-జాతీయ జెండా ప్రతిష్టను మరింత ఇనుమడింప చేద్దాం…
-ప్రతీ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి గౌరవాన్ని చాటుదాం.
-జిల్లా కలెక్టర్ జి. సృజన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎందరో మహానుభావులు స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాల స్పూర్తితో దేశ సమైక్యత, సమగ్రతలను కాపాడవలసిన బాధ్యత యువతపై ఉందని ప్రతి ఇంటిపైన జెండాను ఎగురవేసి దేశ భక్తిని చాటడంతో పాటు జాతీయ జెండా ప్రతిష్టను మరింత ఇనుమడింప చేద్దామని జిల్లా కలెక్టర్ డా.జి. సృజన కోరారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా మాచవరం ఎస్ఆర్ఆర్ & సివిఆర్ ప్రభుత్వ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సృజన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎందరో మహనుబావుల త్యాగఫలం నేటి మన స్వేచ్ఛకు మూలధనం అన్నారు. అమరవీరుల త్యాగాలతో సిద్దించిన స్వాతంత్య్రం ద్వారా ఈనాడు మనమందరం స్వేచ్ఛ జీవనాన్ని గడపగలుగుతున్నామన్నారు. అటువంటి త్యాగమూర్తులను స్మరించుకుంటూ దేశ సమగ్రత సమైఖ్యతకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాల్సిన అవసరం ఉందన్నారు. సుదీర్ఘ పోరాటాల వలన సాధించుకున్న స్వరాజ్యాన్ని సురాజ్యంగా మార్చుకోవడంలో ప్రతి ఒక్కరూ చైతన్యం కావాలన్నారు. మహత్మాగాంధీ, జవహర్ లాల్ నెహ్రు, సర్ధార్ వల్లబాయిపటేల్, భగత్ సింగ్, లాల్ బహుదూర్ శాస్త్రీ, ఝాన్సీలక్ష్మిబాయి, సరోజని నాయుడు, అల్లూరి సీతారామరాజు, పింగళివెంకయ్య, పొట్టి శ్రీరాములు వంటి అనేక మంది స్వాతంత్య్ర సమరయోధులు భరత మాత పై చూపిన ప్రేమ భక్తి భావాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య కీర్తిని నలుదిశల చాటిచెప్పేలా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహించాలన్నా దేశ ప్రధాని సూచనల మేరకు జిల్లా వ్యాప్తంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసేలా ప్రజలను చైతన్యవంతులను చేసి ప్రజలలో దేశభక్తి భావాన్ని నింపేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. దేశ భవిష్యత్తు యువత చేతిలో ఉందని యువత క్రమ శిక్షణతో బాధ్యతాయుతమైన అడుగులు వేసి ఉన్నత శిఖరాలను చేరుకున్నప్పుడు దేశ భవిష్యత్తు మరింత పటిష్టంగా ఉంటుందన్నారు. దేశ సమైక్యత, సమగ్రత, కాపాడటం వ్యక్తిగత బాధ్యతని ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ పూనాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ సృజన జాతీయ జెండాను చేత బూని విద్యార్థిని విద్యార్థులతో కలిసి హర్ ఘర్ తిరంగా ర్యాలీలో పాల్గొన్నారు. ప్రజా గాయకుడు పిచ్చయ్య ఆలపించిన దేశ భక్తి గేయాలు విద్యార్ధిని విద్యార్దులను ఆకట్టుకొని ఆలోచింపజేశాయి.
కార్యక్రమంలో సబ్ కలెక్టర్ బీహెచ్. భవాని శంకర్, డిఆర్వో వి. శ్రీనివాసరావు, తహసీల్దార్లు ఆర్.వివి రోహిణి దేవి, సిహెచ్. శిరీష, సూర్యారావు, ఇంతియాజ్ పాషా, ఎస్ఆర్ఆర్ కళాశాల ప్రిన్సిపాల్ కె. భాగ్యలక్ష్మి, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఓఎస్డి డా. వెలగా జోషి, నెహ్రు యువక కేంద్ర కో- ఆర్డినేటర్ ఎస్. రామ్, ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ జిల్లా కో`ఆర్డినేటర్ అరవ రమేష్ పాల్గొన్నారు.