-జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
నిరుపేద కుటుంబంలో పుట్టిన సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమర యోధుడు బ్రిటిష్ పాలకుల నిరంకుస ధోరణికి ఎదురొడ్డి మద్రాసులో సైమన్ కమిషన్ కి వ్యతిరేకంగా తన వాక్కు వినిపించి వెరవక ఛాతీ చూపిన థీరోదాత్తుడు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు అని, టంగుటూరి ప్రకాశం పంతులు ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి అని ఆదర్శప్రాయుడు అని, ఆయనను స్మరించుకోవడం మన బాధ్యత అని జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ అన్నారు.
శుక్రవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ సమావేశం మందిరంలో జిల్లా జాయింట్ కలెక్టర్, సంబంధిత అధికారులతో కలిసి టంగుటూరి ప్రకాశం పంతులు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ టంగుటూరి ప్రకాశం పంతులు 1872 ఆగష్టు 23 న జన్మించారని, తన పదకొండోయేట తండ్రి మరణించారని, చిన్న వయసులోనే ప్రకాశం నాటకాలు వేసి, చదువు కొనసాగించి న్యాయవాదిగా ఎదిగి, స్వాతంత్ర్య సమరంలో చురుగ్గా పాల్గొన్నారని అన్నారు. పొట్టి శ్రీరాములు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధనకై ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ మరణించటంతో ఉద్యమ ఫలితంగా 1953 అక్టోబర్ 1 న ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు తొలి ముఖ్యమంత్రిగా ప్రకాశం పంతులు నియమితులు అయ్యారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ మరియు సాధికార ఇన్చార్జి అధికారి చంద్ర శేఖర్ వివిధ శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.