-3 ఏళ్ల పదవీ కాలంలో పార్టీలు, వర్గాలకు అతీతంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేశా
-ప్రజల కష్టాలు తన కష్టాలుగా భావించి ఇకపై ప్రజల్లోనే, ప్రజల కోసం పనిచేస్తాను
-తనకు సహకరించిన అన్ని శాఖల అధికారులకు, ప్రజలకు, మీడియాకు ధన్యవాదాలు తెలిపిన రాష్ట్ర ఎస్సీ కమిషన్ ఛైర్మన్ మూరుమూడి విక్టర్ ప్రసాద్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మూడేళ్ల పదవీ కాలంలో షెడ్యూల్డ్ కులాల ప్రజలకు అండగా నిలవడం సంతృప్తినిచ్చిందని రాష్ట్ర ఎస్సీ కమిషన్ ఛైర్మన్ మూరుమూడి విక్టర్ ప్రసాద్ వెల్లడించారు. శుక్రవారం విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ లోని ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ 4వ అంతస్తులోని ఎస్సీ కమిషన్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాడ్లాడారు. 24 ఆగష్టు, 2021న ఎస్సీ కమిషన్ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి నేటి వరకు 3 ఏళ్ల పాటు షెడ్యూల్డ్ కులాల ప్రజల సంక్షేమం కోసం, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం అహర్నిశలు పాటుపడ్డానన్నారు. ఎస్సీ కమిషన్ ఛైర్మన్ హోదాలో ఎటువంటి ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా షెడ్యూల్డ్ కులాల ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేశానన్నారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉంటూ ఇచ్చిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించానన్నారు. ఎస్సీ కమిషన్ ఛైర్మన్ గా రాష్ట్రంలో శ్రీకాకుళం నుండి అనంతపురం దాకా 6 సార్లు పర్యటించి ప్రజల సమస్యలు పరిష్కరించానన్నారు. ప్రజల నుండి ప్రత్యక్షంగా ఫిర్యాదులతో పాటు, ఫోన్లు, వాట్సాప్, ఫేస్ బుక్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా కూడా స్వీకరించి ప్రజా సమస్యలను పరిష్కరించానన్నారు. పార్టీలు, వర్గాలకు అతీతంగా బాధితుల సమస్య పరిష్కారానికే ప్రాధాన్యతనిచ్చి బాధ్యతాయుతంగా పనిచేశానన్నారు. తన హయాంలో 90 శాతం వరకు ప్రజలకు న్యాయం చేయగలిగానన్నారు. తన హయాంలో ఎస్సీ కమిషన్ అంటే బాధితులకు అండగా ఉంటుందన్న భరోసానివ్వడం ఆనందంగా ఉందన్నారు. సమస్య ఏదైనా విజయవాడ ఎస్సీ కమిషన్ కార్యాలయంలో చెబితే పరిష్కరించబడుతుందన్న భరోసా బాధితులకు కలిగించడం సంతోషాన్నిచ్చిందన్నారు. రాష్ట్ర చరిత్రలో 200 హియరింగ్ లు జరిపిన ఎస్సీ కమిషన్ ఛైర్మన్ గా తాను గర్వపడుతున్నానన్నారు.
ఎస్సీ కమిషన్ ఛైర్మన్ గా ఇచ్చిన ఆదేశాలను సత్వరమే అమలు పరిచిన పోలీస్, రెవెన్యూ, పంచాయతీరాజ్ తదితర ప్రభుత్వ శాఖల అధికారులకు, సహకరించిన కలెక్టర్లు, ఎస్పీలకు, పాఠశాల, కాలేజీ యాజమాన్యాలకు, సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరున ధన్యవాదాలు తెలిపారు. తన గొంతుకను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజల్లో చైతన్యం తెచ్చిన మీడియాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తన పదవీ కాలం ముగుస్తున్న సందర్భంగా ప్రజల కష్టాలు తన కష్టాలుగా భావించి ఇకపై ప్రజల్లోనే, ప్రజల కోసమే పని చేస్తానని రాష్ట్ర ఎస్సీ కమిషన్ ఛైర్మన్ మూరుమూడి విక్టర్ ప్రసాద్ స్పష్టం చేశారు.