Breaking News

కార్యాలయ దస్త్రాల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టండి…

-దస్త్రాలు ధగ్ధం, మాయం చేస్తే క్రిమినల్ కేసులు నమోదు…
-ఉద్యోగుల బదిలీలలో ప్రభుత్వ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించండి…
-గ్రీవెన్స్ రీ ఓపెన్ కు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకోండి..
-జిల్లా కలెక్టర్ డా. జి. సృజన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ కార్యాలయాలలో దస్త్రాల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని దస్త్రాలను ధగ్ధం చేసిన పాడుచేసిన సంబంధిత అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ఉద్యోగుల బదిలీలలో ప్రభుత్వ నిబంధలనలు ఖచ్చితంగా పాటించాలని గ్రీవెన్స్ రీ ఓపెన్ కు ఆస్కారం లేకుండా అర్జీలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డా. జి. సృజన అధికారులను ఆదేశించారు.

ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజిఆర్ఎస్) కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా కలెక్టర్ డా. జి. సృజన కలెక్టరేట్ లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్బంగా జిల్లా అధికారులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ ఇటీవల మదనపల్లి, తిరుపతి, పోలవరం తదితర ప్రభుత్వ కార్యాలయాలలో దస్త్రాల ధగ్ధం సంఘటనలు దృష్టిలో పెట్టుకొని జిల్లా అధికారులు మరింత అప్రమత్తతో కార్యాలయ పర్యవేక్షణ చేయాలన్నారు. కార్యాలయానికి సంబంధించిన దస్త్రాలు ధగ్ధం చేయడం చించడం, కనుమరుగు చేయడం వంటి సంఘటనలు జరిగినట్లు తన దృష్టికి వస్తే సంబంధిత శాఖల అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు శాఖ పరమైన కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ప్రతి కార్యాలయంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి రాత్రి గస్తీకి వాచ్ మెన్ ను నియమించుకోవాలన్నారు. కార్యాలయాలలో ఫైర్ సేఫ్టీ, విద్యుత్ సరఫరా పరికరాలపై ఆడిటింగ్ నిర్వహించి సంబంధిత అధికారుల నుండి ధ్రువీకరణ పత్రం పొందాలన్నారు.

ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి గడువు ముగిసేవరకు నిరీక్షించకుండ సంబంధిత ప్రతిపాదనలు ఉన్నతాధికారులకు సమర్పించి ఆమోదం పొందాలని బదిలీలకు జారీ చేసిన ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలన్నారు.

ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలకు సంబంధించి స్వీకరించిన 24 గంటలలోపు లాగిన్ లో ఓపెన్ చేసి సంబంధిత క్షేత్రస్థాయి సిబ్బంది నుండి అర్జీలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అర్జీలకు శాశ్వత పరిష్కారం చూపడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని రీఓపెన్ కు ఆస్కారం లేకుండా చిత్తశుద్ధితో సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ విభాగాలలో న్యాయస్థానాల కేసులకు సంబంధించి కౌంటర్ దాఖలు చేసేందుకు అవసరమైన పూర్తి సమాచారంతో ముందస్తుగా దస్త్రాలను సమర్పించాలన్నారు. కార్యాలయాలలో కోర్ట్ కేసులకు సంబంధించి ప్రత్యేక రిజిస్టర్ లో నమోదు చేసుకొని చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా దాఖలు చేసేందుకు వీలుగా సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. త్వరలో జిల్లాలో నిర్వహించనున్న రెవెన్యూ సదస్సుల నిర్వహణకు సంబంధించి ముందస్తు ప్రణాళికలను రూపొందించుకోవాలన్నారు. సదస్సులో నమోదయ్యే ప్రతి అర్జీని రిజిస్టర్ చేసి అప్లోడ్ చేయవలసి ఉంటుందన్నారు. సదస్సులపై క్షేత్రస్థాయి సిబ్బందికి పూర్తి అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డా.జి. సృజన సూచించారు.

ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్య‌క్ర‌మం ద్వారా 99 అర్జీలను స్వీకరించగా 39 అర్జీలు స్వయంగాను, 60 అర్జీలు ఆన్లైన్ ద్వారా స్వీకరించడం జరిగింది. ఇందులో రెవిన్యూ – 42, పోలీస్ – 14, మునిసిపల్ కార్పొరేషన్ – 13, డీఆర్డీఏ -4, పంచాయితీరాజ్- 3, కోపరేటివ్ – 3, వైద్య ఆరోగ్య శాఖ – 2, సర్వే & సెటిల్మెంట్-2, మార్కెటింగ్ – 2 అర్జీలు, విద్యుత్ శాఖ, ఏపీఐఐసీ, ఏపీఎస్ఆర్టిసి, ఎన్టీఆర్ వైద్యసేవ, పౌర సరఫరాలు, విద్య, ఉన్నత విద్య, దేవాదాయ, అగ్నిమాపక, మత్స్య, మహిళా శిశు సంక్షేమం, గనులు, రోడ్డు భవనాలు, గ్రామీణ నీటి సరఫరా శాఖలకు చెందిన ఒక్కొక్క అర్జీని స్వీకరించడం జరిగింది.

ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార వేదిక కార్య‌క్ర‌మంలో జాయింట్ కలెక్టర్ నిధి మీనా, అసిస్టెంట్ కలెక్టర్ శుభం కుమార్, డిఆర్వో వి. శ్రీనివాసరావు, డిప్యూటీ కలెక్టర్ ఇ. కిరణ్మయి, డ్వామా పీడీ జె. సునీత, డీటీసీ ఎం. పురేంద్ర, హౌసింగ్ పీడీ రజిని కుమారి, ఐసీడీఎస్ పీడీ జి. ఉమాదేవి, డీఎస్ఓ మోహన్ బాబు, ఉద్యాన అధికారి బాలాజీ కుమార్, సీవిల్ సప్లైస్ డిఎం వెంకటేశ్వర్లు, డీఐపీఆర్వో యు. సురేంద్రనాధ్, ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ జిల్లా కో-ఆర్డినేటర్ డా.జె. సుమన్, డీఎం&హెచ్ఓ డా.ఎం. సుహాసిని, టీబి కంట్రోల్ అధికారిణి డా. ఉషారాణి, వివిధ శాఖలను చెందిన జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *