– ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను ఆదరించాలి
– వారానికి ఒక్కరోజైనా ఈ వస్త్రాలను ధరించాలి
– రాష్ట్ర చేనేత, జౌళి; బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో చేనేతకు స్వర్ణయుగమొచ్చిందని..రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం నేతన్నల సంక్షేమానికి, చేనేత రంగ అభివృద్ధికి కృషిచేస్తోందని రాష్ట్ర చేనేత, జౌళి; బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత అన్నారు.
ఆగస్టు 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి చేతులమీదుగా నగరంలోని మేరీస్ స్టెల్లా కాలేజీ ఆడిటోరియంలో ప్రారంభమైన చేనేత వస్త్ర ప్రదర్శన (గాంధీ బునకర్ మేళా) ముగింపు వేడుకలు మంగళవారం జరిగాయి. వేడుకల్లో చిన్నారుల సంప్రదాయ నృత్య ప్రదర్శనలు, చేనేత వస్త్రాల ఫ్యాషన్ షో (సెలబ్రేట్ కలర్స్ ఆఫ్ హ్యాండలూమ్) ఆకట్టుకున్నాయి. పొందూరు, మంగళగిరి, ఉప్పాడ, వెంకటగిరి, చీరాల తదితర చేనేత వస్త్రాలు వీక్షకులను అలరించాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సవిత మాట్లాడుతూ రాష్ట్ర చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యంలో చేనేత వస్త్ర ప్రదర్శన అద్భుతంగా జరిగిందన్నారు. నేతన్నల కళ్లల్లో ఆనందం చూస్తే చాలా సంతోషంగా ఉందన్నారు. 14 రోజుల పాటు వస్త్ర ప్రదర్శన జరిగిందని.. మొత్తంమీద దాదాపు రెండు కోట్ల రూపాయల మేర టర్నోవరు జరిగిందని.. ఇందుకు కారణమైన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. పోగును వస్త్రంగా తయారుచేసి మనిషి మానాన్ని కాపాడుతున్న చేనేత కార్మికులకు ప్రతి ఒక్కరూ అండగా ఉండాల్సిన అవసరముందన్నారు. ఈ వస్త్ర ప్రదర్శన వల్ల ప్రజల్లో చేనేతపై మంచి అవగాహన వచ్చిందని.. ప్రతి ఒక్కరూ వారంలో ఒకసారైనా చేనేత వస్త్రాలను ధరించాలని సూచించారు. చేనేత వస్త్రాలను ధరించడం వల్ల ఆరోగ్యానికి మంచిది.. నేతన్నలకు మంచిదని పేర్కొన్నారు. ఇలాంటి వస్త్ర ప్రదర్శనలు మరిన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రం చంద్రబాబు నేతృత్వంలో అభివృద్ధి పథంలో నడుస్తోందన్నారు.
కార్యక్రమంలో చేనేత, జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి కె.సునీత, కమిషనర్ జి.రేఖారాణి, ఆప్కో ఎండీ ఆర్.పవనమూర్తి, చేనేత, జౌళి శాఖఅధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.