-రేణిగుంట బీసీ వసతి గృహం ఘటనపై
-రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత ఆదేశం
-ఆసుపత్రి నుంచి విద్యార్థులు డిశ్చార్జి…తరగతులకు హాజరు
-భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరిగితే సహించేది లేదు : మంత్రి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రేణిగుంట బీసీ వసతి గృహంలో అస్వస్థతకు గురైన 21 మంది ఆరోగ్య పరిస్థితి పూర్తిగా మెరుగుపడిందని, రుయా ఆసుపత్రి వైద్యులు డిశ్చార్జి చేశారని రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. ఆరోగ్యం మెరుగుపడడంతో, విద్యార్థులు పాఠశాలకు వెళ్లినట్లు తెలిపారు. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహించిన బీసీ వసతి గృహ అధికారులపై చర్యలు తీసుకోవాలని తిరుపతి జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం మంత్రి సవిత ఒక ప్రకటన విడుదల చేశారు. విషయం తెలిసినప్పటి నుంచి ప్రతి క్షణం తిరుపతి డీఎం అండ్ హెచ్ వోతో, రుయా ఆసుపత్రి వైద్యులతో మాట్లాడుతూ, విద్యార్థులకు మెరుగైన వైద్యమందేలా కృషి చేశామన్నారు. అదే సమయంలో బీసీ వెల్ఫేర్ డీడీని ఆసుపత్రికి పంపి, విద్యార్థులకు వైద్య సదుపాయాలు అందించేలా చేశామన్నారు. ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడడంతో, ప్రస్తుతం విద్యార్థులు పాఠశాలకు కూడా వెళ్లినట్లు మంత్రి తెలిపారు. బయట ఆహారం తినడం వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారన్నారు. విద్యార్థులకు వాంతులు విరేచనాలు జరిగినా పైఅధికారులకు తెలియజేయకపోవడంపై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తమ పిల్లలకు ఇలాగే జరిగితే వదలేస్తారా..? అని వసతి గృహ సిబ్బందిపై మండిపడ్డారు. ఇది క్షమించరాని నేరమని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకూడదని, హాస్టళ్లలో అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని హాస్టళ్ల సిబ్బందికి, అధికారులకు మంత్రి స్పష్టంచేశారు. మరోసారి ఇటువంటి ఘటన రాష్ట్రంలో ఎక్కడైనా చోటుచేసుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని బీసీ హాస్టళ్ల సిబ్బందిని, అధికారులను మంత్రి సవిత హెచ్చరించారు.
ఇద్దరు అధికారులకు షోకాజ్ నోటీసులు
తిరుపతి రేణిగుంట బీసీ వసతి గృహం విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనలో మంత్రి సవిత ఆదేశాల మేరకు ఇద్దరు అధికారులకు బీసీ వెల్ఫర్ అధికారులు మంగళవారం షోకాజ్ నోటీసులు జారీచేశారు. ఇన్చార్జి బీసీ వెల్ఫేర్ అధికారి చంద్రశేఖర్ కు, ఏబీసీడబ్ల్యూఓ డి.జ్యోత్స్నకు బీసీ వెల్ఫేర్ డైరెక్టర్ మల్లికార్జున ఈ నోటీసులు జారీ చేశారు. నోటీసులందుకున్న మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో స్పష్టంచేశారు.