– ముఖ్యమంత్రి ఆదేశాలతో కేంద్ర ప్రభుత్వ సంస్థతో థర్డ్ పార్టీ విచారణ
– నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపర చర్యలు
– రాష్ట్ర గృహ నిర్మాణం, ఐ అండ్ పీఆర్ మంత్రి కొలుసు పార్థసారథి
ఆధునిక సాంకేతికతో ఇళ్ల నిర్మాణాల నాణ్యతా ప్రమాణాల తనిఖీ చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారని.. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ సంస్థతో థర్డ్ పార్టీ విచారణ జరుగుతోందని రాష్ట్ర గృహ నిర్మాణం, ఐ అండ్ పీఆర్ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్‌లో ఎన్‌టీఆర్ జిల్లా గృహ నిర్మాణ సమీక్షా సమావేశం అనంతరం మంత్రి కొలుసు పార్థసారథి మీడియాతో మాట్లాడారు. ఆప్షన్-3 కింద ఇళ్ల నిర్మాణాలు చేపట్టిన కొన్ని ఏజెన్సీలు బేస్‌మెంట్ వరకు పనిచేసి పేమెంట్స్ తీసుకున్నాయని.. ఆ తర్వాత పని ఎగ్గొట్టినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. అదే విధంగా మరికొన్ని ఏజెన్సీలు నాణ్యత లేకుండా నిర్మాణాలు చేసినట్లు తెలిసిందన్నారు. ఫిర్యాదులపై త్వరలోనే విచారణ నివేదిక రానుందని.. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపర చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు. మెటీరియల్ దుర్వినియోగం చేసినా, పరిమితికి మించి మెటీరియల్ తీసుకున్నా, ఉద్దేశపూర్వకంగా లబ్ధిదారులకు నష్టం చేకూర్చినట్లు తేలితే చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రంలో 100 రోజుల కార్యాచరణ కింద లక్షా 25 వేల ఇళ్ల నిర్మాణాల పూర్తికి, అదే విధంగా 7 లక్షల ఇళ్లను రాబోయే ఏడాది కాలంలో పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. పీఎంఏవై-1 .0.. వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తవుతున్న నేపథ్యంలో ఇళ్లు మంజూరైన లబ్ధిదారులను ప్రోత్సహించి ఆలోగా నిర్మాణాల పూర్తికి అనువైన వాతావరణాన్ని ఏర్పరుస్తున్నట్లు తెలిపారు. ఎందుకంటే గడువు ముగిస్తే భవిష్యత్తులో ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్థిక సహాయం చేజారుతుందన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు అదనపు సహాయం అందించే విషయమై గౌరవ ముఖ్యమంత్రితో చర్చించనున్నట్లు తెలిపారు. 500లోపు ఇళ్ల నిర్మాణాలు చేపట్టే మేస్త్రీల గ్రూపులకు ర్యాండమ్ తనిఖీలు చేసి చెల్లింపులు చేయనున్నట్లు వెల్లడించారు.
మైలవరం నియోజకవర్గంలో ఇళ్ల స్థలాల పరంగా చాలా ఇబ్బందులు ఉన్నాయని.. కొన్ని స్థలాలు నివాసయోగ్యంగా లేవని, అదే విధంగా అక్కడికి వెళ్లేందుకు లబ్ధిదారులు ఆసక్తి చూపడం లేదని, మరికొన్ని నిర్మాణాలకు అనువుగా లేవని శాసనసభ్యులు తమ దృష్టికి తీసుకొచ్చారని.. ఈ విషయాలను గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. ప్లింత్ పూర్తయ్యాక ఫిల్లింగ్ చేసేందుకు మట్టి కోసం ఇబ్బంది ఉన్నదృష్ట్యా ఫ్లైయాష్ ఫిల్లింగ్‌కు గృహ నిర్మాణ శాఖ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇది పటిష్టంగా కూడా ఉంటుందని వివరించారు. 2014-19 మధ్యకాలంలో పూర్తయిన ఇళ్లకు చెల్లింపుల విషయంలో ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయని.. ఈ సమస్యను పరిష్కరించి నిర్మాణం పూర్తయిన ఇళ్లకు చెల్లింపులు జరపాలని గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం చాలా ఆనందం కలిగిస్తోందని మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు.