-సమగ్ర శిక్షా అడిషనల్ డైరెక్టర్ ఎ.సుబ్బారెడ్డి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఉర్దూ బోధనలో బోధనాభ్యసన సామగ్రి (టీఎల్ఎం) సద్వినియోగపరచుకోవాలని సమగ్ర శిక్షా అడిషనల్ డైరెక్టర్ ఎ.సుబ్బారెడ్డి తెలిపారు. రాష్ట్ర సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఈ నెల 19 నుండి ఆరు రోజుల పాటు విజయవాడ లోని ఆంధ్రా లయోలా కాలేజీ ప్రాంగణం ఎస్-జే ఎక్స్ లెన్స్ సెంటర్లో జరిగిన రాష్ట్ర స్థాయి ఉర్దూ ద్విభాషా బోధన అభ్యసన సామాగ్రి కార్యాశాల శనివారం రాత్రితో ముగిసింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన అడిషనల్ డైరెక్టర్ ఎ.సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. 1 నుండి పదో తరగతి వరకు ఉర్దూ బోధన అభ్యసన సామగ్రి తయారీలో 12 జిల్లాల నుండి ప్రాథమిక, ఉన్నత పాఠశాలలకు చెందిన దాదాపు 40 మంది ప్రతిభ, అనుభవం ఉన్న ఉర్దూ రిసోర్స్ పర్సన్స్ పాల్గొన్నాన్నారు. సుమారు 150 TLM అంశాలు, ఉర్దూ వ్యాకరణ పుస్తకం రూపొందించారని తెలిపారు. ఇవి రాష్ట్రంలోని 38,138 ఉర్దూ విద్యార్థులకు, ఉపాధ్యాయులకు డైట్, డిఎస్సీ అభ్యర్థులకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. అనంతరం సమగ్ర శిక్ష అసిస్టెంట్ డైరెక్టర్ ఎన్.కె.అన్నపూర్ణ మాట్లాడుతూ.. సెప్టెంబర్ నెలలో ఉర్దూ జిల్లా రిసోర్సు పర్సన్లు (డిఆర్పీలకు) శిక్షణ తరగతులు నిర్వహించనున్నమన్నారు. అనంతరం జిల్లా స్థాయిలో ఉర్దూ ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ వర్క్ షాపులో ఉర్దూ మాధ్యమం విద్యార్థుల అభిరుచులను దృష్టిలో ఉంచుకుని లోకాస్ట్, నోకాస్ట్ లో సామగ్రితో అందమైన, ఆకర్షణమైన, ఉపయోగపడేలా అన్ని పాఠ్యాంశాలకు సంబంధించి బోధన కృత్యాలు తయారు చేసారన్నారు. సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు IAS., పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యశాలను రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫారూఖ్, తెదేపా పోలిట్ బ్యూరో సభ్యులు టి.డి జనార్ధన్ సందర్శించడం అభినందనీయమన్నారు. ఈ కార్యశాలలో పెడగాజీ ఉర్దూ అధికారి అబ్దుల్ గని, సహాయకులు టి.మల్లికార్జున రావు, పి.గీత, తదితరులు పాల్గొన్నారు.