీ మన వైపు చేసేలా చేసింది. ఈ దేశం అన్ని రంగాల్లో అగ్రగామి కావాలి… ప్రపంచానికే భారతదేశం దిక్సూచి కావాలని బలంగా ఆకాంక్షిస్తున్నాను.

శ్రీహరికోట.. పర్యావరణహిత ప్రయోగాల వేదిక
శ్రీహరికోటకు హెలికాప్టర్ లో వస్తున్న సమయంలో పైనుంచి ఈ ప్రయోగ ద్వీపాన్ని చూస్తుంటే ముచ్చటేసింది. పచ్చగా అడవిని తలపించేలా షార్ కనిపించింది. శ్రీహరికోట నిర్మాణం ఓ అద్భుతం. చుట్టూ సముద్రం, మరో పక్క సరస్సు మధ్యలో ఉన్న ద్వీపంలో అంతరిక్ష ప్రయోగశాల నిర్మాణం దేశానికే తలమానికంగా నిర్మించుకోవడం గొప్ప విశేషం. దీంతోపాటు పర్యావరణానికి ఏ మాత్రం ఇబ్బంది కలగకుండా, అందమైన చెట్లతో అడవిని తలపించే వాతావరణంలో షార్ నిర్వహణ ఓ ప్రకృతి ప్రేమికుడిగా నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. 40 వేల ఎకరాల్లో ఎక్కడా కూడా పర్యావరణాన్ని విధ్వంసం చేసే చర్యలు లేవంటే మామూలు విషయం కాదు. లోపలికి వచ్చాక కూడా పచ్చటి తోరణాల్లా షార్ లో చెట్లు స్వాగతం పలుకున్న తీరు చూసి గొప్పగా ఉంది. జనసేన మూల సిద్ధాంతాల్లో ఒకటైన ‘పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం’ అనేది ఇక్కడ నాకు కనిపించింది. బయో డైవర్సీటీ, అటవీశాఖ చేస్తున్న కృషి గొప్పగా ఉన్నాయి.

అంతరిక్ష పరిశోధనల్లో భారత్ రాజీపడదు
ఓ హాలివుడ్ సినిమాకు పెట్టిన ఖర్చు కంటే తక్కువ ఖర్చుతో భారతదేశం మార్స్ మిషన్ మంగళ్ యాన్ పూర్తి చేసింది. ప్రపంచంలో ఇంత తక్కువ ఖర్చుతో ప్రపంచంలో అంతరిక్ష పరిశోధనలు చేసిన దేశాలు లేవంటే మామూలు విషయం కాదు. ప్రపంచ దేశాలన్నీ భారతదేశం అతి తక్కువ ఖర్చుతో చేస్తున్న ప్రయోగాల వైపు దృష్టి సారించాయంటే మన ఇస్రో చేస్తున్న కృషి, పని తీరు అసమానం అని చెప్పాలి. ఇస్రోలో పని చేస్తున్న సఫాయి దగ్గర నుంచి ఛైర్మన్ వరకు అంతా ఈ గొప్ప ప్రయాణంలో భాగస్వాములే.
2014లో న్యూయార్క్ టైం పత్రికలో మన అంతరిక్ష పరిశోధన సంస్థ గురించి వ్యంగ్యంగా ఓ కార్టూన్ వచ్చింది. సరిగ్గా దశాబ్దం తర్వాత అదే న్యూయార్క్ టైం పత్రిక.. నడుస్తున్న దేశం అయిన అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా మన ఇస్రోతో కలిసి సంయుక్తంగా పనిచేయడానికి ఆసక్తి చూపిందంటే ఇస్రో ప్రయాణం ఎంత గొప్పగా, పట్టుదలతో సాగిందో అర్ధం అవుతంది. అంతరిక్ష పరిశోధనల్లో భారత్ ఎక్కడ రాజీ పడకుండా ప్రయాణం చేస్తుంది. ఇస్రో ప్రయోగాలకు తగిన విధంగా కేంద్రం ఎప్పటికప్పుడు బడ్జెట్ ను పెంచుతోంది. ప్రయోగాలకు అవసరం అయిన నిధులను అందజేస్తోంది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో ఇస్రోకు ఏటా రూ.5,615 కోట్లు మాత్రమే కేటాయిస్తే, అది ఎన్టీయే ప్రభుత్వం లొ 2022-23 బడ్జెట్ లో రూ.13,700 కోట్లకు చేరింది. అంటే అంతరిక్ష ప్రయోగాలకు ఇస్తున్న ప్రాధాన్యం గుర్తించవచ్చు. చంద్రయాన్ – 2 ప్రయోగం విఫలమైనపుడు నిరాశలో, బాధలో ఉన్న శాస్త్రవేత్తలకు దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు స్వయంగా విచ్చేసి ధైర్యం చెప్పడం, గుండెలకు హత్తుకోవడం గొప్ప విషయం. ఆయన ఇచ్చిన ధైర్యంతోనే ఇస్రో శాస్త్రవేత్తలు ధైర్యంగా ముందడుగు వేసి చంద్రయాన్ – 3 విజయవంతం చేశారు. అపజయం వచ్చినపుడు శాస్త్రవేత్తలను నిందించకుండా, వారికి బాసటగా నిలిచిన శ్రీ మోదీగారి ఓదార్పు నన్ను కూడా కదలించింది.

గగన్ యాన్ ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకరిస్తుంది
ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టబోయే గగన్ యాన్ ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగిన సహాయ సహకారాలు అందిస్తుంది. కేంద్ర ప్రభుత్వం అంతరిక్ష పరిశోధనలను పూర్తిస్థాయిలో ప్రొత్సహిస్తుంది. శాస్త్రవేత్తల కృషి, వారి జ్ఞానం వినియోగించుకొని అద్భుతాలు చేయాలని భావిస్తోంది. భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇప్పుడు స్పేస్ ఎకానమీ ని సృష్టించే స్థాయికి ఎదిగింది. విదేశాలకు చెందిన ఉపగ్రహాలను మనం కక్ష్యలో ప్రవేశపెట్టడం ద్వారా స్పేస్ ఎకానమీని మనం సాధిస్తున్నాం. మొత్తం గ్లోబల్ స్పేస్ ఎకానమీలో 2 నుంచి 3 శాతం సాధించే స్థాయికి ఇస్రో చేరుకుంది. మన జాతీయ స్థూల జాతీయోత్పత్తిలోనే మంచి అంకెలను ఇస్రో ఇస్తోంది. ఇస్రో సక్సెస్ రేటు కూడా ప్రపంచదేశాల అంతరిక్ష పరిశోధన సంస్థలతో పోల్చుకుంటే చాలా బాగుంది. ఇతర దేశాలు ఇస్రో సేవల కోసం అభ్యర్థిస్తున్నాయి. ఇది ఒక్క రోజులో వచ్చిన విజయం కాదు. ఎన్నో మేధస్సుల కలయిక… ఎందరో మేధావుల పరిశ్రమ. ఇస్రో కేవలం ప్రయోగాలకే పరిమితం కాకుండా విద్యార్థులకు విజ్ఞాన ప్రదర్శనలు, పోటీలు నిర్వహించడం గొప్ప విషయం. భావి తరాల భవిష్యత్తు దృష్ట్యా పిల్లలను ప్రోత్సహించడం అభినందనీయం.

ఆ రోడ్డు అయిదు రోజుల్లో పూర్తవుతుంది
బుచ్చినాయుడు కండ్రిగ నుంచి షార్ కు వైపు వచ్చే 17 కిలోమీటర్ల రోడ్డు బాగాలేదని షార్ అధికారులు నా దృష్టికి తెచ్చారు. వెంటనే కలెక్టరుతో మాట్లాడి రోడ్డు పనులు మొదలుపెట్టాం. మరో 5 రోజుల్లో పనులు పూర్తి అవుతాయి. ఇలాంటి పనులను వెంటనే పూర్తి చేసే బాధ్యతను మేం తీసుకుంటాం. ఇస్రో కోసం దేశం నలువైపుల నుంచి వచ్చే శాస్త్రవేత్తలు పనిచేస్తారు. భాష, భావం, భావజాలం వేరైనా అందరి గుండె భారతదేశం అని కొట్టుకుంటుంది. అదే మనందరినీ కలిపి ఉంచుతుంది.

ఇస్రోతో ఎంఓయూ కుదుర్చుకుంటాం
ఆంధ్రప్రదేశ్ యువతలో అపరిమితమైన జిజ్ఞాస ఉంది. దీన్ని సరైన రీతిలో ముందుకు తీసుకెళ్లే దారి లేక యువత ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారు. ఇస్రోతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయంలో విజ్ఞాన విషయాలను పంచుకునేందుకు, విలువైన సూచనలు యువతకు అందించే నిమిత్తం ఓ ఎంఓయూ చేసుకోవాలని భావిస్తున్నాను. దీనిపై నేను క్యాబినెట్ లో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాను. భావితరాలకు అంతరిక్ష పరిశోధనలపై ఆసక్తి ఏర్పడాలి. యువతకు అంతరిక్ష పరిశోధనలపై ఉన్న ఆకాంక్షకు తగిన ఉపాధి మార్గం లేదా పరిశోధనల మార్గం చూపేలా ఇస్రో అధికారులు తగిన గైడెన్స్ ఇచ్చేలా మాట్లాడుతాం. గ్రామీణ, అర్భన్ ప్రాంతాల్లో ఉండే విద్యార్థులను అంతరిక్ష పరిశోధనలపై ఆసక్తిని పెంచేలా ముందుకు వెళ్లాలి. దీనికి ప్రత్యేకంగా ఓ ఎంఓయూ చేసుకొని సంయుక్తంగా ముందుకు వెళ్లేలా ప్రయత్నాలు చేస్తాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విద్యార్థి, యువతలో అంతరిక్ష పరిశోధనలపై ఆసక్తిని పెంపొందించేలా చూడటమే ప్రధాన లక్ష్యం. శాస్త్రవేత్తలే ఈ దేశపు బలం. జాతి సంపద. వారు ఈ దేశానికి మరింత పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాను. భావి భారతం మరిన్ని ప్రయోగాలకు వేదిక కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
ఈ కార్యక్రమంలో సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధన కేంద్రం (షార్) డైరెక్టర్ ఎ.రాజరాజన్, షార్ అసోయేట్ డైరక్టర్ సయ్యద్ సమీద్, షార్ కంట్రోలర్ ఎం.శ్రీనివాసరెడ్డి, జనరల్ మేనేజర్ శంభు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

చంద్రయాన్ – 3 రాకెట్ ప్రయోగ నమూనా బహూకరణ
జాతీయ అంతరిక్ష దినోత్సవ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని సత్కరించి… అనంతరం షార్ డైరెక్టర్ రాజరాజన్ చేతుల మీదుగా చంద్రయాన్–3 రాకెట్ ప్రయోగ నమూనాను బహూకరించారు. అనంతరం పవన్ కళ్యాణ్ అంతరిక్ష దినోత్సవ కార్యక్రమాల పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు, ప్రశంసపత్రాలు అందజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నారావారిపల్లె గ్రామపంచాయతీ అభివృద్ధికి దిశా నిర్దేశం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : చంద్రగిరి మండలం నారావారిపల్లి గ్రామపంచాయతీ స్వర్ణ నారావారిపల్లె విజన్ లో భాగంగా ఆదర్శవంతంగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *