– ప్రజాప్రభుత్వం హయాంలో క్యాంటీన్ల పునరుద్ధరణ ఎంతో సంతోషాన్నిస్తోంది.
– విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)
– పేదలకు పట్టెడన్నం పెట్టే బృహత్తర కార్యక్రమమిది
– శాసనసభ్యులు గద్దె రామమోహన్, బొండా ఉమామహేశ్వరరావు, యలమంచిలి సుజనా చౌదరి
– పండగ వాతావరణంలో వేడుకగా అన్నా క్యాంటీన్ల ప్రారంభం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభించడంతో పేదల కళ్లల్లో ఆనందం కనిపిస్తోందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గురువారం గౌరవ ముఖ్యమంత్రి గుడివాడలో అన్నా క్యాంటీన్‌ను ప్రారంభించగా.. శుక్రవారం జిల్లాలో అన్నా క్యాంటీన్ల ప్రారంభోత్సవ కార్యక్రమం పండగ వాతావరణంలో జరిగింది. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో పటమట కోనేరు బసవయ్య చౌదరి జెడ్‌పీహెచ్ఎస్, బుడమేరు జంక్షన్, గాంధీనగర్, వన్ టౌన్ గాంధీ పార్కు వద్ద అన్నా క్యాంటీన్లను ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, జిల్లా కలెక్టర్ డా. జి.సృజన, శాసనసభ్యులు గద్దె రామమోహన్, బొండా ఉమామహేశ్వరరావు, సుజానా చౌదరి, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్.ఎం.ధ్యానచంద్ర, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రూ. 5కే అల్పాహారాన్ని అందించే కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. టోకెన్ కౌంటర్, డైనింగ్ ఏరియా తదితరాలను ప్రారంభించి లబ్ధిదారులకు స్వయంగా వడ్డించారు. స్వచ్ఛమైన తాగునీరు అందించే ఏర్పాట్లు, చేతులు శుభ్రం చేసుకునేందుకు చేసిన ఏర్పాట్లు, మరుగుదొడ్లు తదితరాలను కూడా పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి గురువారం గుడివాడలో అన్నా క్యాంటీన్‌ను ప్రారంభించారని.. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా మరో 99 క్యాంటీన్లను ప్రారంభించడం జరుగుతోందన్నారు. ఎన్‌డీయే ప్రభుత్వం పేదల క్షేమం, సంక్షేమానికి కృషిచేస్తోందని.. కేవలం 60 రోజుల్లోనే అన్నా క్యాంటీన్లను ప్రారంభించడం జరిగిందన్నారు. 2014-19లో అన్నా క్యాంటీన్లను విజయవంతంగా నిర్వహించడం జరిగిందని.. ఆ తర్వాత ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ సొంత డబ్బుతో క్యాంటీన్లను నిర్వహించినట్లు ఎంపీ శివనాథ్ తెలిపారు.
ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు: కలెక్టర్ డా. జి.సృజన
కలెక్టర్ డా. జి.సృజన మాట్లాడుతూ ఎన్‌టీఆర్ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం 14 అన్నా క్యాంటీన్లను ప్రారంభించడం జరుగుతోందని.. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో 11 క్యాంటీన్లు ప్రారంభమైనట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం అన్నా క్యాంటీన్లలో ఉదయం టిఫిన్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ అందించేందుకు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ఆర్‌వో ప్లాంట్లను ఏర్పాటుచేశామన్నారు. చేతులు శుభ్రం చేసుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని.. మరుగుదొడ్లను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్నా క్యాంటీన్ల నిర్వహణకు చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ సృజన వెల్లడించారు.
ఆహ్లాదకర, పరిశుభ్రమైన వాతావరణంలో..: శాసనసభ్యులు గద్దె రామమోహన్
విజయవాడ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామమోహన్ మాట్లాడుతూ పేదల కడుపు నింపే కార్యక్రమం అన్నా క్యాంటీన్లు అని పేర్కొన్నారు. పేదల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో, నిబద్ధతతో కార్యక్రమాన్ని పునరుద్ధరించినట్లు తెలిపారు. పూటకు రూ. 5 అంటే.. నెలకు రూ. 450తోనే పేదల ఆకలిని తీర్చే బృహత్తర కార్యక్రమమని.. మంచి ఆహ్లాదకర, పరిశుభ్రమైన వాతావరణంలో పేదలు భోజనం చేసేందుకు ప్రభుత్వం ఆవకాశం కల్పించిందన్నారు. గౌరవ ముఖ్యమంత్రిగారు ఇచ్చిన మాట ప్రకారం శరవేగంగా అన్నా క్యాంటీన్లను ప్రారంభించారని.. ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు శాసనసభ్యులు రామమోహన్ పేర్కొన్నారు. ఈ రోజు ఇద్దరు చిన్నారులు తమ పుట్టిన రోజును పురస్కరించుకొని రూ. 50 వేలు చొప్పున చెక్‌ల ద్వారా అన్నా క్యాంటీన్లకు విరాళాలు అందించారని.. ఇలాగే ఎంతోమంది దాతలు ముందుకొస్తున్నారని తెలిపారు.
కలకాలం కొనసాగాలి: శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ కేవలం రూ. 5కే కడుపునిండా భోజనం పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించిందని పేర్కొన్నారు. ప్రజల భాగస్వామ్యంతో కలకాలం ఈ కార్యక్రమం కొనసాగాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నట్లు తెలిపారు. ఓ స్ఫూర్తిగా ప్రజలు ఈ మంచి కార్యక్రమంలో భాగస్వాములు కావాలన్నారు. ఆకలితో ఉన్నవారికి పట్టెడన్నం పెట్టడం ద్వారా ఎంతో సంతృప్తి సొంతమవుతుందని శాసనసభ్యులు ఉమామహేశ్వరావు పేర్కొన్నారు.
బృహత్తర కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలి: శాసనసభ్యులు సుజనా చౌదరి
విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సుజనా చౌదరి మాట్లాడుతూ పేదల ఆకలిని తీర్చే అన్నా క్యాంటీన్ల నిర్వహణ బృహత్తర కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పండగ వాతావరణంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్ల ప్రారంభోత్సవం జరగడం చాలా ఆనందాన్నిస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి చాలా మంది విరాళాలు అందించేందుకు ముందుకొస్తున్నారని.. ఇది ఓ గొప్ప స్ఫూర్తికి తార్కాణమని శాసనసభ్యులు సుజనా చౌదరి పేర్కొన్నారు.
అవసరమైన మౌలిక వసతుల కల్పన: వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్.ఎం.ధ్యానచంద్ర మాట్లాడుతూ విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో శుక్రారం 11 అన్నా క్యాంటీన్లను ప్రారంభించడం జరిగిందని.. ప్రతి క్యాంటీన్‌లోనూ అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించినట్లు తెలిపారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్యాంటీన్ల నిర్వహణకు ప్రత్యేకంగా ఇన్‌ఛార్జ్‌లను నియమించినట్లు వెల్లడించారు.
కార్యక్రమంలో విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్లు డా. ఎ.మహేష్, కేవీ సత్యవతి, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు హాజరయ్యారు.