-డొక్కా మాణిక్య వరప్రసాద్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
భారతదేశంలో కుల, మత, వర్గ ప్రాంతాలకతీతంగా ప్రజా సమూహలన్నిటిని భాగస్వామ్యులు ను చేసి నిర్మాణాత్మక కృషి చేస్తే నే సమ్మిళత భారత్ వికసిస్తుందని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ పేర్కొన్నారు. ఈనెల 14వ తేదీ గుంటూరులోని జన చైతన్య వేదిక హాలులో స్వతంత్ర భారత్ ప్రగతి – అవరోధాలు అనే అంశంపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అధ్యక్షత వహించారు. ప్రధాన వక్తగా విచ్చేసిన డొక్కా మాణిక్య వరప్రసాద్ ప్రసంగిస్తూ స్వాతంత్ర ఉద్యమంలో మహత్మా గాంధీజీ నిర్దిష్ట కార్యా చరణతో సామాజిక సమూహలన్నింటిని ఐక్యపరిచి భారత జాతి నిర్మాణానికి కృషి చేస్తూ స్వాతంత్రాన్ని సాధించగలిగేనన్నారు. పండిట్ జవహల్ లాల్ నెహ్రూ మొదటి ప్రధానిగా మిశ్రమ ఆర్థిక వ్యవస్థను రూపొందించి, ప్రభుత్వ సంస్థల బలోపేతానికి కృషిచేసి, ఆర్థిక పునాదులు వేసారన్నారు. డా!! బి. ఆర్. అంబేద్కర్ భారత జాతి ఆత్మగా రాజ్యాంగాన్ని రూపొందించి దేశ సమగ్రతను, సాధికారతను సాధించారన్నారు. దేశ పురోగమనానికి హేతుబద్ధ ఆలోచనలు, బావ ప్రకటన స్వేచ్ఛ అవసరమన్నారు. వ్యవసాయ రంగ అభివృద్ధి పునాదుల పైనే దేశ ప్రగతి, పారిశ్రామిక ప్రగతి ఉంటుందన్నారు. సభకు అధ్యక్షత వహించిన జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ స్వతంత్ర అనంతరం భారత్ అనేక రంగాలలో అభివృద్ధి చెందినా ప్రపంచంలో ప్రతి ముగ్గురి నిరక్షరాస్యులలో, పేదలలో, నిరుద్యోగులలో ఒకరు భారతీయుడుగా ఉండటం దురదృష్టకరమన్నారు.
ప్రపంచ ఆకలి సూచికలో 94వ స్థానంలో, ఆరోగ్య వ్యయంలో 141 వ స్థానంలో, పత్రికా స్వేచ్ఛ లో 159 వ స్థానంలో, తలసరి ఆదాయంలో 125వ స్థానంలో, అవినీతిలో 93వ స్థానంలో, ప్రజాస్వామ్య స్వేచ్ఛలో 125వ స్థానంలో ఇండియా ఉందన్నారు. 1990లో చైనా, ఇండియా ఒకే విధంగా ఉన్నా నేడు చైనా 18 ట్రిలియన్ డాలర్ల స్థూల జాతీయ ఉత్పత్తికి చేరితే ఇండియా 4 ట్రిలియన్ డాలర్ల కే పరిమితమైందన్నారు. అభ్యుదయ రచయితల సంఘం జాతీయ అధ్యక్షులు పెనుగొండ లక్ష్మీనారాయణ ప్రసంగిస్తూ ఆధునిక కాలంలో అభివృద్ధి చెందిన దేశాలన్నీ శాస్త్రీయ దృక్పథంతో ముందుకు పయనిస్తుంటే మన పాలకులు మద్య యుగాల ఆలోచనలతో సమాజాన్ని తిరోగమన దిశగా పయనింప చేస్తున్నారన్నారు. ప్రముఖ విద్యావేత్త కన్నా మాస్టర్ ప్రసంగిస్తూ విద్య పై స్థూల జాతీయ ఉత్పత్తిలో ఆరు శాతం ఉండాలని ఐక్యరాజ్యసమితి పేర్కొన్నా మన పాలకులు మూడు శాతం లోపే కేటాయించడం వలన విద్య రంగం అట్టడుగున ఉందన్నారు. విద్య శాస్త్రీయ పరిశోధనలను పెంపొందించేదిగా ఉంటేనే విప్లవాత్మక మార్పులు సాధ్యమౌతాయన్నారు. ప్రముఖ ఆర్థికవేత్త హిందూ కళాశాల పూర్వ ప్రిన్సిపాల్ డా!అబ్బరాజు రాజశేఖర్ ప్రసంగిస్తూ ఇండియాలో 1951 నుండి పంచవర్ష ప్రణాళికలను అమలు చేస్తూ వ్యవసాయం, పరిశ్రమలు, సేవల రంగాలలో అభివృద్ధిని సాధించిందన్నారు. ప్రముఖ న్యాయవాది నర్రా శ్రీనివాసరావు ప్రసంగిస్తూ న్యాయస్థానాలలో 30 శాతం జడ్జీల పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. సుప్రీం, హైకోర్టులలో న్యాయమూర్తులు కు పదవీ విరమణ తర్వాత రాజకీయ పోస్టులు ఇవ్వడం దురదృష్టకరమన్నారు. ఈ కార్యక్రమంలో జనచైతన్య వేదిక రాష్ట్ర కార్యదర్శి పి. శేషుబాబు, దళిత బహుజన ఫ్రంట్ వ్యవస్థాపకులు కొరివి వినయ కుమార్, మాజీ యం. యల్. ఎ. లింగం శెట్టి ఈశ్వరరావు, జాతీయ పంచాయతీ పరిషత్ ఉపాధ్యక్షులు డా!! జాస్తి వీరాంజనేయులు, మానవత నేతలు సాయిరాం, శివాజీ, సాంబశివరావు, తదితరులు ప్రసంగించారు.