-తెలుగు వ్యవహార భాష ఆద్యుడు గిడుగు: జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్
-తెలుగు భాష ఎంతో తియ్యనైనది, సరళమైనది: జెసి శుభం బన్సల్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగు వ్యవహార భాష ఆద్యుడు గిడుగు వెంకట రామమూర్తి అని తెలుగు భాషకు వారు చేసిన ఎనలేని కృషిని వారి జయంతి సందర్భంగా స్మరించుకోవడం మన అందరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ పేర్కొన్నారు. గురువారం ఉదయం స్థానిక జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో తెలుగు భాష దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని గిడుగు రామమూర్తి చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించి జిల్లా కలెక్టర్, జెసి శుభం బన్సల్, డిఆర్ఓ పెంచల కిషోర్ తదితర అధికారులతో కలిసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భoగా జిల్లా కలెక్టర్ ముందుగా అందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ, ప్రతి వ్యక్తీ వారి మాతృ భాషను గౌరవించి ఆ భాషలోనే మాట్లాడాలి అని, మన భాష తెలుగు అని అందులోనే మాట్లాడడం అలవర్చుకోవాలని అన్నారు. గిడుగు వెంకట రామమూర్తి గారు 1863 సం. ఆగస్ట్29 న శ్రీకాకుళం జిల్లా పర్వతాల పేట గ్రామంలో వెంకమ్మ వీర్రాజు దంపతులకు జన్మించారనీ తెలిపారు. తెలుగు భాషోద్యమానికి మూల పురుషుడు, బహు భాషా కోవిదుడు అని, వ్యవహారిక భాషకు ప్రాణం పోసిన వారని తెలిపారు. తెలుగు సాహిత్యాన్ని సరళీకరించి, తెలుగు తీయదనాన్ని సామాన్యుడికి చేరువ చేసేందుకు ఆయన ఎనలేని కృషి చేశారు. ఆయన అందించిన విశిష్ట సేవలకు గుర్తుగా గిడుగు వెంకట రామ్మూర్తి జయంతిని తెలుగు మాతృ భాషా దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుందనీ అన్నారు. మన భాషకు వేల సంవత్సరాల చరిత్ర ఉందనీ, తెలుగు భాషపై మమకారం పెంచుకోవాలని, తెలుగుని భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందనీ గుర్తు చేశారు. ప్రతి జిల్లాలో పెద్ద ఎత్తున స్వర్గీయ గిడుగు రామమూర్తి గారి జయంతిని తెలుగు భాష దినోత్సవాన్ని నిర్వహించాలని ప్రభుత్వ ఆదేశాలు ఇచ్చారని అన్నారు. ఇతర రాష్ట్రాల వారు ఎలాగైతే కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో వారి మాతృ భాషకు ఎంతో ప్రాధాన్యత ఇస్తూ అందులోనే మాట్లాడ్డం చూస్తున్నామని, మన రాష్ట్రంలో కూడా మన కుటుంబాల్లో పూర్తి స్థాయిలో తెలుగులోనే మాట్లాడాలని, తెలుగులో మాట్లాడడం నామోషీ గా భావించే పరిస్థితులు ఉండరాదని, తెలుగు భాషలో మాట్లాడడం మనకు గర్వంగా భావించాలని తెలుపుతూ, ఇంగ్లీష్ కూడా ముఖ్యమే కానీ తెలుగు మన ప్రధాన భాష అని గుర్తెరగాలని అన్నారు. మన తెలుగు మాతృ భాషను గౌరవిస్తూ ప్రతి ఒక్కరూ తెలుగు భాషలో మాట్లాడాలి అని తెలిపారు. చిన్న వయసు నుండి పిల్లలకు ముందుగా స్పష్టంగా అర్థమయ్యే భాష మాతృ భాష అని, మన ఆంధ్ర రాష్ట్రానికి చెందిన మాతృ భాష మన తెలుగు భాష అని అన్నారు.
జెసి శుభం బన్సల్ మాట్లాడుతూ వేరే రాష్ట్రం నుండి వచ్చిన తనకు తెలుగు భాషపై అవగాహన ఉందని, తెలుగు భాష ఎంతో తీయనైనది, కమ్మనైనది అని కొనియాడారు. ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ గా గుర్తించబడిన గొప్ప భాష మన తెలుగు భాష అని తెలిపారు. డిఆర్ఓ మాట్లాడుతూ తెలుగు మాతృ భాష వ్యవహారిక భాషగా, సరళ భాషగా మన అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చిన గిడుగు విశేషమైన కృషి ఎనలేనిది అని, శ్రీకృష్ణ దేవరాయలు మెచ్చి వారు తెలిపిన మాటలు దేశ భాషలందు తెలుగు లెస్స అని తెలిపిన మాటలు గుర్తు చేశారు. అనంతరం కలెక్టర్ గారు పలువురు తెలుగు భాషా కోవిదులను సముచితంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి బాల కొండయ్య, కలెక్టరేట్ సిబ్బంది, ఇతర శాఖల సిబ్బంది, తెలుగు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.