-డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యాతో ఏ ఒక్కరూ ప్రాణాల్ని కోల్పోకూడదు
-వైద్యారోగ్య, మునిసిపల్, పంచాయతీరాజ్ అధికారులు సమన్వయంతో పని చేయాలి
-సమర్ధవంతమైన పర్యవేక్షణా వ్యవస్థను ఏర్పాటు చేయాలి
-జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారులు కీలకపాత్ర పోషించాలి
-కలెక్టర్లు వారానికోసారి సమీక్షించాలి
-వైద్య ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశం
-సీజనల్ వ్యాధులపై లోతుగా సమీక్షించిన మంత్రి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
సీజనల్ వ్యాధులు, విష జ్వరాలు ప్రబలకుండా మరియు వ్యాధుల పటిష్ట నియంత్రణకు సంబంధిత శాఖలు
చేపట్టాల్సిన చర్యల్ని సూచించడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు. ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ సి.హరికిరణ్ ఛైర్మన్ గా వ్యవహరించే ఈ కమిటీలో పంచాయతీరాజ్ కమీషనర్, మునిసిపల్ శాఖ కమీషనర్, ఐటిడిఎ పాడేరు పీఓ, మైక్రోబయాలజిస్ట్, గ్యాస్ట్రోఎంటిరాలజిస్ట్, సోషల్ ప్రివెంటివ్ మెడిసిన్ ఎక్స్పెర్ట్, మరో ఇద్దరు వైద్య నిపుణులు సభ్యులుగా ఉంటారు. ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ డాక్టర్ పద్మావతి మెంబర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. వెలగపూడిలోని ఎపీ సచివాలయం ఐదో బ్లాక్ కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం నాడు సీజనల్ వ్యాధులపై మంత్రి సత్యకుమార్ యాదవ్ లోతుగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డెంగ్యూ, చికున్ గున్యా, మలేరియా తో రాష్ట్రంలో ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోకూడదన్నారు. జిల్లా కలెక్టర్లు వారానికోసారి జ్వరాలు, సీజనల్ వ్యాధులపై సమీక్షించాలన్నారు. మునిసిపల్, పంచాయతీరాజ్ అధికారులతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారులు సమన్వయం చేసుకోవాలన్నారు. కేసుల్ని గుర్తించడం, రిఫర్ చెయ్యడం, చికిత్స అందించడం, తరచూ విజిట్ చేయడం, అన్‌లైన్ రిపోర్టింగ్ చేయడం వంటి పనుల్ని నిపుణుల కమిటీ చేపడుతుందన్నారు. విష జ్వరాలు, సీజనల్ వ్యాధులపై సమర్ధవంతమైన పర్యవేక్షణా వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు. వ్యాధులు ప్రబలిన వెంటనే అప్రమత్తంగా ఉండాలన్నారు. సమర్ధవంతమైన పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు. వర్షాలు ప్రారంభమైన నాటి నుండి సీజనల్ వ్యాధులు ప్రబలే రెండు మూడు నెలల పాటు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇటీవల తాను పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటించినప్పుడు వార్డుల్లో జ్వర పీడితులుండడం గమనించాన్నారు. విజ జ్వరాల్ని కట్టడి చేయాలన్నారు. కేసులు వచ్చిన వెంటనే జిల్లా కలెక్టర్ల దృష్టికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారులు తీసుకెళ్లాలన్నారు. గుర్తించలేని జ్వరాలొస్తున్నట్లు మీడియా ద్వారా తెలుస్తోందని, ఏం చేయగలిగితే వీటిని నియంత్రించగలమన్న దానిపై దృష్టి సారించాలన్నారు. అన్ని సబ్ సంటర్లు, పీహెస్సీలు, యూపీహెచ్సీల పరిధిలో ప్రబలిన జ్వరాల్ని ప్రతిరోజూ రిపోర్టు చెయ్యాలన్నారు. కింది స్థాయి సిబ్బంది కేసుల్ని గుర్తించిన వెంటనే పరీక్ష చేసి ల్యాబ్ లకు పంపించాలన్నారు. పారిశుధ్యం, ఇళ్లల్లో ఫాగింగ్ వంటి విషయాల్లో స్థానిక ప్రజాప్రతినిధుల సహాయాన్ని తీసుకుంటే ప్రయోజనం ఉంటుందన్నారు. ప్రస్తుత అనుభవాల్ని దృష్టిలో ఉంచుకుని వచ్చే ఏడాదికి మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలన్నారు. పలు మార్లు సమీక్షించినా పెద్దగా పురోగతి కనిపించలేదని మంత్రి ఈ సందర్భంగా అసంతృప్తిని వ్యక్తం చేశారు. వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సిఎస్ ఎం.టి.కృష్ణబాబు, సెక్రటరీ డాక్టర్ మంజుల, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ సి.హరికిరణ్, ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ డాక్టర్ పద్మావతి, డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రాం అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ బి.సుబ్రహ్మణ్యేస్వరి సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.