-క్రీడా విభాగంలో జిల్లా కు గుర్తింపు తెచ్చిన క్రీడాకారులను గౌరవించుకుందాం.
-జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా పచ్చ జెండా ఊపి 3 కె రన్ ర్యాలినిప్రారంభించిన..
-జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
క్రీడలతో విద్యార్థుల్లో శారీరక దారుఢ్యం, మానసికస్థైర్యం పెరుగుతుందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి తెలిపారు. జాతీయ క్రీడా దినోత్సవం జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం స్థానిక వై జంక్షన్ నుండి ఇస్కాన్ టెంపుల్ వరకు 3 కె రన్ ర్యాలిని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా హాకీ క్రీడాకారుడు దివంగత మేజర్ ధ్యాన్ చంద్ చిత్రపటానికి కలెక్టర్ అధికారులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ ప్రతి ఏడాది ఆగస్టు 29వ తేదీన ప్రముఖ హాకీ క్రీడాకారుడు దివంగత మేజర్ ధ్యాన్ చంద్ బర్త్ డే సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామన్నారు. క్రీడా విభాగంలో జిల్లా కు గుర్తింపు తెచ్చిన క్రీడాకారులందరిని గౌరవించడం జరుగుతుందన్నారు. క్రీడలను ఒక అలవాటుగా మార్చుకుంటే ఆరోగ్యరీత్యా శారీరక దారుఢ్యం తో పాటు మానసికంగా ఆరోగ్యంగా ఉంటారన్నారు. క్రీడలు విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని, క్రీడలలో గెలుపు, ఓటమీలు సహజమే అయినప్పటికీ చిన్నారులలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందిస్తాయని చెప్పారు. క్రీడలతో ఆరోగ్యం మెరుగుపడుతుందన్నారు. ప్రతి విద్యార్థి క్రీడల పట్ల ఆసక్తి చూపడం ద్వారా తమలో నిబిడీకృతమైన ప్రతిభ నైపుణ్యాలను వెలికి వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్పోర్ట్స్ అధికారి శేషగిరిరావు, అర్బన్ రేంజ్ బి. దిలీప్ కుమార్, పిడి సర్వ శిక్ష అభియాన్ కాకినాడ సెట్రాజ్ విభాగానికి చెందిన గౌతంరాజు, ఎస్.జగన్నాథం, పీటీలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.