-అధికారులకు జిల్లా కలెక్టర్ డా. జి.సృజన ఆదేశాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా పరిధిలోని వివిధ ప్రాజెక్టులకు సంబంధించి భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. జి.సృజన ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో కలెక్టర్ సృజన.. జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనాతో కలిసి జాతీయ రహదారులు, రైల్వేలకు సంబంధించి వివిధ ప్రాజెక్టుల భూ సేకరణ ప్రక్రియపై సమావేశం నిర్వహించారు. ఎన్‌హెచ్-165 జీ- గ్రీన్ ఫీల్డ్ అలైన్‌మెంట్, ఎన్‌హెచ్ఏఐ-216హెచ్ (పెడన-విసన్నపేట), ఎన్‌హెచ్-16 (బెంజ్ సర్కిల్ సర్వీస్ రోడ్డు), ఎన్‌హెచ్-65 (నందిగామ-కంచికచర్ల బైపాస్), ఎన్‌హెచ్-221 (విజయవాడ-భద్రాచలం), ఎన్‌హెచ్-65 (విజయవాడ-హైదరాబాద్ సెక్షన్)లకు సంబంధించిన భూ సేకరణ ప్రక్రియపై చర్చించారు. భూ సేకరణ విస్తీర్ణం, అవార్డు పాస్ వివరాలతో పాటు ప్రస్తుతం ప్రక్రియ ఏ దశలో ఉందనే వివరాలను పరిశీలించారు. ప్రక్రియ ఎంతమేర పూర్తయింది? మిగిలిన ప్రక్రియను పూర్తిచేసేందుకు ఏవైనా సమస్యలున్నాయా? వాటిని పరిష్కరించేందుకు తీసుకోవాల్సిన చర్యలు తదితరాలపై ఆయా ప్రాంతాల ఆర్‌డీవోలు, తహసీల్దార్లతో చర్చించారు. నిర్దేశ గడువులోగా భూ సేకరణ ప్రక్రియను పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా రైల్వేలో బీజీ లైన్లు, ఆర్‌వోబీలు, డబ్లింగ్ పనులు తదితరాలకు సంబంధించి భూసేకరణకు ఇప్పటివరకు వచ్చిన అభ్యర్థనలు, రావాల్సిన వాటిపైనా సమావేశంలో చర్చించారు. అభ్యర్థనలను అనుసరించి సేకరణ ప్రక్రియను ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సృజన సంబంధిత అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఆర్‌డీవోలు బీహెచ్ భవానీ శంకర్, ఎ.రవీంద్రరావు, కలెక్టరేట్ ల్యాండ్ సెక్షన్ సూపరింటెండెంట్ సీహెచ్ దుర్గాప్రసాద్, ఎన్‌హెచ్ఏఐ, రైల్వే అధికారులు, సంబంధిత తహసీల్దార్లు తదితరులు హాజరయ్యారు.