గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని చౌడవరం రాజీవ్ గృహకల్ప ప్రాంతంలో మౌలిక వసతులను కల్పించడానికి తగిన చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ గారు ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కమిషనర్ చౌడవరంలోని రాజీవ్ గృహకల్ప ప్రాంతంలో త్రాగునీటి సరఫరా, పారిశుధ్య పనులను పరిశీలించి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ గారు మాట్లాడుతూ చౌడవరం రాజీవ్ గృహకల్పలో నివశించే ప్రజలకు నగరపాలక సంస్థ నుండి మౌలిక వసతులు కల్పించాలన్నారు. గృహకల్ప బ్లాక్ ల పరిసరాల్లో పిచ్చి మొక్కలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, 2 రోజుల్లో చుట్టూ ఉన్న జంగిల్ క్లియర్ చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. డిడి గ్రౌండ్ వాటర్ వారితో సమన్వయం చేసుకొని, గృహకల్ప ప్రాంతంలో 2 ప్రాంతాల్లో బోర్లు వేయడానికి పాయింట్స్ గుర్తించి, అంచనాలు సిద్దం చేయాలన్నారు. అపార్ట్మెంట్ పైన ఉన్న నీటి ట్యాంక్ లు, వాటిలో ప్రస్తుతం వినియోగంలో ఉన్నవి, లేనివి, నూతనంగా అవసరమైన వాటి వివరాలతో గురువారానికి నివేదిక ఇవ్వాలని ఏఈని ఆదేశించారు. గృహకల్ప నివాసాలకు ఆస్తి పన్ను వేయడానికి చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారిని ఆదేశించారు. చెత్త సేకరణ, డ్రైన్ల శుభ్రం జరగాలని శానిటరీ ఇన్స్పెక్టర్ ని, కార్యదర్శిని ఆదేశించారు. అనంతరం చౌడవరం మెయిన్ రోడ్ లోని జాతీయ రహదారి పక్కన సర్వీస్ రోడ్ పై డ్రైన్ నీరు వస్తుందని, సదరు అధికారులతో సమన్వయం చేసుకొని సమస్య పరిష్కారనికి చర్యలు తీసుకోవాలని ఈఈ ని ఆదేశించారు.
పర్యటనలో ఈఈ కొండారెడ్డి, ఏఈ రవి కిరణ్, శానిటరీ ఇన్స్పెక్టర్ సుబ్బారావు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.
Tags guntur
Check Also
నారావారిపల్లె గ్రామపంచాయతీ అభివృద్ధికి దిశా నిర్దేశం
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : చంద్రగిరి మండలం నారావారిపల్లి గ్రామపంచాయతీ స్వర్ణ నారావారిపల్లె విజన్ లో భాగంగా ఆదర్శవంతంగా …