-జాతీయ ఎస్.టి కమిషన్ మెంబర్ జాతోతు హుస్సేన్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలోని గిరిజనుల, సంచారజాతుల అభివృద్దికి ప్రతి ఒక్క అధికారి కృషి చేయాలని నేషనల్ ఎస్.టి కమిషన్ మెంబర్ జాతోతు హుస్సేన్ పేర్కొన్నారు. శనివారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో నేషనల్ ఎస్.టి కమిషన్ మెంబర్ గారు జాయింట్ కలెక్టర్ శుభం భన్సల్, తిరుపతి నగరపాలక కమిషనర్ మౌర్య, డి.ఆర్.ఓ పెంచల కిషోర్, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి సూర్యనారాయణ లతో కలిసి జిల్లా అధికారులతో సమీక్షిస్తూ గిరిజనుల అభ్యున్నతి కొరకు జిల్లాలో అమలు చేస్తున్న కార్యక్రమాలు, జిల్లాలో గిరిజనులు ఎదుకొంటున్న రెవెన్యూ, అట్రాసిటీ తదితర సమస్యలపై సమీక్షా సమావేశం నిర్వహించి అధికారులకు సూచనలిచ్చారు. అంతకు మునుపు జిల్లా కలెక్టరేట్ కు చేరుకున్న జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుల వారికి జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ సాదర స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా నేషనల్ ఎస్.టి కమిషన్ మెంబర్ మాట్లాడుతూ గిరిజనుల అభ్యున్నతి, వారి ఎదుగుదలకు జాతీయ ఎస్.టి కమిషన్ కృషి చేస్తోందని అన్నారు. దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎస్.సి, ఎస్టీ ల అభివృద్దికి ప్రాధాన్యం ఇస్తూ పలు పదవులను ఎస్.సి, ఎస్టీ లకు అప్పగించారని తెలిపారు. అందులో భాగంగానే ఎస్.టి అయిన తనకు జాతీయ ఎస్.టి కమిషన్ మెంబర్ గా భాద్యతలు అప్పగించారని అన్నారు. ఎస్.టి కమిషన్ అనేది గిరిజనుల అభివృద్ధి, మరియు వారి సంక్షేమానికి, వారు నిత్యం ఎదుర్కొంటున్న అనేక సమస్యలను గూర్చి పరిష్కారం చూపే విధంగా కమిషన్ ఎల్లప్పుడూ పని చేస్తుందని అన్నారు. ఎస్.సి, ఎస్.టి లు ప్రతి ఒక్కరు చదువుకునేల వారిని ప్రోత్సహించి జిల్లాల్లో గిరిజన ప్రా౦తాలలో ఎవరైనా చదువుకోని వారు ఉంటే అట్టి వారిని గుర్తించి వారిని చదువుకునేల ప్రోత్సహించే విధంగా గిరిజన ప్రాతాలలో క్యాంపెయిన్ చేపట్టాలని గిరిజన సంక్షేమ అధికారికి సూచించారు. అలాగే గిరిజన, ఏకలవ్య హాస్టళ్ళలో విద్యార్థులకు రక్షిత త్రాగునీరు, పారిశుద్యం, పరిశుభ్రమైన ఆహారం మెనూ ప్రకారం అందించాలని అన్నారు. మరమ్మతులకు గురైన స్కూళ్ళను, హాస్టళ్ళను బాగుచేయించాలని సూచించారు. గిరిజనుల సమస్యలు గ్రామ, మండల స్థాయి దాటి తమవరకు రావడం లేదని, గ్రామ, మండల స్థాయిలో పరిష్కారం కాకపోతే తమ దృష్టికి తీసుకురావాలని కార్యక్రమానికి విచ్చేసిన గిరిజనులకు సూచించారు. జిల్లాలో గిరిజనులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో భూ సమస్యలు చాలా వరకు పెండింగ్ లో ఉన్నట్లు తమ దృష్టికి వచ్చాయని అట్టి వాటిని త్వరిత గతిన పరిష్కరించి వారికి నివేదిక పంపాలని సంబందిత అధికారులకు సూచించారు. అలాగే జిల్లాలోని పెండింగ్ లో ఉన్న అట్ట్రాసిటీ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని అన్నారు. జిల్లాలోని గిజనులకు సంబందించిన మఠం భూములకు రక్షణ కల్పించాలని అధికారులకు సూచించారు. తిరుపతి లో గిరిజన భవన్ ని అధికారులు అన్ని సదుపాయాలతో, అన్ని హంగులతో తీర్చి దిద్ధి గిరిజన సంఘాలకు అప్పగించాలన్నారు. జిల్లా అధికారులందరూ గిరిజన సంక్షేమానికి పాటుపడాలని అన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన గిరిజనులు వారి సమస్యలను నేషనల్ కమిషన్ మెంబర్ కి విన్నవించుకోగా వారి సమస్యలను సంబందిత అధికారులు పరిశీలించి వారికి తగిన పరిష్కారం చూపాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘ నేతలు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.